రేసు గుర్రాలు రోబో కుర్రోళ్లు

కుర్రాళ్లు తలుచుకుంటే అసాధ్యమంటూ ఉండదు... రయ్యిన దూసుకుపోయే రేసు కార్లను చేయగలరు...

Published : 28 Oct 2017 01:43 IST

రేసు గుర్రాలు రోబో కుర్రోళ్లు

కుర్రాళ్లు తలుచుకుంటే అసాధ్యమంటూ ఉండదు... రయ్యిన దూసుకుపోయే రేసు కార్లను చేయగలరు... కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోలనూ ఆవిష్కరించగలరు... వరంగల్‌ ఎన్‌ఐటీలో జరుగుతున్న సాంకేతిక పండగలో కొన్ని ఆవిష్కరణలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆవిష్కర్తలు వారి మనోగతాన్ని ‘ఈతరం’తో పంచుకున్నారు.
దూసుకుపోతున్నారు
విదేశాల్లో ఫార్ములావన్‌ రేసులంటే చెప్పలేనంత క్రేజ్‌. ఇప్పుడిప్పుడే ఇది మన దేశంలోనూ పెరుగుతోంది. రేసు కార్లపై మక్కువ పెంచుకుంటున్న మనోళ్లు కూడా రేసు కార్లను నడపడానికీ వరుసకడుతున్నారు. రేసింగ్‌ కార్ల ట్రాకులూ తయారవుతున్నాయి. బెంగళూరు, దిల్లీ నగరాల శివార్లలో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే అంతర్జాతీయస్థాయి పోటీలకు చేరాలంటే మనం ఇంకా ఎంతో ఎదగాలి. మరి వాటి తయారీ? ఈ బాధ్యతను భుజానికెత్తుకుంటున్నారు వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ కోర్సులు చేస్తున్న 25 మంది విద్యార్థులు. ‘టీంమెక్జాస్టర్‌’ పేరుతో రేసు కారును రూపొందించారు. టీం కెప్టెన్‌ అంకిత్‌తో కలిసి రిషితేష్‌, కుష్‌వహా, ముకుల్‌గోయల్‌, అశుతోష్‌, ఆయుష్‌ కారును చేయడంలో కీలక పాత్ర పోషించారు. కారు తయారీకి సుమారు పదినెలలు శ్రమించారు. రూ. 7 లక్షల వరకు వెచ్చించారు. చివరకు అనుకున్నట్టే రేసుకారు సిద్ధమైంది. 90 కిలోమీటర్లతో దూసుకుపోయేలా తీర్చిదిద్దారు. గతేడాది నోయిడాలోని బుద్ధా ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జాతీయస్థాయిలో జరిగిన ప్రఖ్యాత ‘సుప్రా’ పోటీల్లో మన కుర్రాళ్లు పాల్గొన్నారు. ఇప్పుడు మరిన్ని కొత్త హంగులతో కారును తీర్చిదిద్దారు. ఇప్పుడిది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. ‘పుష్‌రాడ్‌ సస్పెన్షన్‌’ పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ రేసుకారు మలుపుల్లో పడిపోకుండా ఉండేలా తీర్చిదిద్దారు. మళ్లీ వచ్చేజూన్‌లో జరిగే పోటీలకు సిద్ధమవుతున్నారు. వైఫల్యాలు ఎదురైనా కుంగిపోకుండా కలిసికట్టుగా పనిచేయడం వల్లే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ఈ మిత్రులు చాటిచెబుతున్నారు.
భవిష్యత్తులో అన్నీ రోబోలే
చైనా, జపాన్‌, అమెరికా తదితర దేశాల్లో ఇప్పటికే రోబోల యుగం ప్రారంభమైంది. అక్కడ ఇంటి పనుల నుంచి మొదలుపెడితే కార్యాలయాల్లో సైతం రోబోలు అన్ని పనుల్లో మనుషులకు ఆసరాగా నిలుస్తున్నాయి. కానీ మన దేశంలో రోబోల గురించి మాట్లాడుకోవడమే తప్ప అవి నిజంగా పనిచేస్తుంటే చూసింది తక్కువే అని చెప్పాలి. కానీ నిట్లో జరిగే సాంకేతిక పండగలో ఒక రోబో అందరి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. చెప్పిన పనులల్లా చేస్తూ, ఆదేశాలు పాటిస్తూ అబ్బురపరుస్తోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఘనతే ఈ మరమనిషి. పేరు ‘మిత్ర’. ఇన్వెంటో రోబో అనే అంకుర సంస్థ వరంగల్‌ ఎన్‌ఐటీలో తమ రోబోను తీసుకొచ్చింది. ఈ రోబోను తయారుచేసింది బాలాజీ విశ్వనాథన్‌, రోషన్‌ అనే యువ ఇంజినీర్లు, వీరికి మరో నలుగురు జత కూడారు. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లంతా కలిసి ఇందులో వివిధ భాగాలను రూపొందించారు. ఈ రోబోకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఇది మనం చెప్పిన ఆదేశాలు పాటించగలదు. నడవమంటే నడుస్తుంది. ఇందులో ఉన్న నావిగేషన్‌ ఆధారంగా ఎటంటే అటు తోవ చూపగలదు. పిల్లలకు సాయపడగలదు. హోటళ్లలో వెయిటర్‌ అవతారమెత్తి పదార్థాలను వడ్డించగలదు. ఇప్పటికే ఇలాంటి రోబో బెంగళూరులోని ఒక కెనరా బ్యాంకు శాఖలో పనిచేస్తోంది. మన దేశంలో రోబో పరిజ్ఞానాన్ని పెంచి సాంకేతికత ద్వారా అద్భుతాలు సాధించాలన్నదే తమ లక్ష్యం అని బాలాజీ అంటున్నాడు.

- జి. పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని