మేం పాడితే దేశమే ఆడదా!

లక్షలమంది కల.. కోట్లమంది ఆసక్తిగా చూసే పోటీ... గెలిస్తే కెమేరా ఫ్లాష్‌లు.. సినిమాల్లో పాడమంటూ ఆహ్వానాలు... కోట్ల నజరానాలు.. రాత్రికి రాత్రే సెలెబ్రెటీ హోదా... ఇదీ సుస్వరాల సంగీత ఝరి ఇండియన్‌ ఐడల్‌ ఘనత... ఈ ప్రతిష్ఠాత్మక సమరంలో ఒక్కసారి గొంతు సవరిస్తేనే గొప్ప... అలాంటిది ఇద్దరు తెలుగు తేజాలు ఏకంగా ఫైనల్స్‌కి దూసుకెళ్లారు...

Published : 01 Apr 2017 01:31 IST

మేం పాడితే దేశమే ఆడదా!

లక్షలమంది కల.. కోట్లమంది ఆసక్తిగా చూసే పోటీ... గెలిస్తే కెమేరా ఫ్లాష్‌లు.. సినిమాల్లో పాడమంటూ ఆహ్వానాలు... కోట్ల నజరానాలు.. రాత్రికి రాత్రే సెలెబ్రెటీ హోదా... ఇదీ సుస్వరాల సంగీత ఝరి ఇండియన్‌ ఐడల్‌ ఘనత... ఈ ప్రతిష్ఠాత్మక సమరంలో ఒక్కసారి గొంతు సవరిస్తేనే గొప్ప... అలాంటిది ఇద్దరు తెలుగు తేజాలు ఏకంగా ఫైనల్స్‌కి దూసుకెళ్లారు... విజేతగా నిలవడానికి అడుగు దూరమే ఉందిక... ఈ స్థాయికి చేరిన వారి స్వర ప్రయాణం.. వ్యక్తిగత ఆసక్తులు.. కబుర్లు.

పదమూడేళ్ల కిందట మొదలైనా.. ఇండియన్‌ ఐడల్‌ ఔత్సాహిక గాయనీ, గాయకులందరికీ ఇప్పటికీ ఫేవరిట్టే. సోనీ టీవీలో ప్రసారమవుతున్న ఏడో సీజన్‌కి అనూమాలిక్‌, సోనూనిగమ్‌, ఫరాఖాన్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మన తెలుగు కుర్రాళ్లు్ల లొల్ల వెంకట రేవంత్‌ కుమార్‌, పరిటాల నాగ వెంకట సాయి రోహిత్‌లు మొదట్నుంచీ సత్తా చూపిస్తూ ఫైనల్‌కి చేరారు.

రాక్‌స్టార్‌ పాటగాడు

‘పాటంటే నాకు ప్రాణం’ ప్రతీ సింగర్‌ చెప్పే మాటే. చేతల్లో చూపించమంటే?? రేవంత్‌ మాత్రం పాట కోసం చదువే వదిలేశాడు. హోటళ్లలో పని చేశాడు. సాఫీగా సాగిపోతున్న కెరీర్‌కి బ్రేక్‌ పడుతుందని తెలిసీ ఇండియన్‌ ఐడల్‌కి వచ్చేశాడు. పాటంటే అంతిష్టం మరి.

రేవంత్‌ సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. సంగీత నేపథ్యమున్న కుటుంబమూ కాదు. అయినా టాలీవుడ్‌లో వందల పాటలు పాడాడు. పదుల కొద్దీ రియాలిటీ షోల విజేతగా నిలిచాడు. ఇదెలా సాధ్యం అంటే మళ్లీ అతడికి పాటంటే ప్రాణం అన్నదే సమాధానం. తను శ్రీకాకుళంలో పుట్టాడు. వైజాగ్‌లో పెరిగాడు. వేద పాఠశాలలో చదివాడు. వేదాలు, భగవద్గీత కంఠస్తం చేసేవాడు. ఆ క్రమంలోనే పాటపై మమకారం మొదలైంది. గురువులు ప్రోత్సహించేవారు.

చదువు వదిలేసి...
‘హైదరాబాద్‌ వెళితే సినిమాల్లో పాడొచ్చు. కెరీర్‌ బాగుంటుంది’ ఎవరో చెబితే డిగ్రీ ఫైనలియర్‌కి ఎగనామం పెట్టేసి సిటీలో వాలిపోయాడు. అవకాశం సంగతలా ఉంచితే సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో డబ్బులు అడగాలంటే మొహమాటం. హోటళ్లొ కేటరింగ్‌ బోయ్‌గా చేరాడు. పేపర్లు వేశాడు. అడిగినవన్నీ సమకూర్చే మావయ్యలున్నా ఒకరిపై ఆధారపడొద్దనే మనస్తత్వం. అలా కష్టపడుతూనే రియాలిటీ షోల్లో మెరిసి సినిమా అవకాశాలు అందుకున్నాడు. మర్యాద రామన్నలో ‘ఉద్యోగం వూడిపోయిందీ...’ పాటతో వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికి రెండు వందల పాటలు పాడాడు. గళమే కాదు.. రేవంత్‌ ఒంట్లో ఉత్సాహమూ ఎక్కువే. చేతిలో మైక్‌, ఎదురుగా ప్రేక్షకులు ఉంటే చెలరేగిపోతాడు. ఒకర్ని ఇంప్రెస్‌ చేసే ఉద్దేశం కాదిది. పోటీలో గెలవడం కాదు.. అందులో పాల్గొనడాన్నే విజయంగా భావిస్తాడు. అందుకే ప్రతి పోటీనీ అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ పాడతాడు.

హీరోయిన్లతో స్టెప్పులు
టాలీవుడ్‌ సింగర్‌గా రాణిస్తున్నాడు. అయినా పెద్ద వేదికలపై నిరూపించుకోవాలనే కసి. తనపై తనకు నమ్మకముంది. ఇండియన్‌ ఐడల్‌ తలుపు తట్టింది. ‘నీకు హిందీ రాదు. అక్కడికెళ్లి ఫూల్‌ అవుతావ్‌. ఇక్కడి అవకాశాలూ పోతాయ్‌’ కొందరు భయపెట్టారు. వెరవలేదు. సంగీతానికి భాష అడ్డంకి కాదని అతడికి తెలుసు. హిందీ పాటల్ని తెలుగు, ఇంగ్లిష్‌లో రాసుకొని సాధన చేసేవాడు. ‘నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. అదే నీకు పెద్ద సపోర్ట్‌’ అమ్మ మాట పదేపదే గుర్తు చేసుకునేవాడు. ఆపై అంతా చరిత్రే. విరహం.. హుషారు.. డ్యూయెట్‌.. జానపదం.. ఇండిపాప్‌.. ఏ పాటైనా అవలీలగా పాడేశాడు. జడ్జీలతోపాటు అతిథులూ మైమరిచిపోయారు. అనూమాలిక్‌ అయితే తర్వాతి సినిమాలో అవకాశం ఇస్తానని స్టేజీ మీదే చెప్పేశాడు. ఫరాఖాన్‌ ‘నీది హీరో వాయిస్‌. ఏదైనా పాడతావ్‌’ అని మెచ్చుకుంది. హీరో షాహిద్‌కపూర్‌ రేవంత్‌కి ఓటేయండి అంటూ వ్యక్తిగతంగా అందరికి చెప్పాడు. సోనాక్షిసిన్హా, కంగనా రనౌత్‌లు రేవంత్‌తో కలిసి స్టెప్పులేశారు. సామాజిక మాధ్యమాల్లో అయితే తనో హీరో. నువ్వే ఇండియన్‌ ఐడల్‌ అంటూ పొగడ్తలు.. నన్ను పెళ్లాడతావా అంటూ అమ్మాయిల ప్రపోజళ్లు. అయినా అందరి సహకారం, ఆశీర్వాదాలతోనే ఇంత దూరం రాగలిగానని వినమ్రంగా చెబుతున్నాడు రేవంత్‌.

* ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయేతత్వం * బాహుబలిలో మనోహరి బాగా పేరు తీసుకొచ్చిన పాట * రెహమాన్‌, కీరవాణిలంటే అభిమానం * రేవంత్‌ది ఉమ్మడి కుటుంబం. అదే నా బలమంటాడు * స్టెల్‌గా ఉండటం.. హెయిర్‌స్టెల్‌తో ప్రయోగాలు చేయడం ఇష్టం * తను పుట్టేసరికే నాన్న చనిపోవడం తీరని బాధ

రేవంత్‌ 

పదహారేళ్ల పట్టుదల

చిట్టిపొట్టి మాటలు మాట్లాడ్డం మొదలైన నాటి నుంచే రోహిత్‌కి పాటపై ఆసక్తి మొదలైంది. ఇలా చెప్పడం కొంచెం అతిశయంగానే ఉన్నా అది నిజం. అమ్మానాన్నలు టేప్‌రికార్డర్‌, టీవీల్లో పాటలు వింటుంటే చెవులొగ్గేవాడు చిన్నారి రోహిత్‌. అదే పనిగా ట్యూన్‌ వింటూ హమ్‌ చేసేవాడు. ఆలిండియాలో సింగర్‌గా పనిచేసే మేనత్త ఆ ప్రతిభను గుర్తించారు. సరిగమల సాధన చేయించారు. ఆమె నేర్పిన పాటలే స్కూళ్లొ పాడుతూ బహుమతులు గెల్చుకునేవాడు. పాటలోని మత్తు, విజయం ఇచ్చే కిక్‌ చిన్నప్పుడే ఒంట పట్టింది. ఆ ఆసక్తికి మరింత సానబెట్టేందుకు రోహిత్‌కి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు అమ్మానాన్నలు. కాలేజీ స్థాయికొచ్చేసరికి పదుల ప్రైజులు గెల్చుకున్నాడు. పలు సింగింగ్‌ రియాలిటీ షోల్లో విజేతగా నిలిచాడు. ఈటీవీ పాడుతా తీయగాతో ఇంటింటికీ పరిచయమయ్యాడు.

అనుకోని ఉపద్రవం
అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఎంతో ఇష్టపడే అమ్మకి బ్రెయిన్‌ ట్యూమర్‌ అనే దుర్వార్త్త. ఒక్కసారిగా అతడి లోకం చీకటైంది. విపరీతమైన కుంగుబాటుకి లోనయ్యాడు. ఆ బాధలోంచి బయటికి రాలేక ఒకానొక దశలో సంగీతాన్నే వదిలేద్దాం అనుకున్నాడు. ఒక్క మనిషి వల్ల మన కుటుంబం చెడిపోద్దనీ, నీ కెరీర్‌ పాడుచేసుకోవద్దనీ అమ్మ వేడుకుంది. నెమ్మదిగా ఒత్తిడి నుంచి కోలుకున్నాడు. తల్లిసైతం అనారోగ్యం నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యవంతురాలైంది. రోహిత్‌ మళ్లీ పాట అందుకున్నాడు.

ఇండియన్‌ ఐడల్‌లో మెరుపుల్‌...
రోహిత్‌ కేవలం రా వాయిస్‌తో ఒక పాట పాడి ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్‌కి పంపాడు. ముంబయికి రమ్మని కబురందింది. వెళ్లి అక్కడ పాడితే ‘వాహ్‌.. క్యా సింగర్‌ మిలా?’ అన్నారు అనూమాలిక్‌. నేరుగా టాప్‌ 20కి ఎంపిక చేశారు. ఇక స్టేజీ మీదకెక్కాక పొగడ్తలు పోటెత్తాయి. ‘లగన్‌ లగన్‌..’ పాట పాడాక ‘నీ గొంతులో నా పాట విన్నాక నా మనసుకు శాంతి కలిగింది’ అన్నారు స్టార్‌ సింగర్‌ సుఖ్విందర్‌సింగ్‌. పరిణీతిచోప్రా నేను నీకు పెద్ద ఫ్యాన్‌ని అంది. ఒక క్లాసికల్‌ సాంగ్‌ పాడాక సోనూ నిగమ్‌ అయితే టేబుల్‌ ఎక్కి మరీ చప్పట్లు కొట్టాడు. రాజస్థానీ ఫోక్‌ సాంగ్‌తో అదరగొడితే నువ్వు పాడని పాటలేదు నాగ అని ముద్దు చేసింది ఫరాఖాన్‌. ఒక తెలుగు కుర్రాడు హిందీ వేదికపై ఇంతగా ఎలా రాణించాడంటే తనకి పాటంటే ప్రాణం. భాషేదైనా. జగ్‌జీత్‌సింగ్‌ గజల్స్‌ని, హిందుస్థానీ సంగీతాన్ని ఆరాధిస్తాడు. అందుకే హిందీ సమస్య కాలేదు. పాశ్చాత్య, సంప్రదాయ, జానపదం.. ఏ జానర్‌నైనా అలవోకగా పాడేస్తూ ఫైనల్‌కి వచ్చాడు. అన్నట్టు.. షో ప్రారంభానికి ముందు కాస్త సిగ్గరితనంతో ఉన్న రోహిత్‌ ఇప్పుడు స్టెప్పులతోనూ అదరగొడుతున్నాడు. అదే ఉత్సాహంతో ఇండియన్‌ ఐడల్‌ గెలుస్తానంటున్నాడు.

* టాలీవుడ్‌లో దాదాపు అందరు సంగీతదర్శకుల దగ్గర పాడాడు * వైజర్సు బాలసుబ్రహ్మణ్యం, రామాచారి గురువులు * ఎస్పీబాలు, రెహమాన్‌లంటే విపరీతమైన అభిమానం * చెల్లి రవళితో అనుబంధమెక్కువ. బయటికెళ్తే తనెదురు రావాల్సిందే

రోహిత్‌


గెలిపించండి

తెలుగువాళ్లు ఇండియన్‌ ఐడల్‌గా నిలవాలంటే ప్రేక్షకుల ఓటింగే కీలకం. రేవంత్‌, రోహిత్‌లు ఇండియన్‌ ఐడల్‌గా గెలవాలంటే indianidol.sonyliv.com/online votingcontestants వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు నచ్చినవారికి ఓటు వేయవచ్చు. సోనీ లైవ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని కూడా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఏప్రిల్‌ 2, ఆదివారం ఉదయం ఏడుగంటల వరకు ఈ అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని