‘కారు టైరు పేలింది సర్‌..’

ఎంబీఏలో ‘కార్పొరేట్‌ ఫైనాన్స్‌’లో మాకు ప్రత్యేకంగా నెలవారీ టెస్ట్‌లు పెట్టేవారు. ఓసారి పరీక్షకు నేను, నా రూమ్మేట్స్‌ ముగ్గురు అసలేమీ చదవలేదు.

Published : 22 Jun 2024 01:37 IST

ఎంబీఏలో ‘కార్పొరేట్‌ ఫైనాన్స్‌’లో మాకు ప్రత్యేకంగా నెలవారీ టెస్ట్‌లు పెట్టేవారు. ఓసారి పరీక్షకు నేను, నా రూమ్మేట్స్‌ ముగ్గురు అసలేమీ చదవలేదు. పైగా ముందురోజు అర్ధరాత్రి వరకూ క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తుండిపోయాం. ప్రిపరేషన్‌ లేదు.. ముందురోజు పుస్తకమైనా పట్టుకోలేదు! ఇంక పరీక్ష ఎలా రాయగలం? అందుకే ఎగ్జామ్‌ తప్పించుకోవడానికి ఒక పథకం వేశాం. ఓ గంట ముందు సర్‌ దగ్గరికి వెళ్లి ‘సర్‌.. మేం నిన్న పొద్దున ఒక ఫ్రెండ్‌ పెళ్లికి వెళ్లాం. తిరిగొస్తుంటే మధ్యలోనే మా కారు టైరు పేలింది. రాత్రంతా దాన్ని మరమ్మతు చేయించి ఇంటికొచ్చేసరికి ఈ సమయం అయ్యింది’ అంటూ అడ్డంగా అబద్ధం చెప్పేశాం. సర్‌ నమ్మాలని దుస్తులకు మట్టి, అక్కడక్కడా గ్రీజు కూడా పూసుకున్నాం. మా వాలకం చూసి ఆయన సరేనన్నారు. తర్వాత మాకు ప్రత్యేకంగా పరీక్ష పెడతామన్నారు. అలా గండం గడిచిందని సంబరపడ్డాం. వారమ య్యాక మా నలుగురినీ పిలిచి, నాలుగు మూలల్లో కూర్చోబెట్టారు. పరీక్ష పత్రం చేతిలో పెట్టారు. అందులో రెండే ప్రశ్నలున్నాయి. ఒకటి మా వివరాలు.. రెండోది టైరు పేలిన కారు నెంబరు, రంగు, ఏ ప్రదేశంలో ప్రమాదం జరిగింది, సమయం.. ఇలా అన్ని వివరాలు రాయమన్నారు. ముందే మేం ఏమీ అనుకోకపోవడంతో.. నలుగురం నాలుగు రకాలుగా సమాధానాలు రాసి దొరికిపోయాం. మేం అతి తెలివి ప్రదర్శిస్తే.. మా లెక్చరర్‌ మమ్మల్ని అందరిముందూ ఫూల్స్‌ని చేశారు. అప్పుడు మాకు అర్థమయ్యిందేంటంటే.. తప్పు చేసినా దానికీ ఓ పక్కా ప్రణాళిక ఉండాలని. 
ఎండీ అష్రాఫ్, హైదరాబాద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని