చేయూత్‌

కొడిగడుతున్న దీపం ఆరిపోకూడదంటే.. రెండు చేతులు అడ్డుపెట్టాలి. ఆ దీపం.. బ్రెయిన్‌ట్యూమర్‌తో మరణం చివరి అంచుల వరకు వెళ్లిన అభిషేక్‌ కావొచ్చు. ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయకపోతే ఆగిపోయే సామన్‌ చిట్టిగుండె అవ్వొచ్చు. ఇలా కొడిగడుతున్న దీపాలను ఆరిపోనివ్వకూడదంటే.. దాత చెయ్యి.. దారిచూపే మరో చెయ్యి ఏకం అవ్వాలి.

Published : 09 Dec 2017 03:16 IST

చేయూత్‌

కొడిగడుతున్న దీపం ఆరిపోకూడదంటే.. రెండు చేతులు అడ్డుపెట్టాలి. ఆ దీపం.. బ్రెయిన్‌ట్యూమర్‌తో మరణం చివరి అంచుల వరకు వెళ్లిన అభిషేక్‌ కావొచ్చు. ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయకపోతే ఆగిపోయే సామన్‌ చిట్టిగుండె అవ్వొచ్చు. ఇలా కొడిగడుతున్న దీపాలను ఆరిపోనివ్వకూడదంటే.. దాత చెయ్యి.. దారిచూపే మరో చెయ్యి ఏకం అవ్వాలి. అత్యాధునిక క్రౌడ్‌ఫండింగ్‌ నెట్‌వర్క్‌తో అలా.. దాతలకు, బాధితులకు కొత్త వారధిగా నిలుస్తోంది మిలాప్‌. ఆ వారధికి ఊపిరి పోసిన ఇద్దరు యువకులు.. అనోజ్‌ విశ్వనాథన్‌, మయూక్‌  చౌదురి. 120 దేశాల దాతల్ని పోగుచేసి.. రూ.252 కోట్ల  దాతృత్వంతో.. దయనీయ బతుకుల జీవితాల్లో  వెలుగుల్ని పూయిస్తున్నారు. ఒక్కపైసా ముట్టకుండా సేవలందిస్తున్నారు.

ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తుంటారు. మరికొందరికి ఆదుకోవాలని ఉంటుంది. ఎలా సాయం చేయాలో తెలీదు. పైగా ఇచ్చినది సరిగ్గా ఖర్చు అవుతుందా? బాధితులకు న్యాయం జరుగుతుందా? తెలుసుకోవడం కష్టం. సాయం చేయడానికో సులువైన మార్గముంటే బావుంటుందని కోరుకునే వాళ్లు ఎక్కువ. ఈ విషయాలన్నింటిని గమనించిన మయూక్‌ చౌదురి, అనోజ్‌ విశ్వనాథన్‌ పరిష్కారం కనుక్కొన్నారు. బెంగళూరు కేంద్రంగా మిలాప్‌ను నెలకొల్పారు. సేవ చేయడానికి ఆసక్తి ఉన్న యువకులను ఎంపికచేసుకున్నారు. వారి ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి సహాయం అవసరమైన వివరాలను పొందుపరిచారు. పేటీఎం, బ్యాంకు అకౌంటు ద్వారా సలువుగా డబ్బు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. సాయం చేసిన వారి వివరాలను ఎప్పటికప్పుడు సైట్‌లో ప్రదర్శించారు. తమ వివరాలు వెల్లడించవద్దు అనుకునే వారికీ వెసులుబాటు ఇచ్చారు. తర్వాత బాధితులకు జరిగిన మేలును అప్‌లోడ్‌ చేసి చూపించారు. దీంతో క్రౌడ్‌ఫండ్‌కు ఆదరణ పెరిగిపోయింది. సమస్యలకు పరిష్కారం లభిస్తోంది.

* పేదలకు సహాయం చేయడానికి 2010లో మొదలైన చిన్న సంస్థ 2014లో మిలాప్‌గా అవతరించింది. వ్యక్తిగత, సామూహిక అవసరాలకు నిధిని సేకరిస్తోంది. విద్య, వైద్యం, పరిశోధన, టెక్నాలజీ, పోషకాహార లోపం నివారణ, స్టార్ట్‌అప్‌లు, పర్యావరణ పరిరక్షణ, భూమి, నదుల సంరక్షణ వంటి వాటికి ఇతోధికంగా సహాయపడుతోంది.

సాయం చేయడమెలా?
వెబ్‌సైట్‌ హోమ్‌పేజీలోనే సహాయం పొందాలనుకునే వారి చిత్రాలు, వివరాలు ఉంటాయి. అక్కడే పేటీఎం, బ్యాంకు అకౌంటు వివరాలు కన్పిస్తాయి. మనం డబ్బు పంపాలనుకుంటే నేరుగా వీటి ద్వారా పంపేయొచ్చు. పైగా మిలాప్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా తిరిగి బాధితుల పరిస్థితులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు.

ఆసరా కోరాలంటే...
మీ పరిసరాల్లో ఎవరికైనా వ్యాధి వచ్చింది. వారికి నయం చేసుకొనే శక్తి లేదు. శస్త్రచికిత్సకు డబ్బు అవసరం... అలాంటి వివరాలను ఎవరైనా http://milaap.org వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి నమోదు చేయొచ్చు. మిలాప్‌ కార్యకర్తలు వచ్చి పరిశీలించి సైట్‌లో వివరాలు ప్రచురిస్తారు. తమిళనాడుకు చెందిన ఆనందన్‌, కవిత దంపతులకు బిడ్డ పుట్టాడు. వారి సంతోషం ఎంతో సేపు నిలువలేదు. పుట్టకతోనే బిడ్డ గుండెకు శస్త్రచికిత్స అవసరమైంది. అందుకు రూ.3లక్షలు అవసరం. తెలిసిన వారి ద్వారా మిలాప్‌లో బాధను చెప్పుకొన్నారు. ఎంతో మంది శస్త్రచికిత్సకు అవసరమైన డబ్బును అందజేశారు.

* మొక్కలు నాటాలని అనుకున్నారు. మన వద్ద ఉన్న డబ్బుతో ఓ 10, లేదంటే 20 మొక్కలు నాటగలం. మరి వాటి సంరక్షణ, చాలా మొక్కలు నాటాలంటే అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. ఇలాంటి స్థితిలో మీ తపన, వివరాలను మిలాప్‌లో నమోదు చేసి, దాతల నుంచి సహాయం కోరవచ్చు. మోదీ ఇచ్చిన స్వచ్‌భారత్‌ పిలుపు ముంబయికి చెందిన రాహుల్‌ను కదిలించింది. అక్కడి అపరిశుభ్రతను పారదోలాలనుకున్నాడు. వీధుల్లో చెత్త బుట్టలు ఏర్పాటు చేస్తే సగం సమస్య పరిష్కారమైనట్లు భావించాడు. అందుకే 200 మీటర్లకు ఒక చెత్త బుట్టను ఏర్పాటు చేయాలనుకున్నాడు. కావాల్సిన డబ్బు లేదు. మిలాప్‌లో తన లక్ష్యాన్ని ఉంచాడు. ఎంతో మంది స్పందిస్తున్నారు.

ఆపన్న హస్తం కోసం
* మహేశ్వరిది తమిళనాడులోని ధర్మపురి జిల్లా నాగదసంపటి గ్రామం. తను తల్లి గర్భంలో 7 నెలలో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. ఆ విషాదం తట్టుకోలేక తల్లి మతిస్థిమితం కోల్పోయింది. అక్క, తనూ అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటోంది. 10వ తరగతిలో 474 మార్కులతో పాఠశాలలోనే ద్వితీయస్థానం సంపాదించింది. ఇప్పుడు 12వతరగతి చదువుతోంది. తనకు వైద్యురాలు కావాలని, తన తల్లిలాంటి వారికి చికిత్స చేయాలని ఆశ. తన దగ్గర నీట్‌ కోచింగ్‌ అవసరమైన డబ్బు లేదు. మిలాప్‌లో తన వివరాలు నమోదు చేసింది. ఇప్పటికే చాలా మంది స్పందించారు.

* పీటీ ఉష తెలుసుగా? ఒలింపిక్‌ రన్నర్‌. దేశం గర్వించతగ్గ మహిళా క్రీడాకారిణి. తనలా ఒలింపిక్స్‌కు వెళ్లాలని తపన పడే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చేందుకు ఈమె కేరళలో ఉషా స్కూల్‌ అఫ్‌ అథ్లెట్‌ను ప్రారంభించింది. తనుకున్న అనుభవంతో 18 మంది అమ్మాయిలకు తర్ఫీదు ఇస్తోంది. ఆసక్తి, ప్రతిభ ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసుకొని శిక్షణ, వసతి, భోజనం అన్నీ ఉచితంగా ఇస్తుంది. వీరిని ఒక్కొక్కరినీ తీర్చిదిద్దడానికి ఏటా రూ.3లక్షల వరకూ ఖర్చు వస్తోంది. ఈ స్కూల్‌ మొత్తం దాతల సహాయంలోనే నడుస్తోంది. వీరూ మిలాప్‌లో తమ ఉద్దేశం నమోదు చేశారు. సహాయం చేయాలనుకునే వారు స్పందిస్తున్నారు.

టెక్నాలజీ ఆర్తులకు ఉపయోగపడాలని... 

నేను కోయంబతూర్‌లో చదువుకున్నాను. సింగపూర్‌లో ఉద్యోగం చేశాను. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఎంతో మంది దేశంలో సాయం కోసం ఎదురుచూస్తుండటం కన్పించింది. వీరి కోసం టెక్నాలజీని ఉపయోగించి ఏం చేయలేమా? అని ఆలోచించాను. నా స్నేహితుడు చౌదురీతో కలిసి మిలాప్‌ను రూ.15లక్షలతో మొదలు పెట్టాను. తర్వాత పలువురు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం 59 మంది కలిసి పనిచేస్తున్నాం.

- అనోజ్‌ విశ్వనాథన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని