చదువులో స్పీడున్నోడు నటనకే ఓటేశాడు!

అల్లుడు శీనుతో తెరంగేట్రం చేసి నటనలో ఫర్వాలేదనిపించాడు...రెండో సినిమాతో దూకుడు...

Published : 19 Aug 2017 01:04 IST

చదువులో స్పీడున్నోడు నటనకే ఓటేశాడు! 

అల్లుడు శీనుతో తెరంగేట్రం చేసి నటనలో ఫర్వాలేదనిపించాడు...రెండో సినిమాతో దూకుడు పెంచి స్పీడున్నోడుగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు...ముచ్చటగా మూడో చిత్రం జయ జానకీ నాయకాతో జయకేతనం ఎగరేశాడు...చూడ్డానికి పక్కింటి కుర్రాడిలా కనిపించే బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తన ఆసక్తులు.. వ్యక్తిగత అభిరుచులు.. ఇదిగో ఇలా మనతో పంచుకున్నాడు.
నాకు వూహ తెలిసే నాటికే నాన్న సురేశ్‌ పేరున్న నిర్మాత. కథా చర్చలు.. ఆడియో రిలీజ్‌.. సినిమా విడుదలంటూ ఇంట్లో వాతావరణం సందడిగా ఉండేది. నాకేమో వాటిపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. బుద్ధిగా చదువుకునేవాణ్ని. ప్రతి సబ్జెక్టులోనూ మార్కులు ఎనభై దాటేవి. కల్చరల్‌ ఈవెంట్స్‌లోనూ చురుగ్గా పాల్గొనేవాణ్ని. అప్పుడప్పుడు డ్రామాలేసేవాణ్ని. స్కూళ్లొ ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో నాన్నతో చెప్పించి పెద్దపెద్దవాళ్లని గెస్ట్‌లుగా తీసుకొచ్చేవాణ్ని. ఫ్రెండ్స్‌కి సినిమా టికెట్లు ఇప్పించేవాణ్ని.
వినాయక్‌ చొరవతో : డైరెక్టర్‌ వినాయక్‌ అంకుల్‌ మా ఫ్యామిలీఫ్రెండ్‌. ఓసారి మా ఇంటికొచ్చినపుడు నన్ను చూసి ‘అబ్బాయి బాగున్నాడు. ట్రైనింగ్‌ ఇప్పిస్తే తర్వాత సినిమాలో అరంగేట్రం చేయిద్దాం’ అన్నారు నాన్నతో. అప్పుడే నా టెన్త్‌ అయిపోయింది. వయసు పదిహేనేళ్లు. బాగా లావుగా ఉండేవాణ్ని. అరుణ భిక్షూ గారి దగ్గర యాక్టింగ్‌ కోర్సులో చేరా. ఓవైపు నటనలో పాఠాలు, మరోవైపు ఇంటర్‌ కాలేజీ. ఒక్కసారిగా చాలా కష్టాలొచ్చిపడ్డాయ్‌. హీరో కావడం తేలికైన విషయం కాదని అర్థమైంది. ఆపై ఫారిన్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందా. రెండేళ్లలో ఒక నటుడికి కావాల్సినవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించా.
తొలిసారే : మొదటి సినిమా అల్లుడుశీనుతో కెమేరా ముందుకొచ్చా. దర్శకుడు వినాయక్‌ అంకుల్‌ మొదట్నుంచీ తెలుసు. గతంలోనే నటనలో శిక్షణ పొందడంతో బాగా చేయగలననే నమ్మకం ఉండేది. సీనియర్లూ మంచి సలహాలిచ్చారు. మొదటిసారే ఇటలీ, జపాన్‌ల్లో షూటింగ్‌ చేశాం. అంతా ఓ పిక్నిక్‌లా గడిచిపోయింది. సినిమా విడుదలయ్యాక పరిశ్రమలోని స్టార్‌ హీరోలు, దర్శకులు బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. నాపై నాకు పూర్తి నమ్మకం కలిగింది. రెండో సినిమా మాత్రం వూహించని విధంగా బోల్తా కొట్టింది. సినిమాలో విషయం లేకపోతే ఎవరికైనా, ఎంతటి స్టార్‌కైనా పరాజయం తప్పదనిపించింది. మరింత జాగ్రత్తగా కష్టపడి మంచి సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకోవాలనుకున్నా. జయ జానకీ నాయకా ఆ కసితోనే చేశా. ‘ఫైట్లూ, డ్యాన్స్‌లేకాదు నటనలోనూ అదరగొట్టేశావ్‌.. మంచి పరిణతి కనిపిస్తోంది అని చాలామంది ఫోన్‌ చేసి చెప్పారు.

అల్లరి శీను : సినిమాల్లో ఎలా కనిపించినా బయట మాత్రం నేను గ్యాంగ్‌లీడర్‌ టైపు. అందరితో సరదాగా ఉండటం నాకలవాటు. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో చదివా. ఆ స్నేహితులంతా ఇప్పటికీ నాతో టచ్‌లోనే ఉన్నారు. ఏమాత్రం ఖాళీదొరికినా వాళ్లతో షికార్లకెళతా. రెస్టరెంట్లకు వెళ్లి పార్టీలు చేసుకుంటా. బడి, కాలేజీ క్లాస్‌లకు చాలాసార్లు బంక్‌ కొట్టినా మెరిట్‌ విద్యార్థి కావడం, యాక్టివ్‌గా ఉండటంతో టీచర్లకీ నేనంటే ఇష్టమే.

సినిమాలు కాకుండా: క్రికెట్‌ ఇష్టం. 
ఖాళీగా ఉంటే: స్నేహితులతో లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తుంటా.
అభిమానులకు దగ్గరవడానికి: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో యాక్టివ్‌గా ఉంటా. ఈమధ్యే ట్విట్టర్‌ ఖాతా తెరిచా.
బెస్ట్‌ఫ్రెండ్‌: డాడీనే. సినిమా, కెరీర్‌, ప్రేమ.. ఏ విషయమైనా షేర్‌ చేసుకుంటా. 
దైవభక్తి: ఎక్కువే. చిలుకూరు టెంపుల్‌, అంతర్వేది, అయినవిల్లి, సింహాచలం, తిరుమల, విజయవాడ.. తరచూ వెళ్తుంటా.
ఓ కొత్త విషయం: నేను మంచి కారు రేసర్‌ని. చాలా పోటీల్లో పాల్గొన్నా.
ప్రేమ ప్రపోజళ్లు: నాలుగైదున్నాయ్‌. తలచుకుంటే ఇప్పుడు సిల్లీగా అనిపిస్తోంది.
నచ్చిన వంటకం: అమ్మ చేసే పప్పు
యువతకో మాట: మనం కష్టపడి ఎదిగితే కన్నవాళ్లు పొందే సంతోషం వెలకట్టలేనిది. వాళ్ల కళ్లల్లో ఆనందం చూడగలిగితే అంతకుమించిన విజయం ఏముండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని