ఆటే ఆయుధం... తల వంచిన వైకల్యం!

చూపు లేదు... గుండెల్నిండా గెలవాలనే కాంక్ష ఉంది...లక్ష్యానికి చూపునిచ్చాడు... అనుక్షణం దానిపైనే మనసు పెట్టాడు... విజయం అతడి వశమైంది... ఇది ప్రేమ్‌కుమార్‌ గాథ... తన కాళ్లపై తాను నిల్చోలేడు... మహోన్నతంగా ఎదగాలనే ఆశయం మాత్రం ఉంది... చక్రాల కుర్చీనే కార్యక్షేత్రంగా మలచుకున్నాడు... ఆటే ఆయుధమైంది... గమ్యం అతడ్ని ముద్దాడింది...

Published : 10 Jun 2017 02:00 IST

ఆటే ఆయుధం... తల వంచిన వైకల్యం!

చూపు లేదు... గుండెల్నిండా గెలవాలనే కాంక్ష ఉంది...లక్ష్యానికి చూపునిచ్చాడు... అనుక్షణం దానిపైనే మనసు పెట్టాడు... విజయం అతడి వశమైంది... ఇది ప్రేమ్‌కుమార్‌ గాథ...

తన కాళ్లపై తాను నిల్చోలేడు... మహోన్నతంగా ఎదగాలనే ఆశయం మాత్రం ఉంది... చక్రాల కుర్చీనే కార్యక్షేత్రంగా మలచుకున్నాడు... ఆటే ఆయుధమైంది... గమ్యం అతడ్ని ముద్దాడింది... ఇదేమో ఫారుఖ్‌ అహ్మద్‌ విజయం... సాధించాలనే కాంక్ష నిత్యం జ్వలిస్తుంటే వైకల్యం అడ్డురాదని నిరూపించిన ఈ ఇద్దరితో ఈతరం మాట కలిపింది.

వీల్‌ఛైర్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి

చిన్నప్పుడే మహమ్మద్‌ ఫారుఖ్‌ అహ్మద్‌ని పోలియో మహమ్మారి కాటేసింది. చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అయినా మోకాళ్లలో తలపెట్టి ఏడుస్తూ కూర్చోలేదు. పట్టుదలతో పలురకాల ఆటల్లో ప్రావీణ్యం సంపాదించాడు. బతుకు గడవడానికి ఆటోడ్రైవరుగా మారాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలుస్తూ సెభాష్‌ అనిపించుకుంటున్నాడు.

ఫారుఖ్‌ సొంతూరు కరీంనగర్‌. మూడేళ్ల వయస్సులో పోలియో సోకడంతో రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. అయినా అధైర్యపడకుండా తన పనులు తానే చేసుకుంటూ పెరిగాడు. ఓసారి అతడి ఇంటి దగ్గర కొందరు యువకులు బాల్‌, బ్యాటుతో కనిపిస్తే తానూ క్రికెట్‌ ఆడతానన్నాడు. ‘కనీసం నిల్చోలేవు. మాతో ఎలా ఆడతావ్‌?’ అని చిన్నబుచ్చారు వాళ్లు. ఈ మాటనే సవాలుగా తీసుకొని ఎప్పటికైనా మంచి ఆటగాడిగా ఎదగాలనుకున్నాడు. ఇంటి వద్దే నేలపై కూర్చుని సాధన చేసేవాడు. అతడి తపన గమనించి తోడల్లుళ్లు, కొందరు మిత్రులు అతడితో కలిసి ఆట ప్రాక్టీసు చేసేవారు. ఓసారి నేషనల్‌ జాగ్రఫీ ఛానెల్‌ చూస్తుంటే ‘వీల్‌ఛైర్‌ క్రికెట్‌’ పోటీలు ఉంటాయనే విషయం తెలిసింది. వెంటనే చక్రాల కుర్చీపై సాధన మొదలుపెట్టాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌... అన్నింటిపై దృష్టిపెట్టి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. జిల్లా, రాష్ట్ర జట్ల తరపున ఉత్తమ ప్రతిభ చూపిస్తూ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇది కాకుండా టేబుల్‌పై కూర్చోని బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, అథ్లెటిక్స్‌ కూడా ఆడేవాడు. ఈ వూపుతో దివ్యాంగుల రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు గెలిచాడు. ఎంత ప్రతిభ చూపినా ఆదుకునేవారు లేక, ఆర్థిక పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం ఆటోడ్రైవరుగా మారాడు.

* 2007లో చెన్నైలో జరిగిన జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలో బంగారు పతకం.
* బెంగళూరులో జరిగిన బ్యాడ్మింటన్‌ పోటీల్లో సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో రజతం నెగ్గాడు.
* 2016లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన టోర్నీలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు.
* ఆగ్రాలో జరిగిన అంతర్జాతీయ వీల్‌ఛైర్‌ క్రికెట్‌ పోటీల్లో ఫారుఖ్‌ జట్టు టోర్నమెంట్‌ గెలిచింది. 
* తాజాగా నేపాల్‌లోని కాఠ్‌మాండూ వేదికగా జరిగిన నాలుగు దేశాల సిరీస్‌లో భారత జట్టు సభ్యుడు.

- మంద రామచంద్రం, ఆదిలాబాద్‌ డెస్కు

పట్టుదలకి గెలుపు సలాం..

సంకల్పం ముందు వైకల్యం ఎంత..? ఎదురీత ముందు విధిరాత ఎంత..? ఈ పదాలకు ప్రతి రూపం కర్నూలు జిల్లా డోన్‌ కుర్రాడు ప్రేమ్‌కుమార్‌. పాకిస్థాన్‌-భారత్‌ క్రికెట్‌ మ్యాచ్‌. గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఆ సమయంలో సహచరులకు అతడో మాట చెప్పాడు. ‘మన శరీరంలో విలువైన కళ్లే లేనప్పుడు... కాళ్లూచేతులూ విరిగితే ఏమవుతుంది? బంతికి అడ్డుపడైనా పరుగులు ఆపండి’ అని. ఈ వాక్యాలు జట్టులో ప్రేరణ నింపాయి. అంధుల టీ20 ప్రపంచకప్‌ గెలుపునకు బాటలు వేశాయి. 

ర్నూలు జిల్లా సీసంగుంతలలో పుట్టిపెరిగాడు ప్రేమ్‌. చిన్నప్పట్నుంచే క్రికెట్‌ అంటే పిచ్చి. ఆరేళ్లపుడు తీవ్ర జ్వరంతోపాటు అమ్మవారుపోయడం (తట్టు)తో చూపు కోల్పోయాడు. అయినా ఆటపై మమకారం కోల్పోలేదు. టీవీలో మ్యాచ్‌లు వస్తుంటే తనని తాను వూహించుకునేవాడు. స్నేహితులు క్రికెట్‌ ఆడుతుంటే స్కోర్లన్నీ సరిగ్గా గుర్తుంచుకొని స్కోరరుగా వ్యవహరించేవాడు. దాంతోపాటు పాడటం, డప్పు వాయిద్యంలోనూ ఆరితేరాడు. ఈ ప్రతిభ గుర్తించి నంద్యాలలోని సెయింట్‌ ల్యూక్స్‌ నిర్వాహకులు తమ పాఠశాలలో చేర్చుకున్నారు. అక్కడే బ్రెయిలీ లిపిలో డిగ్రీ పూర్తి చేశాడు.

స్కూళ్లొ చేరిన మొదట్లోనే అంధులకూ క్రికెట్‌ ఉందని తెలుసుకున్నాడు ప్రేమ్‌. అప్పట్నుంచే క¹ఠోర సాధన చేసేవాడు. స్థానిక, జిల్లా స్థాయిలో ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగాడు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా మారాడు. ఫిట్‌నెస్‌ కోసం కరాటే నేర్చుకొని బ్లాక్‌బెల్ట్‌ సాధించాడు. అతడి ప్రతిభ ఆధారంగా పది దేశాలు పోటీపడ్డ్డ టీÌ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. లీగ్‌ దశలో దిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు్ట ఓడిపోయింది. అవతలి జట్టు క్రీడాకారులు అవహేళనగా మాట్లాడారు. దీంతో కసిగా ఆడి అన్ని మ్యాచ్‌లూ గెలిచి ఫైనల్‌ గెలిచారు. కప్పు వేటలో ప్రత్యర్థి మళ్లీ పాకిస్థానే. ఎట్టిపరిస్థితుల్లోనూ పాత ఫలితం పునరావృతం కాకూడదనే తపనతో ఆడారు. మొదట పాకిస్థాన్‌ 20 ఓవర్లకు 196 పరుగులు చేసింది. భారత్‌ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. ప్రేమ్‌ టోర్నీలో తొమ్మిది వికెట్లు పడగొట్టి 70 పరుగులు చేశాడు. కప్‌ గెలిచిన జట్టును ప్రధాని మోదీ అభినందించారు. దివ్యాంగులైనా మీరు యువతకు ఆదర్శం అని ప్రశంసించారు.

* అంధుల క్రికెట్‌లో బంతి లోపల కొన్ని ఇనుప గుండ్లు అమర్చుతారు. శబ్దం ఆధారంగా ఆటగాళ్లు బంతిని గమనించి కొట్టడం, ఫీల్డింగ్‌ చేయడం చేస్తుంటారు.
* బ్యాట్స్‌మన్‌లు కేవలం స్వీప్‌షాట్లు మాత్రమే ఆడతారు.
* ప్రతి జట్టులో నలుగురు పూర్తిగా చూపులేనివారు, మిగతావారు పాక్షికంగా చూపు లేనివారు ఉంటారు.

- సురేంద్రబాబు: కర్నూలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు