నైపుణ్యానికి మెరుగులు.. ఉద్యోగానికి సోపానాలు

ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కోర్సులో చేరాలంటే వేలకువేలు ఫీజు కట్టాలి... ఏజెన్సీ ద్వారా కొలువు కొడితే జీతంలో వాటా ఇవ్వాలి... పనిలో కిటుకులు పట్టేయాలంటే ఏళ్లకొద్దీ ఎదురుచూడాలి... ఇవన్నీ మేం ఉచితంగా ఇస్తాం అంటున్నాడు లంకా రాము... దానికోసం జీరో కాస్ట్‌ హైరింగ్‌ అనే కోర్సుకు రూపకల్పన చేశాడు...

Published : 20 May 2017 04:07 IST

నైపుణ్యానికి మెరుగులు.. ఉద్యోగానికి సోపానాలు

ఉచితంగానే...

ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కోర్సులో చేరాలంటే వేలకువేలు ఫీజు కట్టాలి... ఏజెన్సీ ద్వారా కొలువు కొడితే జీతంలో వాటా ఇవ్వాలి... పనిలో కిటుకులు పట్టేయాలంటే ఏళ్లకొద్దీ ఎదురుచూడాలి... ఇవన్నీ మేం ఉచితంగా ఇస్తాం అంటున్నాడు లంకా రాము... దానికోసం జీరో కాస్ట్‌ హైరింగ్‌ అనే కోర్సుకు రూపకల్పన చేశాడు... వందలమందికి ఉపాధి కల్పిస్తూ.. వేలమందికి ఆహ్వానం పలుకుతున్నాడు... గతంలో తాను పడ్డ కష్టాలు పేద విద్యార్థులు పడొద్దనే ఉద్దేశంతో ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు... దీని వెనకాల ఉన్న ఉద్దేశం.. అతగాడు ఎదిగిన నేపథ్యం మీకోసం.చదువైపోగానే చాలామంది విద్యార్థులు ఏదో కోర్సులో చేరి కొలువు సంపాదించాలనే తపనతో నగరానికి చేరతారు. తమ పిల్లలు ప్రయోజకులు కావాలని అప్పులు చేసి మరీ కన్నవాళ్లు వేలకు వేలు పంపిస్తారు. తీరా కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరితే ఏముంటుంది? అక్కడ వెయ్యిమంది కూర్చునే పెద్ద హాలు. మైకులో పాఠాలు. అది ఒక సమావేశంలా ఉంటుందే తప్ప క్లాస్‌రూమ్‌ వాతావరణం ఉండదు. ఈ అరకొర శిక్షణతో ఉద్యోగం సంపాదించేది ఏ కొద్దిమందో. పద్నాలుగేళ్ల కిందటే ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు రాము.

భిన్నమైన శిక్షణ
సంప్రదాయానికి భిన్నంగా ఉండే కోర్సే ‘జీరో కాస్ట్‌ హైరింగ్‌’. ఇక్కడ నయా పైసా ఫీజు తీసుకోరు. క్లాసులుంటాయ్‌.. కానీ నాలుగ్గోడల మధ్య కాకుండా భవిష్యత్తులో ఉద్యోగం చేయబోయేచోట ఎలాంటి విధులు నిర్వర్తించాలో రియల్‌టైమ్‌లో నేర్పిస్తారు. రోజుకి గంటా, రెండుగంటల నిబంధనలేం ఉండవు. 45 రోజులు కఠినమైన శిక్షణలో అన్నివిధాలా రాటుదేలాక స్వయంగా కంపెనీలకు రికమెండ్‌ చేస్తారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, బృంద చర్చలు, టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ రౌండ్‌ దశల్ని సైతం అలవోకగా దాటేలా శిక్షణనిస్తారు. ఆఫీసులో చేయబోయే పనిలోని సమస్యలే ఇచ్చి పరిష్కరించమంటారు. ఫేక్‌ సర్టిఫికెట్ల గోల ఉండదు. నిజమైన అనుభవంతోనే కొలువులో చేరతారు. మరింతకి ఈ కోర్సుకు ఎలాంటి విద్యార్థులను తీసుకుంటారు అంటే.. బీటెక్‌ పట్టా ఉండాలి. పేద విద్యార్థులే కావాలి. ఇదొక్కటే నిబంధన. అలా రాము దగ్గర శిక్షణపొందిన వారిలో వంద మందికిపైగా పలు సంస్థల ఉద్యోగాల్లో చేరారు. ఆపై వాళ్లు పూర్తిగా స్థిరపడ్డాకే ఇష్టంకొద్దీ ఏదైనా ఇస్తే తీసుకుంటాడు. లేదంటే అదీ లేదు.ప్రణాళిక ప్రకారమే
రాము 9 ఆర్ట్స్‌ మీడియా అనే సంస్థ అధినేత. మొదట్లో తన కంపెనీ కోసం కొందరు ఉద్యోగులను తీసుకోవాలనుకున్నాడు. కొలువు కోసం వచ్చేవాళ్లలో ఎక్కువమంది అరకొర పరిజ్ఞానం ఉన్నవాళ్లే తగిలారు. వేల రూపాయలు పోసి పలు రకాల కోర్సుల్లో శిక్షణ తీసుకున్నా చాలామందిలో విషయం లేకపోవడం గమనించాడు. ఎందుకిలా? సమస్య ఎక్కడుంది? గైడ్‌ చేసేవాళ్లు లేరా? కొన్ని హాస్టల్స్‌కి వెళ్లి ఆరా తీశాడు. ఎవరెవరు ఏం కోర్సులు నేర్చుకున్నారని అడిగాడు. జావా, డాట్‌నెట్‌, టెస్టింగ్‌టూల్స్‌.. అంతా మూస ధోరణిలో వెళ్తున్నవాళ్లే. డిమాండ్‌ ఉన్న కోర్సుల గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా నైపుణ్యాలు సంపాదించుకుంటున్నవాళ్లు తక్కువ. ఇలాంటి వాళ్లకు నేనే శిక్షణనిచ్చి ఎందుకు తీర్చిదిద్దకూడదు అనుకున్నాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే జీరో కాస్ట్‌ హైరింగ్‌. ఏడాది కిందట పదిమందిని ఎంపిక చేసుకొని తొలి బ్యాచ్‌ ప్రారంభించాడు. తాను పడ్డ కష్టాలు ఇంకొకరు పడొద్దనే ఉద్దేశంతో తన పదేళ్ల అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి ఈజీరో కాస్ట్‌ హైరింగ్‌కి రూపకల్పన చేశాడు.

మంచి మనసుతో ముందడుగు
ఒక కంపెనీ నడుపుతున్న వ్యక్తికి లాభాలే పరమావధి. మరి సమయం, రిస్క్‌ భరిస్తూజీరో కాస్ట్‌ హైరింగ్‌ ఎందుకు మొదలెట్టావు అంటే నా నేపథ్యమే నాతో ఈ పనికి ముందడుగు వేయించింది అంటాడు రాము. ప్రకాశం జిల్లా పర్చూరు అతడి సొంతూరు. నాన్నది కిళ్లీ కొట్టు. నలుగురు పిల్లలు. అమ్మ వంటలు చేసి, పాలు అమ్మి వచ్చిన డబ్బుతో చదివించేది. డిగ్రీ తర్వాత గుంటూరు వెళ్లి ఒక వైద్యుడి దగ్గర అటెండరుగా చేరాడు. ఓవైపు పనిచేస్తూనే ఆయన ప్రోత్సాహంతో ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాద్‌ వచ్చాడు. రూమ్మేట్‌ దగ్గర ఫొటోషాప్‌ నేర్చుకున్నాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా మొదలెట్టి వెబ్‌ డిజైనర్‌గా ఎదిగాడు. కంప్యూటరు అద్దెకు తీసుకొని మరీ రాత్రీపగలూ కష్టపడి పనిచేసేవాడు. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌, టీవీ9, రెడ్డీస్‌ ల్యాబ్‌, హెటెరో డ్రగ్స్‌, దివీస్‌.. కంపెనీలకు సొంతంగా వెబ్‌సైట్లు రూపొందించి ఇచ్చాడు.

సొంత కంపెనీతో శ్రీకారం
ఈ అనుభవంతో తను అద్దెకుండే చిన్న గదిలో 2004లో 9ఆర్ట్స్‌ మీడియా ప్రారంభించాడు. వెబ్‌డిజైనింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, బ్రాండింగ్‌, మొబైల్‌ యాప్‌, డొమైన్‌ రిజిస్ట్రేషన్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌సైట్‌ మెయింటెనెన్స్‌.. పలురకాల సేవలకు విస్తరించాడు. అమెరికా, కెనడా, సౌదీఅరేబియా, మలేసియా సహా మొతం ఎనిమిది దేశాల్లో ఇప్పటికి 750 కంపెనీలకు 2,110 వెబ్‌సైట్లు డిజైన్‌ చేశాడు. ‘మనం ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం’ అని రాముకి అమ్మానాన్నలు ఓ మాట చెప్పేవారు. దాన్ని అనుక్షణం మననం చేసుకుంటూ ఆచరణలో చూపెట్టడానికే ఈ జీరో కాస్ట్‌ హైరింగ్‌ మొదలు పెట్టానంటాడు రాము.

ఇంజినీరింగ్‌ పూర్తైన పేద విద్యార్థులుwww.zerocosthiring.comవెబ్‌సైట్‌లోకి పలు కోర్సుల్లో ఉచితంగా ప్రవేశం నమోదు చేసుకోవచ్చు.

జీరో హైర్‌ కాస్టింగ్‌ సదాశయంలో రాముతోపాటు పాలుపంచుకుంటున్న కీలక సభ్యులు
* చిటుమల్ల రాజు
* సుధాకర్‌ చెల్లెంకుల
* ఎం.నాగేంద్రబాబు
* ఆర్‌.కృష్ణవేణి
* ఎం.ప్రణీత్‌
* బి.తేజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని