Published : 04 Jun 2022 02:35 IST

షిర్లే.. భళారే

ఆల్‌రౌండర్‌ పదానికి సిసలైన నిర్వచనం.. షిర్లే సేథియా.. నటిగానే మనకు పరిచయమైనా, తెర వెనక చెప్పుకోదగినంత ప్రతిభ ఈ  అమ్మడి సొంతం.. వీజే, వ్లాగర్, యూట్యూబర్, గాయకురాలు.. జాబితా పెద్దదే! ‘కృష్ణ వ్రిందా విహారి’ అంటూ కుర్రాళ్ల మనసు దోచేసిన ఈ భామ ఫటాఫట్‌ సంగతులు.

షిర్లే భారత్‌లోని డామన్‌లో పుట్టినా.. కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడటంతో అక్కడే పెరిగింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్లాండ్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఇప్పుడంటే హీరోయిన్‌గా మన ముందుకొచ్చిందిగానీ.. చిన్నప్పుడు వ్యోమగామి కావాలని కలలు కనేదట. గ్రాడ్యుయేషన్‌ కాగానే అక్కడే ఆర్జేగా కెరీర్‌ మొదలుపెట్టింది. మనసు మాత్రం భారత్‌పైనే ఉండేది. హిందీ, సంగీతంపై మమకారంతో యూట్యూబ్‌ చూస్తూనే సరిగమల సాధన చేసేది. 2014లో ‘థోడే సే హమ్‌..’ అంటూ సింగిల్‌ పాడింది. స్వరకల్పన కూడా తనే. తర్వాత ఇంకో నాలుగు ఆల్బమ్స్‌ పాడి, లగేజీ సర్దుకొని ముంబయిలో వాలిపోయింది. గాయకురాలిగా, యూట్యూబర్‌గా మంచి పేరు సంపాదించుకోవడంతో అవకాశం దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. ‘మస్కా’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. తన వీడియోలు, బాలీవుడ్‌ సినిమా చూసి దర్శకుడు అనీష్‌ కృష్ణ తెలుగు సినిమాకి ఎంపిక చేశారు.

తన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకొని తీరాల్సిందే. ముంబయి వచ్చాక రేడియో మిర్చీ ఎఫ్‌.ఎం.లో ఆర్జేగా పని చేసింది. ‘పిక్షనరీ’ పేరుతో తను సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే కార్యక్రమానికి తెగ పాపులారిటీ ఉండేది. అంతకుముందే తను న్యూజిలాండ్‌లోని టాప్‌ 30 యూట్యూబర్లలో ఒకరిగా ఎంపికైంది. టీనేజీ నుంచే మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసేది. ఇండియాకి వచ్చాక స్టేజీ షోలూ మొదలు పెట్టింది. ‘వేకప్‌ సిద్‌’ సినిమాలో తనకెంతో ఇష్టమైన ‘ఇక్తారా..’ పాటని తొలిసారి జనం ముందు పాడింది. టీ సిరీస్‌ సంస్థ నిర్వహించిన యూట్యూబ్‌ పాటల పోటీల్లోనూ గెలుపొందింది. తన పేరుతో ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌కి 38లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇదిగాక షిర్లే గిటార్‌ బాగా వాయిస్తుంది. బొమ్మలు వేస్తుంది. గోళ్లపై అద్భుతంగా బొమ్మలేసే ‘నెయిల్‌ ఆర్టిస్ట్‌’ కూడా.

ఇష్టమైన నటుడు: షారూఖ్‌ ఖాన్‌

నటి: హిల్లరీ డఫ్‌

అభిమానించేది: పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌

మొదటి క్రష్‌: విరాట్‌ కోహ్లి

భయపడేది: బొద్దింకలు

ఒక్కరోజూ విడిచి ఉండలేనిది?: ఫోన్‌

నిక్‌నేమ్‌: షార్న్స్‌

మెచ్చే సామాజిక మాధ్యమం: వాట్సప్‌

ఇష్టమైన ప్రదేశం: ఇల్లు

బాగా బోర్‌ కొడితే?: వంట చేస్తుంది 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు