సరసమైన..రియల్‌ ఎస్టేట్‌ ప్రేమ..

సుందరీ.. ‘సరసమైన ధరలో మా దగ్గర స్థలాలు అందుబాటులో ఉన్నాయి...’ అని మాట కలిపినప్పుడే నీ తీయని గొంతులోని సొగసుకి ఫిదా అయ్యాను.

Published : 22 Jun 2024 01:37 IST

సుందరీ.. ‘సరసమైన ధరలో మా దగ్గర స్థలాలు అందుబాటులో ఉన్నాయి...’ అని మాట కలిపినప్పుడే నీ తీయని గొంతులోని సొగసుకి ఫిదా అయ్యాను. ‘గేటెడ్‌ కమ్యూనిటీలు.. విల్లా ప్రాజెక్టులు.. వ్యక్తిగత ఇల్లు మీకు నచ్చినట్టుగా నిర్మాణం చేసి ఇస్తున్నాము’ అని నువ్వు ముద్దుముద్దుగా చెబుతుంటే నీకోసం నా గుండె గేటు తెరుచుకుంది. ‘తూర్పు, దక్షిణ ప్రాంతంలో రాజధాని ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. త్వరలో ఐటీ పార్కు మొదలవుతుంది. ఎన్నో కొత్త ప్రాజెక్టులు రావడానికి సిద్ధమవుతున్నాయి’ అని మాటలతో కనికట్టు చేస్తుంటే.. 

నా కలల సౌధం సంగతి మర్చిపోయి.. నీతో కలల్లో విహరించడం మొదలు పెట్టాను. ‘ఒక్కసారి మా వెంచర్‌లో పెట్టుబడులు పెట్టండి. మీ డబ్బు అమాంతం రెట్టింపు అవుతుంది’ అని నమ్మబలికితే.. రోడ్డు పక్కన ఉన్న నా స్థలం అమ్మేసి, ఎలాగైనా నీ గుండెలో చోటు దక్కించుకోవాలని నువ్వు చెప్పిన ధరకే కొనేశాను. నెల తిరక్కముందే నువ్వు మళ్లీ ఫోన్‌ చేసి ‘సార్‌.. విమానాశ్రయ మార్గంలో మా మరో టౌన్‌షిప్‌ మొదలవుతోంది. అది ఐటీ కారిడార్‌కి అతి చేరువ. రూపాయి పెడితే పది రూపాయలవుతుంద’ని ఊరించావు. పెరిగే రూపాయల సంగతి అటుంచి.. నీ రూపం అయినా చూడవచ్చనే ఆశతో అప్పు చేసి మరీ అక్కడా ఫ్లాట్‌ కొనేశాను. ఇంటర్నేషనల్‌ స్కూల్, ఇంజినీరింగ్‌ క్యాంపస్, వ్యాపార కట్టడాలంటూ నువ్వు చెప్పిన ఏ ఒక్కటీ రాలేదు. ఆ స్థలాల ధరలు పెరగలేదు సరికదా.. నా అప్పులన్నీ ఈ రెండుమూడేళ్లలోనే రెట్టింపు అయ్యాయి. నా స్థలం విలువ పాతాళానికి పడిపోతున్నా.. నీమీద ప్రేమ మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. నువ్వు చేసిన మోసాన్ని ఎప్పుడో మాఫీ చేశానుగానీ.. దయచేసి ఒక్కసారి అయిన నువ్వు కనిపించు.. లేదా వినిపించు. చూసి మురిసిపోతాను. అప్పుల బాధ నుంచి కాస్తైనా ఉపశమనం పొందుతాను.  

నల్లపాటి సురేంద్ర, అనకాపల్లి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని