గాయం బ్రదర్స్‌ జయం

పదిమందికి సాధ్యం కానిదాన్ని చేసిచూపించినప్పుడే.. మనలో సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలిసేది. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలని పటాపంచలు చేస్తూ ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాలూ, సైకిళ్లూ రూపొందించి ప్రభుత్వాలూ, కార్పొరేట్‌ కంపెనీలతో పాటూ విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారీ అన్నదమ్ములు. వాళ్లే రాజా గాయం.. రాహుల్‌ గాయం.....

Published : 02 Dec 2017 02:05 IST

అంకురార్పణ
గాయం బ్రదర్స్‌ జయం

పదిమందికి సాధ్యం కానిదాన్ని చేసిచూపించినప్పుడే.. మనలో సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలిసేది. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలని పటాపంచలు చేస్తూ ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాలూ, సైకిళ్లూ రూపొందించి ప్రభుత్వాలూ, కార్పొరేట్‌ కంపెనీలతో పాటూ విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారీ అన్నదమ్ములు. వాళ్లే రాజా గాయం.. రాహుల్‌ గాయం..

బ్యాటరీ వాహనాలతో వచ్చే ఇబ్బందులు అధిగమించడానికీ.. తేలిగ్గా ఛార్జింగ్‌ చేసుకోవడానికీ, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే వినియోగదారులకు ఖర్చు తగ్గించడానికీ నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డారు.

రోజు దిల్లీ.. కాలుష్యకాసారం. రేపు అదే పరిస్థితి మన నగరాలకీ రావొచ్చు. ఒక వేళ అదే జరిగితే కాలుష్యానికి కారణమయ్యే మన పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు రోజులు మూడినట్టే. కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్‌ వాహనాలనే మనం వాడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితినిని ఏడేళ్ల క్రితమే వూహించిన అన్నదమ్ములు రాజా, రాహుల్‌లు ఆటోమొబైల్‌ రంగంలో వైవిధ్యంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. రాజా హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి. రాహుల్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో... శక్తిమంతమైన కెపాసిటర్లు, బ్యాటరీల పనితీరుపై అధ్యయనం చేశాడు. అయితే వీళ్లిద్దరికీ ఆటోమొబైల్‌ రంగం పూర్తిగా కొత్తేం కాదు. చిన్నతనం నుంచీ తెలిసిన వాతావరణమే. కారణం... తండ్రి కర్ణాటక, తెలుగురాష్ట్రాలతోపాటూ ఆర్మీ వాళ్లకు బస్సులు తయారు చేసి అందించేవాడు. ఇది పదేళ్ల క్రితం మాట. ఆయనకు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆ సంస్థను మూసేశారు. రాజా ఆ సంస్థను తిరిగి ప్రారంభించి.. డీజిల్‌ వాహనాలని తయారుచేసి అమ్ముతూ వాటిల్లో వచ్చిన లాభాలతో ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. దీనికి తోడు రాహుల్‌ కొన్నిసంవత్సరాలు లండన్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలో పనిచేశాడు. ఈ అనుభవం కూడా గాయం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి బాగా ఉపయోగపడింది. బ్యాటరీ వాహనాలతో వచ్చే ఇబ్బందులు అధిగమించడానికీ.. తేలిగ్గా ఛార్జింగ్‌ చేసుకోవడానికీ, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే వినియోగదారులకు ఖర్చు తగ్గించడానికీ ఈ అన్నదమ్ములిద్దరూ నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డారు. ‘సాధారణంగా పెద్దపెద్ద కంపెనీలన్నీ బస్సులూ, కార్లపై దృష్టి పెడుతూ ఉంటే.. మేం మాత్రం ప్రజారవాణాలో కీలకంగా ఉన్న ఆటోరిక్షాలపై దృష్టి పెట్టాం. ఎందుకంటే... ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆటోరిక్షాలకు డిమాండ్‌ ఎక్కువ. సాధారణ బ్యాటరీల స్థానంలో మొబైల్‌ ఫోన్లలో ఉపయోగించే శక్తిమంతమైన లిథియం- అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిక్‌ ఆటోలను రూపొందించాం. నాలుగున్నర సంవత్సరాలు కష్టపడితే కానీ... మా ప్రయోగాలు ఓ కొలిక్కి రాలేదు. 2015లో మా ఆటో రోడ్డెక్కింది’. అంటున్నారు గాయం బ్రదర్స్‌. వీరికి అమెరికాకు చెందిన రమణమాదల మెంటర్‌గా వ్యవహరించారు.


ఎలక్ట్రిక్‌ ఆటో, సైకిల్‌...

టో పేరు జీఎమ్‌డబ్ల్యూ స్మార్ట్‌. శక్తిమంతమైన లిథియం ఆయాన్‌ బ్యాటరీ టెక్నాలజీ నడుస్తోంది. మూడు గంటల్లో చార్జ్‌ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 110 కిలోమీటర్లు నడుస్తుంది. గరిష్ఠ వేగం గంటకి 55 కిలోమీటర్లు. ఛార్జింగ్‌ అయిపోతే ఛార్జింగ్‌ హబ్‌లలో బ్యాటరీని మార్చుకోవచ్చు. ఈ కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌ వంటి కొరియర్‌ కంపెనీలు ఆటోలను కొనుగోలు చేశాయి. తెలంగాణా, ఆంధ్రా పురపాలక సంస్థలూ ఆటోలను వాడుతున్నాయి. ఇక ‘ఈబైక్‌’ విషయానికొస్తే ఇదో ఎలక్ట్రికల్‌ బైస్కిల్‌. యాక్సిలేటర్‌ తిప్పితే స్కూటర్‌లా దూసుకెళ్తుంది. బ్యాటరీ ఆఫ్‌ చేసి సైకిల్‌ మాదిరిగా తొక్కొచ్చు. అలాగే, కాంబినేషన్‌ మోడ్‌లో మోటర్‌ మరియు మజిల్‌ పవర్‌ కలిసి పనిచేస్తుంది. ఇందులో బేసిక్‌ రకం ధర 29,000. ఇది రెండు గంటలు ఛార్జ్‌ చేస్తే 35 కిలోమీటర్లు నడుస్తుంది. హై అండ్‌ రకం ధర 46,000. రెండు గంటలు చార్జింగ్‌ పెట్టుకుంటే 65 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ సైకిళ్లని ఉబర్‌ సంస్థకు చెందిన ఉబర్‌ ఈట్స్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ కొనుగోలు చేసింది.

- శ్రీ సత్యవాణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని