సెబాస్టియన్‌ అను నేను!

31 ఏళ్ల కుర్రాడు దేశాధినేతయ్యాడు... ఓ దేశ సమస్యలపై 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు... ఫలితంగా అక్కడి ప్రజలు తనని తమనేతగా ఎన్నుకున్నారు.. ‘సెబాస్టియన్‌ అను నేను!’ అంటూ పదవీ ప్రమాణం చేయనున్నాడు... ఇప్పుడు అక్కడ అంతా ‘టీమ్‌ కర్జ్‌’ ఓ హాట్‌...

Published : 04 Nov 2017 04:16 IST

లీడర్‌
సెబాస్టియన్‌ అను నేను!

 31 ఏళ్ల కుర్రాడు దేశాధినేతయ్యాడు...
ఓ దేశ సమస్యలపై 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు...
ఫలితంగా అక్కడి ప్రజలు తనని తమనేతగా ఎన్నుకున్నారు..
‘సెబాస్టియన్‌ అను నేను!’ అంటూ పదవీ ప్రమాణం చేయనున్నాడు... ఇప్పుడు అక్కడ అంతా ‘టీమ్‌ కర్జ్‌’ ఓ హాట్‌ టాపిక్‌! ప్రపంచ దేశాల రాజనీతి శాస్త్రజ్ఞులంతా తనో ‘రాజకీయ గడుగ్గాయి’ అని ముద్దుగా పిలుస్తున్నారు కూడా! ఆ దేశం ఆస్ట్రియా అయితే... అతని పూర్తి పేరు సెబాస్టియన్‌ కర్జ్‌

విష్యత్తులో రాజకీయ రంగం కూడా ట్రెండీగా మారబోతోంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే... సెబాస్టియన్‌ని స్టైల్‌... అతని మాట.. నడవడి... అందుకు ఉదాహరణ. ఫ్యాషన్‌ ఐకాన్లు కూడా చూపుతిప్పుకోనివ్వని నిలువెత్తు అందం... రాజకీయ చతురత.. ముందుచూపు... వీటితోనే అక్కడి ప్రజల్ని ఆకట్టుకుంటున్నాడు. వయసుని చూసి ఓటేయరు.. ప్రజల మనసు అర్థం చేసుకుంటే ఓటేస్తారని నమ్మి... తను నమ్మిన సిద్ధాంతాన్ని ముక్కుసూటిగా చెప్పాడు. అంతే... ప్రజల మనసు గెలుచుకుని ఛాన్సలర్‌గా అక్కడి అత్యున్నత రాజకీయ సింహాసనాన్ని అందుకుంటున్నాడు.

నేపథ్యం...
ఎలాంటి రాజకీయ ఆనవాళ్లు లేని కుటుంబం. చిన్నపాటి ఉద్యోగం సంపాదించడం కోసం తండ్రి పడ్డ ఇబ్బందుల్ని దగ్గరగా చూసిన మామూలు నేపథ్యం సెబాస్టియన్‌ది. పుట్టింది పెరిగిందీ అంతా ఆస్ట్రియా రాజధాని వియాన్నాలోనే. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 16 ఏళ్లు వచ్చిన ప్రతి కుర్రాడు... సైన్యంలో పనిచేయాలి. అలా సైనికుడిగా ఉన్న సమయంలోనే కర్జ్‌కు తన దేశం గురించి లోతైన అవగాహన ఏర్పడింది. ఓ పక్కన న్యాయవిద్య చదువుకుంటూనే.. ఆస్ట్రియన్‌ పీపుల్స్‌ పార్టీ యువజన సంఘానికి(ఓవీపీ) నాయకుడిగా పనిచేశాడు. రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నాక ఒక క్షణం కూడా ఆగలేదు. డిగ్రీ తీసుకునే చివరి క్షణంలో న్యాయవాద చదువుని కాదనుకుని రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అప్పుడు అతని వయసు 17. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేశాడు. ఆరంటే ఆరేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఎదురులేని శక్తిగా ఎదిగాడు.

రాజకీయంగా ఆకట్టుకున్నవి...
*రైట్‌, లెఫ్ట్‌ రెండు కలగలిపిన సరికొత్త భావజాలం
*ఆస్ట్రియాకి వెల్లువెత్తుతున్న శరణార్థులని అదుపులో ఉంచుతూ... స్థానికుల ఉపాధిపై దృష్టి పెట్టాడు.
*మహిళలు బురఖా ధరించడాన్ని నిషేధించడం...
*ప్రస్తుతం 43 శాతం ఉన్న పన్నుని 40 శాతానికి తగ్గిస్తానని మాటివ్వడం...

మొదట విదేశాంగశాఖ...
ఇరుగుపొరుగు దేశాల నుంచి వలసలు అధికంగా ఉండే ఆస్ట్రియాకి 27 యేళ్ల చిన్నవయసులో విదేశాంగ శాఖామంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ‘అయితే ఆస్ట్రియా తన విదేశీ విధానాలకి తిలోదకాలు ఇస్తోందన్నమాట’ అని రాజకీయం చేసే నాయకులని లెక్క చేయలేదు.

నల్లకోటు తీసేసాడు...
సంప్రదాయ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. సాధారణంగా కన్జర్వేటివ్‌లు ధరించే నల్లకోటు తీసేసి ఆ స్థానంలో స్టైలిష్‌గా కనిపించే టర్కోయిస్‌నీలిరంగు దుస్తులని పరిచయం చేసి ‘న్యూ ఆస్ట్రియన్స్‌ పీపుల్స్‌ పార్టీ’ అని పేరు మార్చాడు. నిండుగా పర్వతాలతో కనిపించే ఆస్ట్రియాలో విండ్‌ సర్ఫింగ్‌ చేయడం అంటే ఇష్టపడే కర్జ్‌... సోషల్‌మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. అభిమానులతో సెల్ఫీలు దిగడానికి ఇష్టపడే కర్జ్‌కి పాప్‌సింగర్‌కి మించిన క్రేజ్‌ ఉంది. అతని మంత్రివర్గంలో యువకులే ఎక్కువ. మహిళలు, పర్యావరణవేత్తలూ, క్రీడాకారులూ, మనస్తత్వ నిపుణులూ మంత్రివర్గంలో ఉన్నారు. పదమూడేళ్లుగా గర్ల్‌ఫ్రెండ్‌ సుసానీతో కలిసి అమ్మానాన్నలతో ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నాడు కర్జ్‌. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో చురుగ్గా ఉంటాడు. అతని సిల్కీనలుపు రంగు జుట్టుకి బోలెడు మంది అభిమానులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని