నానో సముద్రంలో... మెరిసింది మన ముత్యం!

ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రివ్యూ... ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన 35 ఏళ్లలోపు 35 మంది జాబితా రూపొందించింది... ముగ్గురు భారతీయులకు చోటు దక్కితే అందులో ఒకే ఒక తెలుగమ్మాయి రాధ బోయ... పదేళ్లుగా అలుపెరుగక శ్రమిస్తున్న పరిశోధనకు దక్కిన ఘనత అది...

Published : 09 Sep 2017 02:08 IST

నానో సముద్రంలో... మెరిసింది మన ముత్యం!

ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రివ్యూ... ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన 35 ఏళ్లలోపు 35 మంది జాబితా రూపొందించింది... ముగ్గురు భారతీయులకు చోటు దక్కితే అందులో ఒకే ఒక తెలుగమ్మాయి రాధ బోయ... పదేళ్లుగా అలుపెరుగక శ్రమిస్తున్న పరిశోధనకు దక్కిన ఘనత అది... ఇలా ప్రపంచస్థాయి గుర్తింపు అందుకోవడం మొదటిసారేం కాదు... తను గతంలోనే పలు అంతర్జాతీయ ఫెలోషిప్‌లు అందుకుంది... అంతర్జాతీయ సైన్స్‌ వేదికల నుంచి అతిథి ఆహ్వానాలందాయి... పేద కుటుంబంలో పుట్టి స్కాలర్‌షిప్‌లతో చదివి దేశం మెచ్చే యువ శాస్త్రవేత్తగా ఎదిగిన ఆ స్ఫూర్తికెరటంతో మాట కలిపింది ఈతరం.

ఎంఐటీ రివ్యూ 35 అండర్‌ 35 జాబితాలో చోటు సంపాదించడం అంటే మాటలు కాదు. ఇది ప్రపంచవ్యాప్త పోటీ. సైన్స్‌, టెక్నాలజీ, సామాజికసేవ, సరికొత్త ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సామాజిక మార్గదర్శకులు.. ఈ విభాగాల్లో భవిష్యత్తులో ప్రపంచ యవనికపై ప్రభావం చూపగలవారికే ఇందులో చోటు దక్కుతుంది. గతంలో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌, గూగుల్‌ ఫౌండర్లు లారీపేజ్‌, సెర్గీ బ్రిన్‌.. మెటీరియల్‌ సైంటిస్ట్‌ జాన్‌ రోజర్స్‌, పే పాల్‌ వ్యవస్థాపకుడు మాక్స్‌ లెవ్‌చిన్‌ ఈ గౌరవం అందుకున్నారు. దీనికి ఎంపిక కావాలంటే ముందు ఆయా రంగాల్లో నిపుణులైనవారు ‘ఈ వ్యక్తి అర్హుడు పరిశీలించ’మంటూ ఎంఐటీ ఎంపిక కమిటీకి ప్రతిపాదనలు పంపాలి. పలు రకాల వడపోతలు, న్యాయనిర్ణేతలతో ముఖాముఖి అనంతరం తుది జాబితా విడుదల చేస్తారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా నామినేషన్లు వచ్చాయి.

కీలక మలుపు
అంతర్జాతీయ గుర్తింపు పొందుతూ, నోబెల్‌ గ్రహీత నేతృత్వంలో పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగిన రాధ నేపథ్యం పేదరికం. అనంతపురం జిల్లా గుంతకల్లు సొంతూరు. నాన్న దర్జీ. పెద్దగా చదువుకోకపోయినా చదువు విలువ తెలుసు. చదువుతోనే బాగు పడతారని చెప్పేవారు. ఆ మాటే మననం చేసుకుంటూ కష్టపడి చదువుతూ ప్రతిసారీ క్లాసులో ఫస్ట్‌గా వచ్చేది రాధ. ఫీజుల భారం తగ్గించుకోవడానికి ట్యూషన్లు చెప్పేది. పీజీ పూర్తయ్యాక సివిల్స్‌కి ప్రిపేర్‌ కావడం తన లక్ష్యం. ఎమ్మెస్సీలో ఉండగా సరదాగా పరీక్ష రాస్తే బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో రెండునెలల సమ్మర్‌ రీసెర్చ్‌ పోగ్రామ్‌ ఫెలోషిప్‌కి ఎంపికైంది. ఆ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో అడుగుపెట్టాక పరిశోధనలో ఉన్న మజా ఏంటో అర్థమైంది. కొత్త లక్ష్యం పురుడు పోసుకుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌)లో పీహెచ్‌డీలో చేరింది.

పరిశోధనల పరుగు
రాధ జేఎన్‌సీఏఎస్‌ఆర్‌కి వెళ్లాక పరిశోధనలు పరుగందుకున్నాయి. అక్కడే నానో మెటీరియల్‌పై పీహెచ్‌డీ చేసింది. పలు పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి వాడే హైడ్రోజన్‌ వాయువు స్టెయిన్‌లెస్‌స్టీల్‌లాంటి పదార్థంలో నుంచి కూడా బయటికి వచ్చేయగలదు. ఇలా జరిగితే భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ లీకేజీలు ఆపడానికి నానో మెటీరియల్‌తో ‘హైడ్రోజన్‌ బారియర్‌ కోటింగ్స్‌’ రూపొందించింది. దీంతోపాటు చచ్చుబడిపోయిన ఒక రోగి శరీరంలోని అతి సూక్ష్మమైన కదలికల్ని సైతం గుర్తించగలిగేలా ఒక నానో సెన్సర్‌ రూపొందించింది. ఈ రెండు ఆవిష్కరణలకు పేటెంట్‌ దక్కింది. ఆపై అమెరికా షికాగోలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీకి వెళ్లి నానో మెటీరియల్‌ని బయో మెటీరియల్‌గా ఉపయోగించి కచ్చితమైన డీఎన్‌ఏ ఫలితాలు వచ్చేలా పరిశోధనలు చేసింది. తర్వాత మేరీక్యూరీ గ్లోబల్‌ ఫెలోషిప్‌కి ఎంపిక కావడంతో యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లోని నేషనల్‌ గ్రాఫేన్‌ ఇనిస్టిట్యూట్‌కి చేరింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ ఆండ్రూ గెయిమ్‌ నేతృత్వంలో పరిశోధనలు చేస్తోంది.

భవిష్యత్తుకు భరోసాగా..
సాధారణంగా నీటిలో రకరకాల అణువులు, పరమాణువులు ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ సముద్ర నీటి నుంచి ఉప్పు పరమాణువుల్ని వేరు చేసి స్వచ్ఛమైన మంచినీటిని తయారు చేయలేకపోతున్నారు. దానిక్కారణం నీటిలోని ఒక్కో పరమాణువుకు ఒక్కోరకమైన పరిమాణం ఉండటమే. వీటిని తేలికగా వేరు చేయలేం. దీనికి పరిష్కారంగా గ్రాఫేన్‌తో పరమాణుస్థాయి నానో గొట్టాలు ఆవిష్కరించిందింది రాధ. సాధారణంగా గ్రాఫైట్‌లో లక్షల, కోట్ల గ్రాఫేన్‌ పొరలుంటాయి. మధ్యలోని కొన్ని పొరల్ని తొలగించి అతి సూక్ష్మమైన గొట్టాలుగా రూపొందించింది. ఇందులో నుంచి నీటిని అధిక పీడనంతో పంపితే ఉప్పు పరమాణువులు ఆగిపోయి కేవలం నీటి పరమాణువులు మాత్రమే బయటికొస్తాయి. అంటే స్వచ్ఛమైన మంచి నీరు బయటికొస్తుంది. ఈ ఆవిష్కరణ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సముద్రంలోని ఉప్పునీటిని సైతం 98శాతం స్వచ్ఛమైన మంచినీటిగా మార్చొచ్చు అంటోంది రాధ. అలాగే భూగర్భంలో నుంచి గ్యాస్‌ని వెలికితీసినపుడు హైడ్రోజన్‌, బ్యుటేన్‌, ఎల్పీజీ.. ఇలా రకరకాల వాయువులు సమ్మిళితమై ఉంటాయి. పరమాణువుల పరిమాణం ఆధారంగా రూపొందించిన నానో కాపిల్లరీలతో వీటిని వేటికవే వేరుచేసే అవకాశం ఉంది. ఈ పరిశోధనకే రాధ ఎంఐటీ రివ్యూ జాబితాలో చోటు దక్కించుకుంది.

దారి చూపుతూ
పరిశోధనలకు ఉన్న అవకాశాలు, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థల వివరాలు, పరిశోధకులకున్న భవిష్యత్తు గురించి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చెబుతోంది. భర్త కీర్తి అశోక్‌ సైతం పరిశోధకుడుగా ఉండటంతో మొదట్నుంచీ ప్రోత్సాహం అందిస్తున్నాడు. దీంతోపాటు సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ, జర్మనీ, అమెరికా విశ్వవిద్యాయాల్లో నిర్వహించిన సెమినార్లలో అతిథిగా ఉపన్యాసాలు ఇచ్చింది. మన దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్‌సీలోనూ తన పరిశోధన అనుభవాలు పంచుకుంది.

ఇవీ ఘనతలు...

* నానో గొట్టాలతో సముద్రనీటి నుంచి ఉప్పును వేరు చేసి మంచినీటిని అందించే ఆవిష్కరణ
* పరమాణువుల పరిమాణం ఆధారంగా సమ్మిళిత సహజ వాయువులను వేరు చేసే ప్రక్రియ

అవార్డుల జాబితా...

* ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ 35 ఇన్నోవేటర్స్‌ అండర్‌ 35 జాబితాలో చోటు
* శాస్త్రీయ పరిశోధనల్లో మహిళలకిచ్చే లోరియల్‌- యునెస్కో ఫెలోషిప్‌కి ఎంపిక

* బ్రిటన్‌ డేమ్‌ కేథ్లీన్‌ ఒల్లెరెన్‌షా ఫెలోషిప్‌
* యూకే లెవర్‌హ్యూల్మ్‌ ఎర్లీ కెరీర్‌ ఫెలోషిప్‌
* జర్మనీలో జరిగిన నోబెల్‌ ప్రైజ్‌ విజేతల సమావేశంలో యువశాస్త్రవేత్తగా ఆహ్వానం
* మేరీ క్యూరీ ఇంటర్నేషనల్‌ ఇన్‌కమింగ్‌ ఫెలోషిప్‌
* నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ సైంటిఫిక్‌ ఇమేజ్‌ కాంటెస్ట్‌లో మొదటి బహుమతి
* జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో బెస్ట్‌ పీహెచ్‌డీ థీసిస్‌ అవార్డు
* సీఎస్‌ఐఆర్‌ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కి ఎంపిక. జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘గేట్‌’లో ర్యాంకు
  * ఎమ్మెస్సీలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి బంగారు పతకం
  * 38 అంతర్జాతీయ జర్నళ్లలో రాధ బోయ రాసిన పరిశోధక వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. తన పరిశోధనలకు మూడు పేటెంట్‌లు పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని