పంచ్‌ వీరుడి కబుర్లు

బాక్సింగ్‌ వీరుడు విజేందర్‌సింగ్‌ మళ్లీ కొట్టాడు. చైనా ప్రత్యర్థి జుల్ఫికర్‌ మైమైతియాలీ....

Published : 12 Aug 2017 01:24 IST

పంచ్‌ వీరుడి కబుర్లు

బాక్సింగ్‌ వీరుడు విజేందర్‌సింగ్‌ మళ్లీ కొట్టాడు. చైనా ప్రత్యర్థి జుల్ఫికర్‌ మైమైతియాలీ దిమ్మతిరిగేలా. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారాక అతడి పంచ్‌లకి ఎదురేలేకుండా పోతోంది. వరుసగా తొమ్మిది విజయాలు సాధించాడు. అందులో ఏడు నాకౌట్లే. ఆట, ఫేమ్‌తో అదరగొడుతున్న అతగాడు భారతీయ యువతకు రోల్‌మోడల్‌. తన వ్యక్తిగత కబుర్లు, ఆసక్తుల సంగతులివి.
రియాణాలో పుట్టి్టన విజేందర్‌ భివానీ, రోహ్‌తక్‌ల్లో చదివాడు. నాన్న బస్‌డ్రైవర్‌. ఇంటర్లోనే జిమ్నాస్ట్‌గా మారాలనుకున్నాడు. అందులో గాయాలపాలయ్యే అవకాశం ఎక్కువని తెలిసి రూటు మార్చి బాక్సింగ్‌ బాట పట్టాడు. భివానీ బాక్సింగ్‌ క్లబ్‌లో చేరాడు. అక్కడే అతడిలోని ప్రతిభను గుర్తించి టెక్నిక్‌కి సానబెట్టా్టడు గురువు జగదీశ్‌సింగ్‌.
గెలుపు బాట: 1997లో సబ్‌జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్‌ విజేందర్‌కి పెద్ద విజయం. ఆపై జాతీయ ఛాంపియన్‌గా గెలవడం.. ఆసియన్‌ గేమ్స్‌.. ఒలింపిక్‌ మెడల్‌.. అతడి పంచ్‌కి దక్కిన పతకాలెన్నో. ప్రొఫెషనల్‌గా మారాక ఓటమన్నదే లేకుండా ఇప్పటికి తొమ్మిది పోటీలు గెలిచాడు. అందులో ఏడూ నాకౌట్‌ విజయాలే. తాజాగా చైనా వీరుడు జుల్ఫికర్‌ మైమైతియాలీని మట్టికరిపించి వరల్డ్‌ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ సూపర్‌ మిడిల్‌వెయిట్‌ ఛాంపియన్‌ కిరీటం నిలబెట్టుకున్నాడు.
అవార్డులు: పంచ్‌లు విసిరి విజయాలు సాధించడంలోనే కాదు.. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు అందుకోవడంలోనూ విజేందర్‌ ఛాంపియనే. క్రీడా విభాగంలో అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ఖేల్‌రత్న అందుకున్నాడు. పద్మశ్రీ.. అర్జున అవార్డులూ అతడి వశమయ్యాయి.
ఫాలోయింగ్‌: దేశంలో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న క్రీడాకారుల్లో విజేందర్‌ ఒకడు. ముఖ్యంగా పట్టణాలు, మెట్రో నగరాల్లోని అమ్మాయిలకు విజేందర్‌ అంటే చెప్పలేనంత క్రేజ్‌. ఆ వూపుతోనే పలు వ్యాపారసంస్థల ఉత్పత్తులకు ప్రచారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. పదులసార్లు ఫ్యాషన్‌షోలు, ర్యాంప్‌ షోల్లో క్యాట్‌వాక్‌ చేశాడు. దస్‌ కా దమ్‌, నాచ్‌ బలియే, రోడీస్‌ ఎక్స్‌2.. రియాలిటీ షోల్లో మెరిశాడు. నేనేం చేసినా బాక్సింగ్‌కి ప్రాచూర్యం కల్పించే ఉద్దేశం మాత్రం మరవనంటాడు.
* ఇష్టం: సంగీతం అంటే ప్రాణం. హనీసింగ్‌ పాటల వినకుండా రోజు గడవదు. నచ్చిన నటుడు షారూఖ్‌ఖాన్‌. మెచ్చిన సినిమా దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే.
* డైట్‌: ప్రొటీన్లు ఎక్కువగా.. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం. రెండు ముక్కలు వెన్న లేదా జామ్‌తో కలిపి తీసుకుంటాడు. నాలుగైదు ఉడికించిన గుడ్లు, అరటిపండ్లు, ఒక గ్లాసుడు పాలు.
* సాధన: రోజుకి నాలుగైదు గంటలు. పోటీకి ముందురోజుల్లో అయితే ఆరేడు గంటల సాధన తప్పనిసరి.
* నటన: పేరులో స్టార్‌ కావడంతో బాలీవుడ్‌ ఆహ్వానం పలికింది. ఫగ్లీ సినిమాతో తెరపై మెరిశాడు. అది బాగానే ఆడినా కెరీర్‌కి అడ్డొస్తుందనే ఉద్దేశంతో మళ్లీ సినిమాలు ఒప్పుకోలేదు.
* స్ఫూర్తి: ఫైవ్‌ డివిజన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌ని ఆరాధిస్తాడు. రోజర్‌ ఫెదరర్‌ని ఇష్టపడతాడు.
* పెళ్లి: కోట్లమంది అమ్మాయిలు విజేందర్‌ అంటే పడి చస్తున్నా వాళ్ల ఆశల్ని వమ్ముచేస్తూ చిన్ననాటి నేస్తం అర్చనకి మూడుముళ్లు వేశాడు. ఓ కొడుకు అరిబీర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని