ఆటగాడు... రికార్డుల వేటగాడు!

మారథాన్‌లో లిమ్కాబుక్‌ రికార్డులు... సైక్లింగ్‌లోనూ రాణించిన సత్తా... క్రికెట్‌లో విదేశీ క్లబ్‌ల తరపున ఆడిన అనుభవం... క్రీడల్లో ప్రతిభ చూపించడమే కాదు... ఆటతో సామాజిక చైతన్యానికీ పాటుపడుతున్న వైనం...

Published : 29 Apr 2017 02:08 IST

ఆటగాడు... రికార్డుల వేటగాడు! 

మారథాన్‌లో లిమ్కాబుక్‌ రికార్డులు... సైక్లింగ్‌లోనూ రాణించిన సత్తా... క్రికెట్‌లో విదేశీ క్లబ్‌ల తరపున ఆడిన అనుభవం... క్రీడల్లో ప్రతిభ చూపించడమే కాదు... ఆటతో సామాజిక చైతన్యానికీ పాటుపడుతున్న వైనం... ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు ఇవన్నీ చేశాడంటే సమ్‌థింగ్‌ స్పెషలే! అతగాడే చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుర్రాడు విజయ్‌ బొడ్డుపల్లి...ఇప్పటికే మూడు ఖండాల్లో హాఫ్‌ మారథాన్‌ పూర్తిచేసి... మరో నాలుగు ఖండాల్లో పరుగుకు సిద్ధమై ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క భారతీయుడిగా నిలిచే రికార్డుపై గురి పెట్టాడు. ఈ సందర్భంగా అతడితో మాట కలిపింది ఈతరం.

 
బాగా చదివితే మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే ఆటలపై దృష్టిపెడితే పేరు, డబ్బూ అన్నీ వస్తాయ్‌. అంతకుమించి శారీరకంగా ఫిట్‌గా ఉండొచ్చు అన్నది విజయ్‌ మాట. దాన్ని అక్షరాలా పాటించి చూపిస్తున్నాడు తను.

చెన్నై చంద్రుడు
ప్రకాశం జిల్లా చీరాల విజయ్‌ సొంతూరు. అమ్మానాన్నలు ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడ్డారు. బాగా చదవాలనో... మంచి ఉద్యోగం సంపాదించాలనో కన్నవాళ్లెపుడూ అతడ్ని బలవంతపెట్టలేదు. ఏ ఒత్తిడి లేకపోవడంతో చిన్నప్పుడే ఆటపై మమకారం పెంచుకున్నాడు. అథ్లెటిక్స్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, రగ్బీ... ఏ గేమ్‌నూ వదల్లేదు. సాటి కుర్రాళ్లంతా చదువులు, సరదాల్లో మునిగితేలుతుంటే విజయ్‌ మాత్రం మైదానాల్లో సాధన చేసేవాడు. వారాంతాలు, సెలవుల్లో కూడా. ఈ వూపుతో ఆరో తరగతిలోనే చేతిరాతతో క్రికెట్‌ ఆటపై ఓ పుస్తకం రాసేసి సెభాష్‌ అనిపించుకున్నాడు. ఈ ఇష్టంతో ఆఖరికి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌తో ఎంబీఏ కూడా పూర్తి చేశాడు.

క్రీడల్లో మేటి
క్రికెట్‌లో కింగ్‌: స్కూల్‌, కాలేజీ, క్లబ్‌ స్థాయిలో సత్తా చాటడంతో 2007లో మాల్దీవుల్లోని ఓ క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడే అవకాశం వచ్చింది. అక్కడ టోర్నీల్లో ప్రతిభ చూపాడు. ఆపై కెన్యా, జింబాబ్వేల్లోనూ ఆడాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ల్లో విజయ్‌ చూపుతున్న ప్రతిభ తెగ నచ్చేయడంతో చికున్యా అనే స్టార్‌ బ్యాట్స్‌మన్‌ తన కొడుక్కి విజయ్‌ పేరే పెట్టుకున్నాడు.

సైక్లింగ్‌: మనోడు సైక్లింగ్‌లోనూ దిట్టే. ఇరవై ఏళ్ల వయసపుడే గేర్లు లేని సైకిల్‌పై సాగే 16 కిలోమీటర్ల రేస్‌లో పాల్గొన్నాడు. తర్వాత 80 కిమీలు, 125 కిమీల రేస్‌లు పూర్తిచేసి ఫ్రాన్స్‌ ప్రొఫెషనల్‌ సైక్లింగ్‌ ఈవెంట్‌ ‘బ్రెవెట్‌’కి అర్హత సాధించాడు. చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు 200 కిమీల రేసును పదమూడున్నర గంటల్లో పూర్తిచేసి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

మారథాన్‌ మొనగాడు: విజయ్‌ తొలిసారి 21 అడుగులతో పరుగు ప్రారంభించాడు. చెన్నైలో రోజుకి 21 కిమీల చొప్పున వరుసగా 21 రోజులు హాఫ్‌ మారథాన్‌లో పాల్గొని గతేడాది రెండు లిమ్కాబుక్‌ రికార్డులు బద్దలుకొట్టాడు. ఇదే ఈవెంట్‌లో తెలుగు బుక్‌ అఫ్‌ రికార్డులు, ఇండియాబుక్‌ ఆఫ్‌ రికార్డులూ అతడి సొంతమయ్యాయి. 2017లో యూకేలో జరిగిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ (ఐఏఏఎఫ్‌) హాఫ్‌మారథాన్‌ ఛాంపియన్‌ షిప్‌కి అర్హత సాధించాడు. ఆరు డిగ్రీల ఎముకలు కొరికే చలిలో హాఫ్‌ మారథాన్‌ పూర్తి చేశాడు. అంతకు ముందు 2016లో ఏకంగా 9 హాఫ్‌ మారథాన్‌ల్లో పాల్గొన్నాడు. భోపాల్‌లో నిర్వహించిన 10 కిమీల రివర్స్‌ రన్నింగ్‌ని విజయవంతంగా ముగించాడు.

రగ్బీలో ప్రవేశం: కాలేజీ స్థాయిలో రగ్బీ ఆడిన అనుభవం ఉండటంతో ఒలింపిక్స్‌ ప్రీక్వాలిఫై ఈవెంట్స్‌లో ఉజ్బెకిస్థాన్‌, గువామ్‌ జట్లకు సమాచార సమన్వయ కర్తగా ఉండే లైజన్‌ అఫీసర్‌గా వ్యవహరించాడు.

ఆటతో సామాజిక బాట
విజయ్‌కి తెలిసింది క్రీడలొక్కటే. వీటి ద్వారానే సామాజిక చైతన్యానికి బాటలు వేయాలనుకున్నాడు. చెన్నైలో రోజుకు 25 కిమీల చొప్పున వెయ్యి కిలోమీటర్లు పరుగెత్తాడు. ఈ సమయంలో క్యాన్సర్‌పై అవగాహన కలిగిస్తూ, క్యాన్సర్‌ బాధితులకు ఈ రికార్డు అంకితం ఇచ్చాడు. ప్రచారంలో భాగంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 665 కిమీలు సైక్లింగ్‌ చేశాడు. చెన్నై-పాండిచ్చేరి, చెన్నై-వేలూరు, చెన్నై-మహాబలిపురం ఈవెంట్లలో పాల్గొన్నాడు. త్రిపుర రాష్ట్రం వెళ్లి అక్కడి యువతకు రగ్బీ క్రీడపై మెలకువలు నేర్పించాడు. త్రిపుర ప్లేయర్స్‌ అసోసియేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఆటలతోనే ఆరోగ్యం, మంచి భవిష్యత్తు అని నినదిస్తూ త్రిపుర రాజధాని అగర్తల నుంచి ఉజంత ప్యాలెస్‌ వరకు మిత్రులతో కలిసి వందల కిమీలు పరుగెత్తాడు. తమిళనాడు, పుదుచ్చేరిలతోపాటు ఇప్పటికే ఐదు రాష్ట్రాలను చుట్టేసి మిగతా రాష్ట్రాల్లో అవగాహనా ర్యాలీలు చేపట్టబోతున్నాడు. మే నెలలో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడు.
మో పారా స్ఫూర్తితో
పరుగుతో రికార్డులు నెలకొల్పుతూ, సామాజిక సేవా కార్యక్రమాలకు ముందున్న విజయ్‌లో స్ఫూర్తి రగిలించింది ఇంగ్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత మారథాన్‌ రన్నర్‌ మో పారా. చాలా పేద నేపథ్యం నుంచి వచ్చిన అతగాడు స్వయంకృషితో నెంబర్‌వన్‌గా నిలిచాడు. విజయ్‌ ఒక సందర్భంలో ఇంగ్లండ్‌ వెళ్లి నేరుగా అతడిని కలిశాడు. అతడితో కలిసి హాఫ్‌ మారథాన్‌లో పాల్గొన్నాడు. ఈ జోరు కొనసాగిస్తూ ఏడాది కిందట ఏడు ఖండాల్లో హాఫ్‌ మారథాన్‌ పూర్తి చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఇప్పటికే ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను దాటేశాడు. మిగిలిన ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా పరుగుకు శ్రీకారం చుట్టబోతున్నాడు.

- టి.ప్రభాకర్‌, న్యూస్‌టుడే: చెన్నై

*విజయ్‌కి లాంగ్‌ జంప్‌, బాస్కెట్‌ బాల్‌లోనూ ప్రవేశముంది.
*పలు క్రీడల్లో చూపిన ప్రావీణ్యం, సామాజిక సేవలకు గుర్తింపుగా హరియాణాలోని ప్రథమ రక్షా సమ్మాన్‌ సమితి విజయ్‌కి ‘షాన్‌ ఇ భారత్‌’ ‘హిందుస్థాన్‌ గౌరవ్‌ సమ్మాన్‌’ అవార్డులు ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని