బతికే అవకాశమున్న ఏ ప్రాణమూ పోకూడదు!

అప్పులు చేసి చదివి మరీ డాక్టరయ్యాడు... అతిచిన్న వయసులోనే ప్రత్యేక వైద్యవిభాగానికి అధిపతిగా మారాడు... ఆపై లక్షల్లో జీతమొచ్చే కొలువు దక్కింది... ఆడుతూపాడుతూ హాయిగా ఉద్యోగం చేసుకునే అవకాశం... బిందాస్‌లైఫ్‌ని వదిలి సేవాదృక్పథంతో సరికొత్త సర్వీసు ప్రారంభించాడు... అతి తక్కువ రుసుముతో ప్రమాద బాధితులకు చేయూతనందిస్తున్నాడు...

Published : 12 Aug 2017 01:30 IST

బతికే అవకాశమున్న
ఏ ప్రాణమూ పోకూడదు! 

అప్పులు చేసి చదివి మరీ డాక్టరయ్యాడు... అతిచిన్న వయసులోనే ప్రత్యేక వైద్యవిభాగానికి అధిపతిగా మారాడు... ఆపై లక్షల్లో జీతమొచ్చే కొలువు దక్కింది... ఆడుతూపాడుతూ హాయిగా ఉద్యోగం చేసుకునే అవకాశం... బిందాస్‌లైఫ్‌ని వదిలి సేవాదృక్పథంతో సరికొత్త సర్వీసు ప్రారంభించాడు... అతి తక్కువ రుసుముతో ప్రమాద బాధితులకు చేయూతనందిస్తున్నాడు... ఈ తరహా ప్రయోగం దేశంలోనే అరుదైనది... బతికించగలిగే అవకాశం ఉ1న్న ఏ ప్రమాద బాధితుడూ చనిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించానంటున్నాడు
రోగ్య బీమా అంటే ప్రమాదాల్లో ఆదుకునే భరోసా. ఇదీ వ్యాపారమయ్యాక భారీ ప్రీమియాల మోత సామాన్యులకు భారమైపోతోంది. ఈ సమస్యకు చెక్‌ పెడుతూనే.. ప్రమాద సమయాల్లో బాధితుడి పక్కనే ఉంటూ చేదోడువాదోడుగా ఉండే వైద్య నిపుణులతో కూడిన సాధనా యూనిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ సర్వీసెస్‌ (సూట్స్‌) ప్రారంభించాడు సోమశేఖర్‌.
ఇదీ నేపథ్యం
ప్రకాశం జిల్లా చీమకుర్తి సోమశేఖర్‌ సొంతూరు. మొదట్లో ధనిక కుటుంబమే. అడిగినవాళ్లకి కాదనకుండా అప్పులిచ్చేవారు సోమశేఖర్‌ నాన్న. ఆస్తులు కరిగిపోయి చివరికి వాళ్లే అప్పుల పాలయ్యారు. 2010లో తనకి ఎంసెట్‌లో మంచి ర్యాంకొచ్చింది. రూ.70వేలు కడితే మెడిసిన్‌ సీటు. నావల్ల కాదని చేతులెత్తేశారు నాన్న. పట్టుపట్టి మళ్లీ చదివితే గుంటూరు ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. వైద్యవిద్యార్థిగా ఎమర్జెన్సీ కేసులెన్నో చూశాడు. సరైన వైద్యం అందక.. సమయానికి డబ్బులు సర్దుబాటు చేయలేక.. పట్టించుకునే తోడు లేక ఎందరో ప్రాణాలు కోల్పోవడం గమనించాడు. ఈ దుస్థితి మార్చడానికి ఏదైనా చేయాలని ఆనాడే బలంగా అనుకున్నాడు. కేరళలోని మలబార్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఎమర్జెన్సీ ఫిజీషియన్‌ పీజీ కోర్సులో చేరాడు. బెస్ట్‌ ప్రెజెంటర్‌గా, బెస్ట్‌ ఔట్‌గోయింగ్‌ స్టూడెంట్‌గా బయటికొచ్చాడు. కొన్నాళ్లు్ల ఒంగోలులో పనిచేసి ముప్ఫైఏళ్ల అతిచిన్న వయసులోనే డీఎం వేనాడ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అత్యవసరచికిత్స విభాగానికి అధిపతి అయ్యాడు. అక్కడే అత్యవసర చికిత్సల్లో ప్రోటోకాల్‌ బేస్డ్‌ ప్రాక్టీసెస్‌ ఏంటి? ఎమెర్జెన్సీ కాన్సెప్టు.. ట్రామాకేర్‌ నిబంధనలు.. ప్రమాదం జరిగిన వ్యక్తిపట్ల తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకున్నాడు. అనుభవజ్ఞుల అభిప్రాయాలు తెలుసుకున్నాడు.
 

భారత్‌లో సగటున ప్రతి నాలుగు నిమిషాలకొకరు రోడ్డుప్రమాదంలో చనిపోతుండటం విషాదం. కొద్దిపాటి జాగ్రత్తలతోనే వీరిలో నలుగురిలో ముగ్గురిని బతికించొచ్చు

తొలి అడుగు
సోమశేఖర్‌ వైద్యవిద్యార్థిగా ఉన్నపుడే 2013లో ఒంగోలులో ‘సాధన ఫౌండేషన్‌’ పేరుతో ఒక స్వచ్ఛందసంస్థ ప్రారంభించాడు. వైద్యవిద్యార్థులైన మిత్రులతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో పదులకొద్దీ హెల్త్‌క్యాంపులు నిర్వహించాడు. దీనికోసం తనకొచ్చే స్టైపెండ్‌ని సైతం వెచ్చించేవాడు. ఎమర్జెన్సీ ఫిజీషియన్‌గా ఉన్నపుడు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఎలాంటి ప్రాథమిక చికిత్సలు చేయాలో వివరిస్తూ ఆర్‌టీవో కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాడు. ఇవన్నీ చేస్తున్నా తన మొట్టమొదటి లక్ష్యం మరవలేదు. దీనికోసం ఓ సంస్థ మొదలుపెడదామనుకుంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. డబ్బులు కూడబెట్టడానికి అమెరికా వెళ్లి ‘షిప్‌ కార్నివాల్‌ క్రూయిజ్‌లైన్స్‌’లో ఫిజీషియన్‌గా చేరాడు. పైసాపైసా పొదుపుచేశాడు. కొన్నాళ్లయ్యాక మిత్రులు డా.సుధాకర్‌రెడ్డి, డా.మొయినొద్దీన్‌ల సహకారంతో విశాఖపట్నంలో 2015 ఆగస్టు్టలో ‘సూట్స్‌’ మొదలుపెట్టాడు.

ఏం చేస్తారంటే.. నుకోని ప్రమాదాల నుంచి రక్షణ పొందడం కోసం సాధారణంగా మనం ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటాం. ఈ మొత్తం ఒక్కోసారి భరించలేనంత అధికంగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయమే సూట్స్‌ కార్డు సభ్యత్వం. కేవలం ట్రామాకేర్‌ సేవలు అందించడానికే ఈ ప్రాజెక్టు రూపొందించారు. రూ.799 చెల్లించి ఇందులో సభ్యుడైతే రూ.రెండులక్షల వరకు నగదురహిత చికిత్స అందుకోవచ్చు. ఇందులో షరతులు, నిబంధనలు ఏం ఉండవు. 18 నుంచి 50ఏళ్ల వయసున్న ఎవరైనా సభ్యత్వం నమోదు చేసుకొని కార్డు తీసుకోవచ్చు. అంతకుమించి ప్రత్యేకత ఏమిటంటే ప్రమాదాల బారినపడ్డ సభ్యులకు మెరుగైన చికిత్స అందేలా దగ్గరుండి సూట్స్‌ కేర్‌ టీం సభ్యుడు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒకవేళ సూట్స్‌ సభ్యుడు ప్రమాదానికి గురైతే కాల్‌సెంటర్‌ ద్వారా వెంటనే కేర్‌ టీం సభ్యుడికి సమాచారం అందుతుంది. క్షతగాత్రుడిని చేర్పించిన ఆసుపత్రికి బయల్దేరతాడు. అవసరమైతే వేరొక ఆసుపత్రిలో చేర్చడం దగ్గర్నుంచి మెరుగైన వైద్యం అందించేలా చేయడం.. సంబంధీకులకు సమాచారం అందించడం.. అన్నీ ఈ సభ్యుడేే చూసుకుంటారు. ఫిజియోథెరపిస్టులతో కూడిన ఇలాంటి కేర్‌ టీం సభ్యులు 200మంది సూట్స్‌ తరపున పనిచేస్తున్నారు. దేశంలో ఏ బీమా కంపెనీ కూడా ఇటువంటి సేవలు అందించడం లేదంటాడు సోమశేఖర్‌. సత్వర వైద్యం అందేలా దేశంలోని 5,500 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

కష్టాలకోర్చి లాభాపేక్ష లేకుండా.. బతికే అవకాశం ఉన్న ఏ ప్రాణం పోకూడదు అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్టు మొదలుపెట్టానంటాడు సోమశేఖర్‌. దీనికోసం అతడు పడ్డ కష్టాలు తక్కువేం కాదు. ఈ కాన్సెప్టుకు ఒప్పించడానికి చాలా బీమా కంపెనీలు, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. లాభదాయకంగా లేదని చాలా సంస్థలు తిరస్కరించాయి. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి చివరికి నేషనల్‌ ఇన్సూరెన్స్‌, రెలిగేర్‌లను ఒప్పించగలిగాడు. ఇదేకాదు.. డబ్బులు కూడబెట్ట్టడానికి క్రూయిజ్‌లైన్స్‌లో నెలలకొద్దీ సెలవుల్లేకుండా పనిచేశాడు. వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. ఏం చేసినా తాను ఎంచుకున్న వైద్యవృత్తికి పూర్తి న్యాయం చేయడమే తన లక్ష్యం అంటున్నాడు సోమశేఖర్‌రెడ్డి.

పూర్తి వివరాలకు: suitseveryone.com


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని