కాలే కడుపుతో కోట్లకు అధిపతి

ఆకలి అంచుల నుంచి మొదలైన ప్రయాణం... అతన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చింది. పరిశోధనకు అతను పడిన కష్టం... తలరాతను మార్చడమే కాదు అతన్ని ఉన్నత స్థానంలో నిలిపింది. ఆన్‌లైన్‌ వ్యాసాల ప్రచురణ... అతన్నో వ్యాపారిగా మార్చింది. ఆ ఆలోచనేంటి? ఆయనెవరు.. ఎలా ఎదిగారు?

Published : 03 Feb 2018 02:12 IST

కాలే కడుపుతో కోట్లకు అధిపతి

ఆకలి అంచుల నుంచి మొదలైన ప్రయాణం... అతన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చింది. పరిశోధనకు అతను పడిన కష్టం... తలరాతను మార్చడమే కాదు అతన్ని ఉన్నత స్థానంలో నిలిపింది. ఆన్‌లైన్‌ వ్యాసాల ప్రచురణ... అతన్నో వ్యాపారిగా మార్చింది.  ఆ ఆలోచనేంటి? ఆయనెవరు.. ఎలా ఎదిగారు?

డికి వెళ్లాలంటే ప్రతి రోజు రానుపోను పదిహేను కిలోమీటర్ల దూరం నడవాలి. దారిలో ఏరు పొంగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఏరు దాటాలి. పోని డబ్బున్న కుటుంబమా అంటే.. నెలనెలా అతనికొచ్చే ఉపకార వేతనమే అతని ఆధారం. ఇది శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెనకు చెందిన గేదెల శ్రీనుబాబు నేపథ్యం. అయిదో తరగతి వరకు అన్ని కష్టాలూ పడి చదువుకున్నాడు. ఓ పక్కన పేదరికం ఎన్ని కష్టాలు పెడుతున్నా తట్టుకుని విశాఖ వర్సిటీలోనే బీఫార్మసీ చేశాడు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఇచ్చే రూ.700 ఉపకారవేతనంతో నెట్టుకొచ్చేవాడు. ఆ డబ్బుతోనే బయోటెక్నాలజీలో ఎం.టెక్‌ చేశాడు. అతని జీవితం మలుపు తిరిగింది మాత్రం.. మధుమేహాన్ని ముందే కనుక్కోవచ్చా? అనే ఆలోచనతోనే. ఈ అంశంపై అతను పీహెచ్‌డీ పరిశోధన మొదలెట్టాడు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి నుంచి రక్త నమూనా తీసుకుని.. ఆ ప్రొటీన్లలో వచ్చే మార్పులు అంచనావేసి భవిష్యత్తులో ఆ వ్యక్తికి మధుమేహం వచ్చే అవకాశం ఉందో, లేదో చెప్పొచ్చు. ఇదే శ్రీను పరిశోధన అంశం. ఈ క్రమంలో అతనిచ్చిన సూచనలు విలువైనవి కావడంతో యువ శాస్త్రవేత్త అవార్డు వచ్చింది. 2017లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈ అవార్డు అందుకున్నాడు శ్రీనుబాబు.

అవస్థ నుంచే అవకాశం...
పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు పరిశోధనాత్మక సమాచారం కోసం అతను చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో  ఆ సమాచారం అందుబాటులో ఉండేది కాదు. దాంతో హైదరాబాదులోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లకు వెళ్లి.. తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇది తన సమస్య మాత్రమే కాదని యువశాస్త్రవేత్త అవార్డు అందుకోవడానికి సియోల్‌ వెళ్లినప్పుడు తెలుసుకున్నాడు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువ శాస్త్రవేత్తలది కూడా ఇదే సమస్య అని తెలుసుకున్నాడు. ఉన్నా... ఎంతో కొంత డబ్బు చెల్లించి వైద్య పత్రికల నుంచి తీసుకోవాల్సి వచ్చేది. ఒక వ్యాసం కావాలంటే సుమారుగా రూ.4-5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పేద విద్యార్థులకు పెద్ద విషయమే. ఎవరైనా.. ఎక్కడి నుంచైనా సరే ఉచితంగా ఎందుకు సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకోకూడదనే ఆలోచన అప్పుడే వచ్చింది శ్రీనుబాబుకి. అది తర్వాతి కాలంలో వ్యాపారంగా రూపు దాల్చింది.

2007లో మొదలు...
‘జర్నల్‌ ఆఫ్‌ ప్రొటియోం’ అంటే హ్యూమన్‌ ప్రొటీన్స్‌ అంతటినీ అధ్యయనం చేసే సబ్జెక్టు. మన శరీరంలోని ప్రతి కదలికకు ప్రొటీన్సే కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశంతోనే 2007 ఫిబ్రవరిలో డిజిటల్‌ జర్నల్‌ని శ్రీనుబాబు ఆరంభించారు. తొలి సంచిక పది వ్యాసాలతో తీసుకొచ్చాడు. ఆర్టికల్స్‌ అన్నీ పీడీఎఫ్‌లో పెట్టారు. దీన్ని వెయ్యి మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ విజయం అందించిన ఉత్సాహంతో శ్రీను మరో పరిశోధనకు శ్రీకారం చుట్టారు. కనీసం నాలుగేళ్లకు ముందే క్యాన్సర్‌ను గుర్తించే అవకాశం ఉందా? అనేది పరిశోధనాంశం. మరో పక్క వర్సిటీ సహకారంతో క్యాన్సర్‌, డయాబెటీస్‌, ఫార్మసీ.. ఇలా పదులకొద్ది వైద్య పత్రికలని ఆన్‌లైన్‌లో పెట్టారు. వేలాది మంది వీటిని డౌన్‌లోడ్‌ చేసుకునేవారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఆఫ్తల్మాలజి వంటి అనుబంధ రోగాలకూ తన పరిశోధనా పత్రికల ప్రచురణను విస్తరించారు. క్యాన్సర్‌పై నలభై రకాల జర్నల్స్‌ తెచ్చారు. అలా వీటి సంఖ్యని వెయ్యికి పెంచారు. ఏటా 50 వేల డిజిటల్‌ వ్యాసాలని ప్రచురిస్తూ వచ్చారు. ప్రస్తుతం వీటిని చదివే పాఠకుల సంఖ్య 50 లక్షలకు చేరుకోవడం విశేషం.

- అడ్డాల రామకృష్ణ, ఈనాడు, శ్రీకాకుళం

భారత్‌లో జీవశాస్త్రాలను చదువుకున్న పోస్టుగ్రాడ్యుయేషన్‌ విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచే వస్తున్నారు. ఐటీ వాళ్లకు వస్తున్నట్లుగా వీరికి బహుళజాతి సంస్థల్లో ఎక్కువ ఉద్యోగాలు రావడం లేదు. తగిన నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణం. దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. జీవశాస్త్ర, సాంకేతిక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని విశాఖలో నెలకొల్పుతున్నాను. మా ఊరిలో అల్లెన డెవలప్‌మెంటు సంఘాన్ని స్థాపించా. మురుగునీటిపారుదల వ్యవస్థకు రూ.50లక్షలు సమకూర్చా. రూ.25 లక్షలతో రామాలయాన్ని నిర్మించాను. నేను చదివిన పాఠశాలలో పిల్లలు తినడానికి, ఇతరత్రా అవసరాల కోసం రూ.25 లక్షలతో భవనాలు నిర్మిస్తున్నా. విశాఖపట్నాన్ని హుదూద్‌ కుదిపేసినప్పుడు నావంతుగా రూ.పాతిక లక్షల వరకు విరాళం ఇచ్చాను.

గేదెల శ్రీనుబాబు

పల్‌సస్‌.కాం ప్రారంభం

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్‌ మాలిక్యులర్‌ బయాలజీ ల్యాబొరేటరీ (ఈఎంబీఎల్‌) వంటి సంస్థలు పరిశోధనలకు నిధులు సమకూరుస్తాయి. ఈ క్రమంలో పరిశోధకుల ఆర్టికల్స్‌ను పబ్లిష్‌ చేసినందుకు ఆ ఏజెన్సీలు డబ్బు చెల్లించేవి. ఒక ఆర్టికల్‌కు 900 డాలర్లు చెల్లించేవారు. ఒమిక్‌.ఓఆర్జీ పేరుతో వ్యాసాలు ప్రచురించారు. ఫండింగు ఏజెన్సీ నుంచి వచ్చిన ఆర్టికల్సే వేసేవారు. ఒక వ్యాసం ప్రచురితమయ్యాక ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫ్రీ యాక్సెస్‌ కావడంతో ప్రపంచంలో పాఠకుల సంఖ్య పెరగడంతో శాస్త్రవేత్తలంతా రావడం మొదలెట్టారు. హైదరాబాదులో హైటెక్‌సిటీ, మైండ్‌స్పేస్‌, దివ్యశ్రీఎన్‌ఎస్‌ఎల్‌సెజ్‌ల్లోనే సంస్థలు నెలకొల్పి పల్‌సస్‌.కాం పేరుతో వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పల్‌సస్‌ ద్వారా ఏటా 40 దేశాల్లో మూడువేల కాన్ఫరెన్సులను నిర్వహిస్తున్నారు. అక్కడ పరిశోధకులతోనే వారి పరిశోధనలు ప్రదర్శింప చేస్తున్నారు. ఫార్మా సంస్థలు, మెడికల్‌ డివైజెస్‌ సంస్థలు వారి కొత్త ఉత్పత్తులను ఈ కాన్ఫరెన్సుల్లోనే ప్రారంభించేందుకు ముందుకొస్తున్నారు. దీనివల్ల అదనపు ఆదాయం వస్తోంది. క్లినికల్‌ ట్రయల్స్‌పై నివేదికలను పల్‌సస్‌ గ్రూపు కింద అధ్యయనం చేస్తున్నారు. దేశ విదేశాల్లో టర్నోవర్‌ రూ.వెయ్యి కోట్లకు చేరింది. చెన్నైలో పల్‌సస్‌ హెల్త్‌టెక్‌ను ఇటీవలే ప్రారంభించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని