ఒక్క ‘షార్ట్‌’లో 48 కొట్టాడు..

లక్ష్యానికి తపన తోడైతే విజయం మన చేతుల్లోనే ఉంటుందని నిరూపించాడో యువకుడు. మారుమూల గ్రామంలో పుట్టి...

Published : 27 Jan 2018 01:29 IST

సిక్కోలు చిత్రం
ఒక్క ‘షార్ట్‌’లో 48 కొట్టాడు..

లక్ష్యానికి తపన తోడైతే విజయం మన చేతుల్లోనే ఉంటుందని నిరూపించాడో యువకుడు. మారుమూల గ్రామంలో పుట్టి... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు శ్రీకాకుళం జిల్లా కుర్రాడు. భారతదేశానికి సంబంధించిన లఘుచిత్రం విదేశాలలో ప్రదర్శనకు ఎంపిక కావడమే అరుదుగా భావించే పరిస్థితుల్లో అతను తీసిన చిత్రం ఏకంగా 48 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇప్పటివరకు 150 దేశాలలో ప్రదర్శనకు నోచుకుంది. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, ఆర్ట్స్‌ తదితర అన్ని విభాగాల్లో ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికై ఖండాంతర ఖ్యాతి సొంతం చేసుకున్న ‘లివింగ్‌ ఐడిల్‌’ దర్శకుడి గురించి ఇదంతా... ఇంతకీ ఎవరా యువ దర్శకుడు?
సినిమా తీసేందుకు ముందుగా ఓ సన్నాహం జరుగుతుంది. సినిమా ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఊహా చిత్రాల ద్వారా చూస్తారు. సమగ్ర అంశాలను దీని ద్వారా ముందే తయారు చేసుకొంటారు. దీన్నే ప్రీ విజువలైజేషన్‌ అంటారు. దీనివల్ల సినిమా నిర్మాణ వ్యయం బాగా తగ్గుతుంది. ఇందులో ప్రవీణుడు పి.ఎం. వెంకటరమణ. ఇతని ప్రతిభను గుర్తించి బ్యాండిట్‌ క్వీన్‌ లాంటి చిత్రాలు తీసిన శేఖర్‌కపూర్‌ తన బృందంలో సభ్యునిగా నియమించుకున్నారు. ఆయన వద్ద పది ప్రముఖ బాలీవుడ్‌ చిత్రాలతోపాటు ఐదు హాలీవుడ్‌ చిత్రాలకు ప్రీ విజులైజేషన్‌ పని నిర్వహించిన రమణను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈగ, రాజన్న చిత్రాలకు పని చేసే అవకాశం ఇచ్చారు. నాగార్జున ఢమరుకం చిత్రానికి సంబంధించిన ప్రీ విజులైజేషన్‌తో పాటు కళా రంగంలోనూ పాలుపంచుకున్నాడు.


ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ

ప్రతిఒక్కరూ ఏదోఒక అంశంలో ప్రతిభ కలిగి ఉంటారు. దాన్ని గుర్తించి సాధన చేస్తే విజయం సాధించొచ్చు. యువత, విద్యార్థులు యాంత్రిక విధానాలతో సాగిపోకుండా భిన్నంగా ఆలోచిస్తే విజయాలు సాధ్యమవుతాయి. నా చిత్రం 48 అవార్డులు సాధించుకోవడం ఆనందంగా ఉంది. సొంత దేశం మద్దతు లేకపోవడంతోనే ఆస్కార్‌కు నామినేషన్‌ పొందలేకపోయిందనే బాధ ఉంది. గాంధీతత్వంపై తీసే రెండో చిత్రంలో ఇంతకంటే అత్యాధునిక సాంకేతికత ఉండేలా ప్రయత్నిస్తున్నాను.

- పి.ఎం.వెంకటరమణ  

ఆరు నెలల పరిశోధన.. రెండు రోజుల చిత్రీకరణ
కోల్‌కతా సామాన్యుల జీవన విధానంపై ఆరు నెలలు పరిశోధన చేసి, ముందస్తు ప్రణాళికతో చిత్రాలు గీసుకొని రెండ్రోజుల్లో లివింగ్‌ ఐడిల్‌ను చిత్రీకరించారు రమణ. తరువాత నాలుగు నెలల పాటు పోస్టుప్రొడక్షన్‌ పనుల ద్వారా అత్యద్భుత సాంకేతిక అంశాలను జోడించి హాలీవుడ్‌ ప్రముఖులను అబ్బురపర్చారు. ఒకరోజు చిత్రీకరణకు గాను రూ.4 లక్షల వరకు వ్యయమవుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో ఆరు రోజుల చిత్రీకరణను రెండ్రోజుల్లో పూర్తి చేయగలిగారు. శిల్పకారుడు, దేవుడు, స్త్రీమూర్తి అనే మూడు భిన్నమైన పార్శ్వలతో ఆకట్టుకున్నారు. ఆంగ్లం, హిందీతోపాటు తెలుగులో చిత్రాన్ని విడుదల చేసి మన్ననలు పొందారు. రెండో చిత్రంగా గాంధేయవాదంపై తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

బారువ గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మారుమూల తీరప్రాంత గ్రామం బారువకు చెందిన పి.ఎం.వెంకటరమణకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం పట్ల ప్రత్యేక ఆసక్తి. తండ్రి పి.ఎం.సూర్యనారాయణ డ్రాయింగ్‌ టీచర్‌ కావడంతో పిల్లలను చిత్రలేఖనం వైపు ప్రోత్సహిస్తూ వచ్చారు. తల్లి పి.ఎం.కస్తూరితోపాటు ఇద్దరు సోదరుల సహకారంతో చిత్ర పరిశ్రమవైపు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌ చేశారు. జికా (జెడ్‌.ఐ.సి.ఎ.) ఇన్‌స్టిట్యూషన్‌లో శిక్షణ పొందుతూనే చిత్రలేఖనం, ఇతర మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకున్నాడు. తనతోపాటు చదువుకున్న స్నేహితులంతా ఇంజినీరింగ్‌, వైద్యం రంగాల వైపు పరుగులు తీయగా రమణ  భిన్నంగా ఆలోచించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.

-బత్తుల కామేశ్వరరావు  
న్యూస్‌టుడే, సోంపేట, శ్రీకాకుళం జిల్లా  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని