సూక్ష్మ కళ... వండర్‌బుక్‌లో మిలమిల

వండర్‌బుక్‌లో మిలమిల మనం చింతాకుపై ఓ నాలుగు అక్షరాలు రాయగలమా? కష్టం కదూ... పోనీ నువ్వు గింజపై? అదీ అసాధ్యమే అంటారా?...

Published : 27 May 2017 01:41 IST

సూక్ష్మ కళ... వండర్‌బుక్‌లో మిలమిల

మనం చింతాకుపై ఓ నాలుగు అక్షరాలు రాయగలమా? కష్టం కదూ... పోనీ నువ్వు గింజపై? అదీ అసాధ్యమే అంటారా?
దుర్గం వినయ్‌కుమార్‌కి మాత్రం ఇలా చేయడం సెల్‌ ఫోన్‌లో ఎసెమ్మెస్‌ పంపినంత తేలిక. అంత ప్రతిభావంతుడు గనకే వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు అతడి సొంతమైంది.
కుమురం భీం జిల్లా పెద్దబండ వినయ్‌ సొంతూరు. ఓసారి ఓ వ్యక్తి బియ్యం గింజపై అక్షరాలు రాస్తే మెచ్చుకుంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తనూ సూక్ష్మ చిత్రలేఖనాన్ని సాధన చేయడం ప్రారంభించాడు. శ్రీరామా, జై హనుమాన్‌.. ఇలా ఏవో రాసేవాడు. పదోతరగతిలో ఉన్నపుడు స్వాతంత్య్ర దినోత్సవానికి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. ఐదారురోజులు కష్టపడి నువ్వు గింజలపై జాతీయ గీతాన్ని రాసి ప్రదర్శించాడు. అధ్యాపకులు, తోటి విద్యార్థులంతా సెభాష్‌ అన్నారు. ఆ ఉత్సాహంతో వివిధ ఆకృతులు తయారు చేసేవాడు. డిగ్రీలో చింతాకులపై హనుమాన్‌ చాలీసా రాసి ఓ దేవాలయంలో బహూకరించాడు. వీటన్నింటికన్నా భిన్నంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను 20 వేల తంగేడు ఆకులపై రాసి వినయ్‌ ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’లో చోటు సంపాదించాడు. తెలంగాణ చరిత్రతోపాటు తొలి, మలిదశ ఉద్యమాల్ని ఆకులపైనే లిఖించాడు. ఇంతటితో ఆగకుండా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కేలా సూక్ష్మ చిత్రాలు లిఖిస్తానంటున్నాడు.

- తేరాల రంజిత్‌కుమార్‌, ఈనాడు: ఆదిలాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని