రామ నామం.. యువ మంత్రం

కన్నవాళ్లు మెచ్చే గుణాలు...కన్నెపిల్ల కోరుకునే లక్షణాలు..నమ్మినవాళ్లకి ఆపన్నహస్తాలు...ఇవి శ్రీరామచంద్రుడి గుణగణాలు. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఆయన నుంచి మనం ఏం నేర్చుకోగలం?

Updated : 09 Apr 2022 04:34 IST

కన్నవాళ్లు మెచ్చే గుణాలు...
కన్నెపిల్ల కోరుకునే లక్షణాలు..
నమ్మినవాళ్లకి ఆపన్నహస్తాలు...
ఇవి శ్రీరామచంద్రుడి గుణగణాలు. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఆయన నుంచి మనం ఏం నేర్చుకోగలం?

ఓరిమి: సీతమ్మని రావణుడు అపహరిస్తే తిరిగి సొంతం చేసుకోవడం కోసం రోజులు, నెలలు, ఏళ్లు ఎదురుచూశాడు రాముడు. దశకంఠుడిని అంతమొందించి అర్ధాంగిని సొంతం చేసుకున్నాడు. ఒక్కోసారి లక్ష్యం చేరడానికి ఏళ్లు పట్టొచ్చు. ఓర్పు వదలొద్దు.

భావోద్వేగాలపై పట్టు: రాముడు దైవాంశ సంభూతుడు, రాజకుమారుడు, ఎంతోమంది అసురులను అంతమొందించిన శక్తిశాలి. అయినా ఏనాడూ తానే గొప్పని విర్రవీగలేదు. కోపం, కష్టం, విజయం.. అన్నింట్లోనూ శాంతంగానే ఉన్నాడు. ముఖంపై చిరునవ్వు చెదరనీయలేదు. యువత కష్టనష్టాల్లో విచక్షణ కోల్పోవద్దు.

స్నేహశీలి: ఎంత బలపరాక్రమశాలి అయినా చిన్నాపెద్దా తేడా లేకుండా స్నేహానికి ప్రాణం ఇచ్చే గుణం రాముడిది. హనుమంతుడు, జఠాయువు, వానరులు అందరికీ స్నేహహస్తం అందించాడు. శత్రువు తమ్ముడైనా.. స్నేహం కోరి వచ్చిన విభీషణుడిని అక్కున చేర్చుకున్నాడు. యువత సైతం స్నేహితుల్లేని జీవితం చప్పగా ఉంటుందనే విషయం మరవొద్దు.

సమష్టి కృషి: సమష్టి విజయానికి రామచంద్రుడు నిలువెత్తు నిదర్శనం. లంకకు వారధి నిర్మించడానికి, రావణుడిని అంతమొందించడానికి అందరినీ కలుపుకుపోయాడు. ఉడత సాయం సైతం తీసుకున్నాడు. సమష్టిగా ముందుకెళ్తే విజయం సాధ్యమనే విషయం యువత గుర్తించాలి.

మంచివైపు: కఠిన పరిస్థితుల్లోనూ రాముడు ధర్మం, విలువలు వదల్లేదు. గురువులు, పెద్దల్ని ఎల్లప్పడూ గౌరవించాడు. అందుకే సకల గుణాభిరాముడయ్యాడు. మనం డబ్బు సంపాదించొచ్చు. కెరియర్‌లో బాగా ఎదగొచ్చు. కానీ వ్యక్తిత్వం లేకపోతే మనల్ని ఎవరూ ఇష్టపడరు. గడ్డుకాలంలోనూ అదే కొనసాగిస్తే మంచి మనిషిగా గుర్తింపు పొందుతాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు