స్టార్ట్‌.. కెమేరా.. ‘సామాజిక’ యాక్షన్‌!

సినిమా.. లక్షలమంది కుర్రకారు కల... నటన.. దర్శకత్వం.. మరోటి.. దూసుకెళ్లడానికి ఎవరి దారి వారిది... రాత్రికి రాత్రే సూపర్‌స్టార్లుగా ఎదగడం.. కోట్లు సంపాదించాలనుకునే ఆశ మాత్రం అందరిది... మంచిర్యాల కుర్రాడు దూలం సత్యనారాయణ, మిర్యాలగూడ యువకుడు ఇస్లావత్‌ ఆనంద్‌ కుమార్‌లు వీరికి భిన్నం...

Published : 17 Jun 2017 01:41 IST

స్టార్ట్‌.. కెమేరా.. ‘సామాజిక’ యాక్షన్‌!

బీటెక్‌ వదిలి సినిమా బాట

సినిమా.. లక్షలమంది కుర్రకారు కల... నటన.. దర్శకత్వం.. మరోటి.. దూసుకెళ్లడానికి ఎవరి దారి వారిది... రాత్రికి రాత్రే సూపర్‌స్టార్లుగా ఎదగడం.. కోట్లు సంపాదించాలనుకునే ఆశ మాత్రం అందరిది... మంచిర్యాల కుర్రాడు దూలం సత్యనారాయణ, మిర్యాలగూడ యువకుడు ఇస్లావత్‌ ఆనంద్‌ కుమార్‌లు వీరికి భిన్నం... సామాజిక ఇతివృత్తానే కథాంశంగా ఎంచుకొని లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు తెరకెక్కిస్తున్నారు... కాసుల వేట వదిలి తమ కళ సమాజ మార్పునకు దోహదం చేయాలని తపిస్తున్నారు... ఈ సదాశయానికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సలాం కొట్టాయి.. ప్రశంసలు పోటెత్తుతున్నాయి... ఆ ఇద్దరి ప్రస్థానం ఇదిగో.

సత్యనారాయణ మంచిర్యాల కుర్రాడు. తల్లి చిన్న టీకొట్టు నడిపేది. తన లక్ష్యమేమో ఐఐటీ ప్రవేశం. నాలుగేళ్లు దండయాత్ర చేస్తే ఉన్న ఇల్లు అమ్ముడైందిగానీ ఫలితం దక్కలేదు. ఆఖరికి చెన్నై అన్నా యూనివర్సిటీలో సీటొచ్చింది. బీటెక్‌ చదవడానికి వెళ్లిన కుర్రాడు కాస్తా సినిమాల బాట పట్టాడు. ఆపై గుండెకు హత్తుకునేలా డాక్యుమెంటరీలు తీయడం మొదలుపెట్టాడు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అతడ్ని వరించాయి.

చెన్నై వెళ్లేదాకా సత్యనారాయణ లక్ష్యం ఇంజినీరింగ్‌ చదివి మంచి ఉద్యోగం సంపాదించడం. అక్కడికెళ్లాకే బర్మా బజార్‌ పరిచయమైంది. అదో సినిమా లోకం. ప్రపంచంలోని అన్ని సినిమాలకు సంబంధించిన డీవీడీలు దొరికేవక్కడ. డాక్యుమెంటరీలు, ఫీచర్‌ ఫిల్మ్‌లు, ఆర్ట్‌ ఫిల్మ్‌లు అన్నీ కలిపి ఏడాదిన్నరలో వేయికిపైగా చూశాడు. చదువు అటకెక్కింది. తర్వాత యానిమేషన్‌ కోర్సులో చేరాడు. అదీ సినిమాకు అనుబంధమే. ఆ అనుభవం, సినిమాలపై ప్రేమ, విశ్లేషణలోంచే దర్శకత్వం చేయాలనే ఆలోచన పుట్టింది.

శ్చిమబంగాలోని మౌషుని విద్యుత్తు సదుపాయం కూడా లేని గ్రామం. గ్రామస్థులే స్వయంకృషితో అభివృద్ధి చేసుకున్నారు. స్ఫూర్తిదాయకంగా ఉన్న వారి విజయాన్నే కొందరు మిత్రుల సాయంతో డాక్యుమెంటరీగా మలిచాడు. పుస్తకాలు చదివి, అంతర్జాలం జల్లెడ పట్టి డాక్యుమెంటరీ మెలకువలు నేర్చుకున్నాడు. దీనికి పుణేలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ యదార్థ కథాచిత్రంగా అవార్డు దక్కింది. మొదటి ప్రయత్నానికే జాతీయ స్థాయి గుర్తింపు. ఆ వూపులో నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధితులపై ‘డ్రెడ్‌ఫుల్‌ ఫేట్‌’ అనే మరో లఘుచిత్రం తీశాడు. హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం అందరి మన్ననలు పొందింది. దీన్ని చూసి చాలామంది స్పందించారు. అమెరికాకు చెందిన కొన్ని సంస్థలు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న 25 గ్రామాలను దత్తత తీసుకొని రక్షిత మంచినీటి వసతి కల్పించాయి. ఈ విజయం ఆధారంగానే సత్యనారాయణ కమ్యూనిటీ కాలేజీ ఇనీషియేట్‌ ప్రోగ్రామ్‌ (సీసీఐపీ) అనే ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ స్కాలర్‌షిప్‌కి ఎంపికై, యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ ఆధ్వర్యంలో సినీ దర్శకత్వంపై ఏడాదిపాటు ఉచితంగా శిక్షణ పొందాడు.

రెండు డాక్యుమెంటరీలూ మంచి పేరు తేవడంతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాడు. ఓ మిత్రుడి సూచనతో కూచిపూడి నృత్యం, అది వ్యాప్తి చెందిన విధానాన్ని చిత్రీకరించి ‘అయామ్‌ సత్యభామ’ పేరుతో మలిచాడు. ప్రఖ్యాత నృత్యకారుడు వేదాంతం సత్యనారాయణ ఇందులో తొలిసారి తన అభిప్రాయాలు పంచుకున్నారు. తర్వాత రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన బతుకమ్మ పండగ సంబరాలను చిత్రీకరించే అవకాశం దక్కింది. ఈ వేడుకల్ని 18 కెమేరాలతో వివిధ కోణాల్లో బంధించాడు. ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుకెక్కింది. ఇవేకాకుండా తెలంగాణ బోనాలు, మిషన్‌ భగీరథ, టూరిజం, హరితహారంలాంటి ప్రభుత్వ పథకాలకూ పనిచేశాడు. పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌ దేశాలకు సంబంధించిన చారిత్రక ప్రదేశాలతో లఘు చిత్రాలు తీశాడు.

* మౌషుని జైపుర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది.
* డ్రెడ్‌ఫుల్‌ ఫేట్‌కి నాసిక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్పెషల్‌ జ్యూరీ అవార్డు దక్కింది.
* వెల్‌కమ్‌ టు తెలంగాణ బెస్ట్‌ టూరిజం ఫిల్మ్‌ అవార్డు గెల్చుకుంది.
* తెలంగాణ: ఎమర్జింగ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ అనే డాక్యుమెంటరీ పోర్చుగల్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ టూరిజం ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి దక్కించుకుంది.

- సతీశ్‌, న్యూస్‌టుడే: ఏసీసీ

స్వానుభవం..భిన్నమైన దారి

ఒకవైపు చంద్రునిపైకి ఉపగ్రహం పంపేంత టెక్నాలజీ సాధించాం. మరోవైపు వ్యక్తి కులాన్ని బట్టి చిన్నచూపు చూసే మనుషులూ మనమధ్యే ఉన్నారు. ఆ వివక్ష ఎదుర్కొంటూ పెరిగిన నల్గొండ యువకుడు ఆనంద్‌ సామాజిక రుగ్మతలపై లఘుచిత్రాల్ని ఆయుధంగా ఎక్కుపెట్టాడు. ఇదే కథాంశంతో తీసిన లఘుచిత్రాలు ప్రశంసలతోపాటు అవార్డులూ సాధించి పెట్టాయి.

మిర్యాలగూడ దగ్గర అడవిదేవులపల్లి తండాలో పుట్టిపెరిగాడు ఆనంద్‌. కూలి పనులకెళ్తూ చదువుకునేవాడు. పేదరికం, ఆడపిల్లలకు చదువెందుకనే చిన్నచూపుతో తండాల్లోని చాలామంది అమ్మాయిల్ని పెద్దలు మధ్యలోనే చదువు మాన్పించడం కళ్లారా చూశాడు. తాను ఎదుర్కొన్న సామాజిక వివక్ష సరేసరి. బాగా చదువుకొని ఉన్నతస్థానంలో నిలవడమే ఈ సమస్యకు పరిష్కారం అని పెరిగేకొద్దీ అతడికి అర్థమైంది. కష్టపడి చదివి ఆయుర్వేద వైద్యవిద్యలో పీజీ పూర్తి చేశాడు.

చదువుతోపాటు ఆనంద్‌కి సినిమాలన్నా చాలా ఇష్టం. చదువు పూర్తైంది. తన కాళ్లపై తాను నిలబడగలననే నమ్మకం కలిగింది. తర్వాత దిల్లీ వెళ్లి ఏషియన్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ (ఆఫ్ట్‌)లో దర్శకత్వ కోర్సు పూర్తి చేశాడు. కమర్షియల్‌, ప్రేమ నేపథ్యంగా లఘుచిత్రాలు తీయమని సన్నిహితులు సలహా ఇచ్చారు. కానీ తన ఆలోచన వేరు. మొదట్నుంచీ సమాజాన్ని అందులోని లోటుపాట్లను నిశితంగా గమనించినవాడు. నిమ్న వర్గాల కష్టాలు, కండగండ్లు స్వయంగా అనుభవిస్తూ పెరిగినవాడు. ముఖ్యంగా తను పుట్టి పెరిగిన గిరిజన తండాల్లో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చదువు మధ్యలోనే మానేయడంలాంటి సమస్యలు ఎక్కువ. వీటిపైనే షార్ట్‌ఫిల్మ్స్‌ తీయాలనుకున్నాడు. ఈ ఆలోచనల్లోంచి రాసుకున్న కథే ‘ప్రజా హక్కు’. పేదరికంతో చదువు మానేసిన ఓ అమ్మాయి నృత్యం మీద ఆసక్తితో మళ్లీ ఎలా చదువు బాట పట్టిందనేది కథాంశం. మొదటి ప్రయత్నమే ఆనంద్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ వరుసలోనే వేసిన మలి అడుగు ‘అంటురానితనం’. మామిడి మొక్కలకు అంటు కట్టే పద్ధతితో మంచి దిగుబడులు సాధించి ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్న అమ్మాయి అంటరానితనంతో తానెంత క్షోభకు గురైందో వివరిస్తుంది. అంటరానితనం రూపు మాపడానికి మనుషుల మనసులకు అంటు కట్టాల్సిన అవసరం ఉందని చెబుతుంది. సినిమానే శ్వాసగా మార్చుకున్న యువత కమర్షియల్‌ చిత్రాలవైపు వెళ్తుంటే తాను మాత్రం భిన్నమైన పంథా ఎంచుకున్నాడు. ‘నా సినిమా ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించాలి. కనీసం కొందరైనా మారాలి. దానికోసం నా భావాలకు అద్దం పట్టేలా సినిమాలు రూపొందిస్తూనే ఉంటా’ అంటున్నాడు.

* వందల లఘుచిత్రాలు పోటీపడ్డ చిత్రపురి ఫిల్మోత్సవంలో ప్రజాహక్కు ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైంది
* తెలుగు దర్శకుల సంఘం నిర్వహించిన లఘుచిత్ర షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో ఉత్తమ సందేశాత్మక లఘుచిత్రంగా ఎంపిక
* దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ షార్ట్‌ఫిల్మ్‌ చిత్రోత్సవాల్లో అంటురానితనంకి మొదటి బహుమతి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని