ప్రపంచకప్పులో మన ఫిఫాసులు

నవంబరు 20న ఫిఫా ప్రారంభోత్సవాల్లో బాలీవుడ్‌ భామ నోరా ఫతేహి ఆడిపాడింది. ఆమె ఆటాపాటకి ఫుట్‌బాల్‌ అభిమానులు ఫిదా అయిపోయారు.

Updated : 10 Dec 2022 00:39 IST

హెడ్డింగ్‌ చూసి అవాక్కయ్యారా? అసలు ప్రపంచకప్‌నకు మన జట్టు అర్హతే సాధించలేదు.. ఈ మెరుపులేంటీ.. అంటారా? మన ఆటగాళ్లు బరిలోకి దిగకపోయినా ఫుట్బాల్‌ వరల్డ్‌కప్‌ మొదలైన నాటి నుంచి భారతీయులు ఏదోరకంగా వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఇలా..

నోరా మెరుపులు: నవంబరు 20న ఫిఫా ప్రారంభోత్సవాల్లో బాలీవుడ్‌ భామ నోరా ఫతేహి ఆడిపాడింది. ఆమె ఆటాపాటకి ఫుట్‌బాల్‌ అభిమానులు ఫిదా అయిపోయారు. కార్యక్రమం చివర్లో మువ్వన్నెల జెండాని గర్వంగా ఎగరేసింది నోరా. ఆ విశ్వవేదికపైనే ‘జైహింద్‌’ అని నినాదం చేసింది.

అభిమానం టాప్‌: ఆటతోపాటు స్టేడియాల్లో అభిమానులు ఉంటేనే ఫిఫాకి అందం. వాళ్లు గోల చేసినప్పుడే ఆటగాళ్లకి కిక్‌. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వరల్డ్‌కప్‌ మైదానాల్లో సందడి చేస్తున్న అభిమానుల్లో సౌదీ అరేబియా తర్వాత స్థానం మనదే. అన్ని మ్యాచ్‌లలో కలిపి సౌదీఅరేబియా ప్రేక్షకులు 77,106 టికెట్లు కొనుగోలు చేస్తే.. భారతీయుల సంఖ్య 56,893.

బహుమతులన్నీ మనవే: మంచి ప్రతిభ చూపిన ఆటగాళ్లకు.. ట్రోఫీలు, జ్ఞాపికలు, గిఫ్ట్‌ బాక్సులు ఇవ్వడం రివాజు. ఈసారి అన్నీ కలిపి రెండు వేలు పంచుతున్నారు. ఇందులో కొన్ని ఖరీదైన బంగారం, వజ్రాలు పొదిగిన ట్రోఫీలతోపాటు.. మొజాయిక్‌ చెక్కడాలు, హస్తకళా ప్రతిమలు సైతం ఉన్నాయి. వీటన్నింటినీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఆగ్రాలోని అద్జియాన్‌ హ్యాండీక్రాఫ్ట్‌ వర్స్క్‌ అనే సంస్థ తయారు చేస్తోంది.

తారల సందడి: ఫైనల్‌ మ్యాచ్‌ తిలకించడానికి బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌సింగ్‌కి అధికారికంగా ఆహ్వానం అందింది. మరో హీరో సిద్ధాంత్‌ చతుర్వేది దోహా వెళ్లి మ్యాచ్‌లు తిలకించాడు. అమెరికన్‌ ర్యాపర్‌ లిటిల్‌ బేబీతో సెల్ఫీలూ దిగాడు.

దీపిక సొగసులు: మ్యాచ్‌లు చివరికొచ్చేకొద్దీ కప్‌ ఎవరు నెగ్గుతారో అని ఉత్కంఠ పెరుగుతోంది. దాంతోపాటే కప్‌ ఎలా ఉండనుంది అనే ఉత్సుకతా సాకర్‌ అభిమానుల్లో సహజమే. ఈ ట్రోఫీని ఆవిష్కరించబోయేది మన బాలీవుడ్‌ అందం దీపికా పదుకొణెనే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు