ఏడోసారి ఓడలేదు

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. రచ్చ గెలిచినా ఇంట గెలవలేదనే లోటు.. ఏడేళ్లుగా అలుపెరగని అధ్యయనం.. పోటీలో ఒకడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉన్నా కుంగిపోలేదు.. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు.. పట్టువదలని విక్రమార్కుడిలా ఏడో ప్రయత్నంలో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు హైదరాబాదీ 29 ఏళ్ల నవీన్‌కుమార్‌....

Published : 11 Nov 2017 01:54 IST

ఏడోసారి ఓడలేదు

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. రచ్చ గెలిచినా ఇంట గెలవలేదనే లోటు.. ఏడేళ్లుగా అలుపెరగని అధ్యయనం.. పోటీలో ఒకడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉన్నా కుంగిపోలేదు.. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు.. పట్టువదలని విక్రమార్కుడిలా ఏడో ప్రయత్నంలో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు హైదరాబాదీ 29 ఏళ్ల నవీన్‌కుమార్‌.

భారత కార్పొరేట్‌ క్విజ్‌లో వింబుల్డన్‌గా పేర్కొనే టాటా క్రూసిబుల్‌ బిజినెస్‌ క్విజ్‌లో తోటి ఉద్యోగి ఫ¾ణిమహేష్‌తో కలిసి ఈ ఏడాది జాతీయ విజేతగా నిలిచాడు. నిర్మాణరంగంలో పనిచేస్తూ బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుంటూ నేషనల్స్‌లో హైదరాబాద్‌ జట్టును మొట్టమొదటి సారి విజేతగా నిలిపి జాతీయ స్థాయిలో తెలుగువాడి సత్తా చాటాడు. విజయం తాలూకు అనుభవాలు అతడి మాటల్లోనే.

నా క్విజ్‌ ప్రయాణం గురించి చెప్పాలంటే ఏడేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఎంబీఏ పీజీడీఎం చేసేందుకు ఓయూలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌(ఐపీఈ)లో 2011లో చేరాను. అప్పుడే మొదటిసారి అధ్యాపకులు క్యాంపస్‌ క్విజ్‌ గురించి చెప్పారు. బిజినెస్‌ క్విజ్‌లో బాగా రాణిస్తున్న సీనియర్ల గురించి చెప్పడంతో నాలో ఆసక్తి కల్గింది. టాటా క్రూసిబుల్‌ క్విజ్‌, బ్రాండ్‌ ఈక్విటీ, ఈటీ ఇన్‌ క్యాంపస్‌ క్విజ్‌ల గురించి తెలిసింది అప్పుడే. క్లాస్‌మెట్‌ జుహేర్‌తో కలిసి పేరు ఇవ్వడం.. కొంత ముందస్తు సన్నద్ధతతో ఈటీ ఇన్‌ క్యాంపస్‌ క్విజ్‌ గెలిచాము. తొలి ప్రయత్నంతో విజయం దక్కడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ వెంటనే అదే సంవత్సరంలో టాటా క్రూసిబుల్‌ క్విజ్‌లో పాల్గొన్నాము. హైదరాబాద్‌ నుంచి 150 జట్లు పాల్గొంటే ఆరో స్థానంలో నిలిచాం. గెలుపు దక్కకపోవడంతో వచ్చే ఏడాది బాగా కష్టపడాలని అప్పుడే నిర్ణయించుకున్నాం.

అంతర్జాతీయ విజయం
మరుసటి ఏడాది.. క్యాంపస్‌ నుంచి పాల్గొనడానికి ఇదే అఖరి అవకాశం. మొదటి ప్రయత్నంలో లోటుపాట్లను సవరించుకుని 2012లో పాల్గొన్నాము. అన్ని జట్లను వెనక్కి నెట్టి టాటా క్రూసిబుల్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌ విజేతగా నిలిచాము. దేశవ్యాప్తంగా 18 నగరాల నుంచి జట్లు పోటీపడగా సెమీఫైనల్స్‌ గెలిచాము. ఫైనల్‌ చేరిన తుది 8 జట్ల జాబితాలో చోటు దక్కింది. మేము మరో జట్టు టైటిల్‌ రేసులో సమాన స్కోరు సాధించడంతో టైబ్రేకర్‌ అయ్యింది. 7 ప్రశ్నల వరకు వెళ్లి చివరగా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే జాతీయ స్థాయిలో మొదటి రెండు జట్లకు టాటా క్యాంపస్‌లో అంతర్జాతీయ పోటీలో పాల్గొనడానికి అవకాశం ఉండటంతో దానికి మేము అర్హత సాధించాము. జాతీయ పోటీలో ఓడినా.. అంతర్జాతీయంగా గెలవడం మాలో మరింత విశ్వాసం పెంచింది.

కరువు తీరింది
చదువు పూర్తయ్యాక అన్నయ్య కంపెనీలో చేరాను. అప్పట్నుంచే టాటా క్రూసిబుల్‌ కార్పొరేట్‌ క్విజ్‌లో వరుసగా పాల్గొంటాను. జాతీయ క్విజ్‌ విజేతగా నిలవాలనేది నా ఆశయం. 2012లో హైదరాబాద్‌ సిటీ నుంచి విజేతగా నిలవడం, సెమీస్‌ గెలిచి ఫైనల్‌ చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ పోటీలన్ని బజర్‌ రౌండ్‌. ఎవరూ ముందు చెబితే వారే విజేత. బజర్‌ నొక్కడంలో ఆలస్యం కావడంతో ఆ ఏడాది విజేతను కాలేకపోయా. నిరుత్సాహ పడలేదు. 2013లో కనీసం హైదరాబాద్‌ కూడా గెలవలేకపోయాను. కసి పెరిగింది. 2014, 2015లో హైదరాబాద్‌లో గెల్చి ప్రాంతీయ పోటీలో మూడు నాలుగు స్థానాలకు పరిమితం కావడంతో ఫైనల్‌ చేరలేకపోయాను. 2016లో హైదరాబాద్‌, ప్రాంతీయ రౌండ్లు దాటుకుని ఫైనల్‌ వెళ్లినా మూడో స్థానానికే పరిమితం అయ్యాను. హైదరాబాద్‌ ఐదుసార్లు గెలిచినా జాతీయ స్థాయి కలగా ఉండటంతో ప్రయత్నం ఆపలేదు. 2017 ఈ ఏడాది హైదరాబాద్‌, ప్రాంతీయ రౌండ్లు దాటుకుని ఫైనల్‌లో అడుగుపెట్టడం..అక్కడ విజేతగా నిలవడంతో ఎంతో ఆనందంగా ఉంది. చాలా ఎక్కువ స్కోరుతో గెలవడం మరింత సంతృప్తి నిచ్చింది. ఇకపై దీన్ని నిలబెట్టుకోవడం నా ముందున్న సవాల్‌. ఇప్పటివరకు ఒకరే రెండేళ్లు డిపెండ్‌ చేయగల్గారు. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఇదే.

- ఎం. రమేశ్‌రెడ్డి, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని