20 పతకాల ఎంబీబీఎస్‌

పదో తరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంకు... ఎంసెట్‌లో 28వ ర్యాంకు...చదువు కొనసాగుతుండగానే అంతర్జాతీయ జర్నళ్లలో పరిశోధక వ్యాసాలు రాసిన సత్తా...ఇప్పుడేమో ఏకంగా ఇరవై పతకాలతో మెడిసిన్‌ పూర్తి... గుంటూరు యువ వైద్యుడు ఏకుల అనుదీప్‌ ఘనతలివి... చదువుపై మమకారం...

Published : 06 May 2017 02:34 IST

20 పతకాల ఎంబీబీఎస్‌

పదో తరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంకు... ఎంసెట్‌లో 28వ ర్యాంకు...చదువు కొనసాగుతుండగానే అంతర్జాతీయ జర్నళ్లలో పరిశోధక వ్యాసాలు రాసిన సత్తా...ఇప్పుడేమో ఏకంగా ఇరవై పతకాలతో మెడిసిన్‌ పూర్తి... గుంటూరు యువ వైద్యుడు ఏకుల అనుదీప్‌ ఘనతలివి... చదువుపై మమకారం... దానికి తగ్గట్టు కష్టపడితే ఏదైనా సాధ్యమే అంటున్న ఈ గుంటూరు యువకుడు యువతకు స్ఫూర్తిదాయకం.

‘బోర్న్‌ ఫర్‌ గ్రేటర్‌ థింగ్స్‌’ అనుదీప్‌ బడి గోడలపై ఉండే ఈ అక్షరాలు అతడి మనసుపై బలమైన ముద్ర వేశాయి. ‘ప్రపంచంలో ఎవరూ చేయనిది నేను చేయాలి. అప్పుడు వచ్చే పేరు, ప్రఖ్యాతులే వేరు’ అని చిన్నపుడు అనుకున్నాడు. వైద్య విద్యార్థిగా మారాక ప్రపంచ వైద్య రంగంలో సరికొత్త వైద్య ఆవిష్కరణలు చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాడు.

అమ్మానాన్నలే ప్రేరణ
అనుదీప్‌ది గుంటూరు. అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. బంధువుల్లోనూ చాలామంది వైద్యులు, ఉపాధ్యాయులు. సహజంగానే వారి ప్రభావం అతడిపై పడింది. బాగా చదివితే మంచి స్థాయికి చేరుకోవచ్చని చిన్నప్పుడే అర్థమైంది. ఇష్టపడి చదివేవాడు. అసలే చదువంటే మమకారం. దానికితోడు సైన్సు మాస్టారు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు పాఠాలు చెబుతూనే ‘ఏవైనా సందేహాలున్నాయా?’ అని పదేపదే అడిగేవారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ప్రతి సందేహాన్ని అనుదీప్‌ ఆయన ముందుంచేవాడు. ఆలోచనల సంఘర్షణలకు, సైన్సు గురించి తెలుసుకోవాలనే తపన తోడైంది.

ర్యాంకుల మొనగాడు
చదువుల యాగం సాగుతుండగా పదో తరగతిలో ఐసీఎస్‌ఈ సిలబస్‌తో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించాడు. బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌గా ఎంపికయ్యాడు. ఓ ప్రైవేటు కాలేజీ ఉచితంగా సీటివ్వడంతో పైసా ఖర్చు లేకుండా ఇంటర్‌ పూర్తి చేశాడు. అక్కడా తన మార్కు చూపిస్తూ బైపీసీలో వెయ్యికి 983 మార్కులు సాధించాడు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంకు సొంతమైంది. పాండిచ్చేరిలోని ప్రఖ్యాత వైద్యసంస్థ జిప్‌మర్‌లో సీటొచ్చింది. అయినా అమ్మానాన్నలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో గుంటూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరాడు.

మేలి మలుపు
బీబీసీలో ప్రసారమయ్యే షెర్లాక్‌ హోమ్స్‌ సీరియల్‌ అనుదీప్‌కి చాలా ఇష్టం. అందులో ఒక నేరానికి సంబంధించిన సంఘటనను అనేక కోణాల్లో పరిశోధించి దోషులెవరో తేలుస్తారు. దాన్ని తన చదువు, వైద్య విద్యకు అన్వయించుకునేవాడు. టీచర్‌ చెప్పే పాఠ్యాంశం ఒక్కదానిపైనే ఆధారపడకుండా స్వయంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునేవాడు. ఏవైనా సందేహాలుంటే అంతర్జాలం జల్లెడ పట్టేవాడు. వైద్యవిద్యకు సంబంధించి దేశ, విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన అధ్యాపకుల ఆడియో, వీడియోలు ఫాలో అయ్యేవాడు. వైద్యరంగంలో ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా దాని మూలాలు తెలుసుకునేదాకా వదిలేవాడు కాదు. పడుకున్నా, టీవీ చూస్తున్నా తరచూ వాటినే మననం చేసుకునేవాడు. మొదట్నుంచీ తను మెరిట్‌ విద్యార్థి కావడంతో జూనియర్లు సందేహాల నివృత్తి కోసం అనుదీప్‌ దగ్గరకు వచ్చేవారు. పదేపదే వారితో బృంద చర్చలు చేయడం అతడికి కలిసొచ్చింది. వీటికితోడు అనుదీప్‌ నాన్న అనుభవజ్ఞుడైన శస్త్రచికిత్స నిపుణుడు. ఆయన రోగులకు శస్త్రచికిత్సలు చేస్తున్నపుడు సర్జన్‌ దుస్తులు వేసుకొని లోపలికి వెళ్లి గమనించేవాడు. సందేహాలు తీర్చుకునేవాడు. స్కూలు, ఇంటర్‌ చదువుతున్నపుడే ఇది కొనసాగేది. అలా తనకు తెలియకుండానే మంచి సర్జన్‌ కావాలన్న లక్ష్యం ఏర్పడింది.

‘మానవుడికి మెదడు సరిగా పనిచేయకపోతే అతను ఉన్నా లేనట్లుగానే భావించాలి. జీవితంలో ఒక వైద్యుడిగా తలమార్పిడి (హెడ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చేసి బ్రెయిన్‌ డెత్‌ అయిన వారిని కాపాడాలనేది కోరిక. అందుకు జనరల్‌ సర్జన్‌, న్యూరోసర్జన్‌ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నా’ అంటున్నాడు ఈ సరస్వతీపుత్రుడు.

గుర్తింపు ఇది

* శవాలు కోసి పరిశోధన చేసేది అనాటమీ సబ్జెక్టు. అత్యధిక శవాలు కోసి వాటిపై అధ్యయనం చేసిన వైద్య విద్యార్థిగా అనుదీప్‌ బంగారు పతకం అందుకున్నాడు.
* ఇతడి ప్రతిభ గుర్తించి అమెరికాలోని జీఎంసీ పూర్వ వైద్య విద్యార్థులసంఘం పలుసార్లు ఆర్థిక నజరానాలు ప్రకటించింది.
* సాధారణ శస్త్రచికిత్సలపై అనుదీప్‌ రాసిన రెండు పరిశోధక వ్యాసాలు ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ కేస్‌ రిపోర్ట్‌, న్యూ బోర్న్‌ మెడిసిన్‌ నేషనల్‌ జర్నల్‌ అనే అంతర్జాతీయ జర్నళ్లల్లో ప్రచురితమయ్యాయి.
* కొందరు పిల్లలకు పుట్టుకతోనే పెద్ద కణుతులు ఏర్పడతాయి. వీటినే మూడో కాలుగా భ్రమిస్తారు. దీనిపై పరిశోధన చేయడానికి భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి కోరాడు. అతడి ప్రతిభ గుర్తించి ఐసీఎంఆర్‌ రెండు ప్రాజెక్టులు మంజూరు చేసింది. పరిశోధనకు సహకరించింది. అవి చివరి దశలో ఉన్నాయి.
* గుంటూరు వైద్య కళాశాలకు చెందిన న్యూరాలజీ విభాగాధిపతి ఆచార్య సుందరాచారి సారథ్యంలో మరో ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నాడు.
* చదవడమే కాదు.. ఇంగ్లిష్‌లో పద్యాలు, నవలలు రాయటమూ అతడికి ఇష్టం. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకున్నాడు.
* ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్‌ వైద్య విద్యలో మొత్తం 20 బంగారు పతకాలు సాధించాడు. వివిధ విభాగాల పరీక్షలు, ఒక్క బ్యాక్‌లాగ్‌ లేని ప్రతిభ, వార్షిక పరీక్షలు తదితరల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పతకాలు దక్కాయి.
* రోజూ పది, పన్నెండు గంటలేం చదవలేదు. ఫలానా పుస్తకాలే తిరగేయాలని లక్ష్యం పెట్టుకోలేదు. గంట చదివినా ప్రణాళికాబద్ధంగా చదివాడు.

- కాకర్ల వాసుదేవరావు, ఈనాడు, అమరావతి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని