ఒంటిచేత్తో ఐఏఎస్‌

‘వికలాంగుడిని. ధ్రువీకరణ పత్రం ఇవ్వండి. అదే నాకు ఆధారం. దాంతోనే ఉపకార వేతనం వస్తుంది. చదువుకుంటాను.’ అధికారి కనికరం చూపలేదు. చెయ్యి తడిపితేనే పని అవుతుందన్నాడు. ‘బస్సు పాసు కోసం ఎన్నిరోజులు ఎదురుచూడాలి. ఇలా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం న్యాయమా..?’ మూణ్నెళ్లపాటు కాళ్లరిగేలా తిరిగాక కానీ.. బస్‌పాస్‌ రాలేదు....

Published : 02 Dec 2017 02:09 IST

సంకల్పం
ఒంటిచేత్తో ఐఏఎస్‌

‘వికలాంగుడిని. ధ్రువీకరణ పత్రం ఇవ్వండి. అదే నాకు ఆధారం. దాంతోనే ఉపకార వేతనం వస్తుంది. చదువుకుంటాను.’
అధికారి కనికరం చూపలేదు. చెయ్యి తడిపితేనే పని అవుతుందన్నాడు.
‘బస్సు పాసు కోసం ఎన్నిరోజులు ఎదురుచూడాలి. ఇలా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం న్యాయమా..?’
మూణ్నెళ్లపాటు కాళ్లరిగేలా తిరిగాక కానీ.. బస్‌పాస్‌ రాలేదు..

‘అవినీతి, నిర్లక్ష్యం ప్రభుత్వపాలనను చెదపురుగుల్లా తినేస్తున్నాయి..’ అని తిట్టుకుంటూ ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటికి వచ్చాడు ఆ కుర్రాడు. తలపైకెత్తి సర్కారు బోర్డు వంక చూశాడు. పిడికిలి బిగుసుకుంది. ప్రజలను పట్టిపీడిస్తున్న ఈ జాడ్యాన్ని రూపుమాపాలంటే.. కార్యదీక్షతో పాలించే ప్రభుత్వ అధికారిని కావాలని అక్కడికక్కడే తీర్మానించుకున్నాడు. ఇప్పుడతను చిత్తూరు జిల్లా సంయుక్త పాలనాధికారి (జేసీ) గిరీషా. మారుమూలపల్లెల్లో సగటు రైతుబిడ్డ పడే కష్టాలన్నీ పడ్డాడు. కానీ, అంగవైకల్యం మరో అదనపు కష్టం. ఆ రెండింటికీ ఎదురీది.. సివిల్స్‌ సాధించాడు. ఆ గెలుపు కథను ఆయన మాటల్లో...

‘‘కర్టాటక రాష్ట్రం మండ్యా జిల్లాలోని పిట్టేకొప్పలు మా సొంతూరు. ఓ నలభై ఇళ్లు ఉంటే చిన్న పల్లె. ఐదోతరగతి వరకు సర్కారుబడిలోనే చదువుకున్నాను. నాన్న శివరామేగౌడ, అమ్మ రత్నమ్మ కష్టజీవులు. భూమినే నమ్ముకున్న మట్టిమనుషులు. మాకు పాడి ఆవులు ఉండేవి. వాటికి తిండితిప్పల బాధ్యతంతా నాదే! పచ్చిగడ్డి వేయాలి. నీటితో శుభ్రం చేయాలి. పితికిన పాలను క్యాన్ల ద్వారా మార్కెట్‌కు తరలించాలి. ఈ పనులన్నీ చక్కబెట్టాకే చదువు. పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికొచ్చి పుస్తకాలను మూలన పడేస్తే కుదరదు. అప్పటికప్పుడు హోంవర్క్‌ పూర్తి చేయాల్సిందే! లేదంటే అన్నం పెట్టడు నాన్న. ఆయనలోని ఆ కాఠిన్యమే క్రమశిక్షణను నేర్పింది. జీవితం సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో... విధికి కన్నుకుట్టింది. హఠాత్తుగా ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఒక రోజు - ఇంటి పనులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ కొట్టింది. రెండు చేతులు స్పర్శ కోల్పోయాయి. కుడి చేయి తొలగించాల్సి వచ్చింది. మిగిలింది ఎడమచెయ్యి ఒక్కటే! తడిమి చూసుకుంటే.. అది కూడా పనిచేయలేదు. భయమేసింది. తొమ్మిది శస్త్రచికిత్సలు జరిగాక కానీ కదలిక రాలేదు. గుండె దిటవు చేసుకునే వయసు కూడా కాదది. ఏమీ తోచలేదు. పదోతరగతి పరీక్షలు రాయలేక పోయాను. ఆ బాధ కంటే.. పెన్ను పట్టుకుని రాసే కుడిచేయి లేదన్న బాధ కుంగదీసింది. సహాయకుడితో రాయించి పరీక్షలు గట్టెక్కాను. ఇంటర్‌లో కష్టపడి ఎడమచేత్తోనే పరీక్షలన్నీ రాశాను. జీవితంలో అవసరం అన్నీ నేర్పిస్తుంది.

వైద్యుడిని కాలేక...

న్ను వైద్యుడిగా చూడాలనే అమ్మ కోరిక మేరకు పట్టుదలతో వైద్య ప్రవేశపరీక్ష రాశాను. మైసూర్‌లో ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. ఒంటి చేత్తో వైద్యం సాధ్యం కాదని తెలిసి వదులుకోక తప్పలేదు. ఇంట్లో భారం కాకుండా చదువుకోవాలనే నిర్ణయానికి వికలాంగులకు ప్రభుత్వం అందించే ఐదొందల రూపాయల పింఛను పనికొచ్చింది. 2010లో సివిల్స్‌ మొదటి ప్రయత్నంలోనే ఇండియన్‌ రైల్వే సర్వీస్‌కు ఎంపికయ్యా. అంతటితో ఆగలేదు. రెండో ప్రయత్నం చేశా. అప్పుడూ నిరాశే! మూడో ప్రయత్నంగా 2012లో ఐఏఎస్‌ వరించింది. ముస్సోరిలో శిక్షణ అనంతరం తొలిపోస్టింగ్‌ నెల్లూరు జిల్లా గూడూరులో వచ్చింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా జేసీగా రెండో పోస్టింగ్‌ వచ్చింది. లంచం ఇవ్వందే వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఇవ్వని అధికారి.. బస్సు పాసు కోసం తిప్పుకున్న సంఘటన నాకెప్పటికీ గుర్తుంటాయి. నేను పడిన ఇబ్బంది మరొకరు పడకూడదు. నిజాయితీగా పాలన సాగిస్తే చాలు.

- కరీముల్లా షేక్‌, చిత్తూరు, ఈనాడు,
గుళ్లపెల్లి సిద్ధార్థ, ఈజేఎస్‌ విద్యార్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు