పరిశోధనవంతుడు

గతంలో పడిన కష్టం... ప్రస్తుత ప్రయాణంలో ఓ అత్యున్నత మైలురాయి అందుకునేలా చేసింది. అందుకు ఉదాహరణే ప్రకాశం జిల్లా అద్దంకి కుర్రాడు బండారు అశ్విని కుమార్‌... ప్రభుత్వ బడిలో అక్షరాలు దిద్ది... జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుని...

Published : 11 Nov 2017 02:35 IST

పరిశోధనవంతుడు

ఐర్లాండ్‌లో ఉద్యోగం...
ముప్పై ఏళ్లకే యువశాస్త్రవేత్తగా గుర్తింపు...
పీహెచ్‌డీ విద్యార్థిగా ఆరు అవార్డులు...
- ఇది గతం!
ప్రపంచవ్యాప్తంగా 20 మందిలో ఒకడిగా..
దేశవ్యాప్తంగా ఒకే ఒక్కడిగా గుర్తింపు...
- ఇది ప్రస్తుతం

గతంలో పడిన కష్టం... ప్రస్తుత ప్రయాణంలో ఓ అత్యున్నత మైలురాయి అందుకునేలా చేసింది. అందుకు ఉదాహరణే ప్రకాశం జిల్లా అద్దంకి కుర్రాడు బండారు అశ్విని కుమార్‌... ప్రభుత్వ బడిలో అక్షరాలు దిద్ది... జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుని... అంతర్జాతీయస్థాయిలో ఎంటర్‌ప్రైజ్‌ ఐర్లాండ్‌ అందించే ప్రఖ్యాత ‘మేరీ క్యూరీ కెరీర్‌- ఫిట్‌ ఫెలోషిప్‌’కి ఎంపికయ్యాడు. దీంట్లో భాగంగా రానున్న మూడేళ్లలో రూ.2 కోట్ల ఫెలోషిప్‌ అందుకోబోతున్నాడు. ఇది పల్లెటూరిలో పెరిగి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతిభకు దక్కిన అరుదైన పట్టం.

పీహెచ్‌డీ విద్యార్థులు, యువ శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు, వివిధ దేశాలు ఫెలోషిప్‌లు అందిస్తుంటాయి. అందులో ప్రతిష్ఠాత్మకమైంది మేరీ స్క్లోడొస్కా క్యూరీ యాక్షన్స్‌ (ఎంఎస్‌సీఏ), ఎంటర్‌ప్రైజ్‌ ఐర్లాండ్‌ అనే సంస్థ సంయుక్తంగా ఇచ్చే ఫెలోషిప్‌. ఏటా 20మంది యువ శాస్త్రవేత్తలకు ఈ పురస్కారం అందజేస్తారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వేలమంది దరఖాస్తు చేసుకుంటారు. వారి ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, ప్రతిభ, పనితీరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈసారి ఈ ఫెలోషిప్‌కి ఇండియా నుంచి ఎంపికైన ఒకే ఒక్కడు అశ్విని కుమార్‌. దీనిలో భాగంగా ఫిబ్రవరి-2018 నుంచి 36 నెలల పాటు తనకు రూ.రెండుకోట్ల నిధులు అందిస్తారు. చేయబోయే పరిశోధన ప్రగతికి సంబంధించి మూడేళ్లపాటు నివేదికలు కమిటీకి పంపించాల్సి ఉంటుంది. కుమార్‌ ప్రస్తుతం ఐర్లాండ్‌లోని లిమ్రిక్‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రభుత్వ పాఠశాలలో చదువు..
ప్రకాశం జిల్లాలోని అద్దంకి అశ్వినికుమార్‌ సొంతూరు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. మద్దిపాడులోని మండల పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో అతడి ప్రాథమిక విద్య పూర్తైంది. నవోదయా విద్యాలయలో ఇంటర్‌ వరకు చదివాడు. బీ.టెక్‌ తర్వాత ఎం.టెక్‌ పూర్తి చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొలువులో చేరాడు. ఆపై పరిశోధనలపై దృష్టి మళ్లింది. దిల్లీ ఐఐటీలో బాడీ ఆర్మర్స్‌, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్స్‌ అంశంపై ప్రత్యేకంగా పరిశోధనలు చేసి 2017 మార్చిలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు. యంత్రాల రూపకల్పన, వివిధ పరికరాల తయారీ, యూరో స్పేస్‌ విభాగాల పనితీరుపై పరిశోధక వ్యాసాలు రాశాడు. ఇవి 15 ప్రముఖ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ప్రతిభ ఆధారంగానే పీహెచ్‌డీ తర్వాత లిమ్రిక్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా కొలువు దక్కింది.

అరుదైన ఘనత
విదేశాల్లో ఉద్యోగం, మంచి వేతనం.. దీంతోనే సర్దుకుపోలేదు అశ్వినికుమార్‌. తన ప్రతిభ ప్రదర్శించుకునే వేదిక, పరిశోధకుడిగా మెరుగైన అవకాశాల కోసం వెతికాడు. ఈ క్రమంలోనే ఎంటర్‌ప్రైజ్‌ ఐర్లాండ్‌ ఫెలోషిప్‌ గురించి తెలిసి దరఖాస్తు చేసుకున్నాడు. తను రూపొందించిన ‘ఆప్టిమైజేషన్‌ ఆఫ్‌ ఆటోమేటిక్‌ టేప్‌ ప్లేస్‌మెంట్స్‌ సిస్టమ్స్‌’ ప్రాజెక్టుని ప్రతిపాదించాడు. తద్వారా ఈ ఫెలోషిప్‌కు అర్హత సాధించాడు. తను చేస్తున్న ప్రాజెక్టుకు మరింత సహకరించేలా, పరిశోధన ముందుకెళ్లేలా ఫెలోషిప్‌ కింద నగదు మొత్తం అందజేస్తారు. దీనికి ముందు కుమార్‌ పలు అవార్డులు సైతం అందుకున్నాడు. ఎఫ్‌ఐటీటీ నుంచి ఉత్తమ పారిశ్రామిక అనుబంధ శాస్త్రవేత్తగా, 2016లో అల్యూమ్నీ రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ అవార్డు, అప్లైడ్‌ మెకానిక్స్‌లో ఉత్తమ పరిశోధక విద్యార్థిగా అవార్డు అందుకున్నాడు.

మనలోని ఆసక్తే నడిపిస్తుంది
- అశ్విని కుమార్‌

ధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్న స్కూలు, కాలేజీల్లో చదివితేనే ఉన్నత లక్ష్యాలు పుట్టుకురావు. పట్టుదలతో చదువుతూ మన ఆసక్తుల్ని తెలుసుకున్నప్పుడే మనకో లక్ష్యం ఏర్పడుతుంది. నేను ఫాలో అయింది కూడా అదే. చిన్నతనం నుంచి ప్రభుత్వ బడిలోనే చదువుకుని ఇంత వరకు ఎదగడం ఆనందంగా ఉంది. యాంత్రిక చదువులు కాకుండా, ఆసక్తి ఉన్న అంశంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నేర్చుకుంటే అద్భుతాలు ఆవిష్కరించగలం. నా బాల్యం నుంచి చదువులు నేర్పించిన గురువులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

-మానెం శ్రీనివాసరావు,
ఈనాడు డిజిటల్‌: ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని