నెట్టింట్లో...‘ప్రాణ’ మిత్రుడు

తనకోసం తాను ఆలోచించటం సహజం. ఇతరులకోసం ఆలోచించటానికి ఉదాత్తగుణముండాలి. ఈ కోవలోకి చెందిన కుర్రాడు కార్తీక్‌ నరాలశెట్టి. రక్తం ఇస్తే ఒకరి ప్రాణం నిలబడుతుంది. దాతల నుంచి రక్తం ఇప్పించగలిగితే ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయని నమ్మాడు. ఎందరి మధ్యో ‘రక్త’ సంబంధాలు ఏర్పరుస్తున్నాడు ఈ గుంటూరు జిల్లా వేటపాలెం యువకుడు. రెండుసార్లు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ సూపర్‌ 30 జాబితాలో అంకుర పారిశ్రామిక వేత్తగా అవతరించిన కార్తీక్‌ ఎందరికో ‘ప్రాణ’ మిత్రుడయ్యాడు...

Published : 17 Feb 2018 02:41 IST

నెట్టింట్లో...‘ప్రాణ’ మిత్రుడు

తనకోసం తాను ఆలోచించటం సహజం.
ఇతరులకోసం ఆలోచించటానికి ఉదాత్తగుణముండాలి.

ఈ కోవలోకి చెందిన కుర్రాడు కార్తీక్‌ నరాలశెట్టి. రక్తం ఇస్తే ఒకరి ప్రాణం నిలబడుతుంది. దాతల నుంచి రక్తం ఇప్పించగలిగితే ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయని నమ్మాడు. ఎందరి మధ్యో ‘రక్త’ సంబంధాలు ఏర్పరుస్తున్నాడు ఈ గుంటూరు జిల్లా వేటపాలెం యువకుడు. రెండుసార్లు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ సూపర్‌ 30 జాబితాలో అంకుర పారిశ్రామిక వేత్తగా అవతరించిన కార్తీక్‌ ఎందరికో ‘ప్రాణ’ మిత్రుడయ్యాడు.

ది 2011. బెంగళూరు. ‘మా అమ్మాయికి రక్తానికి సంబంధించిన జబ్బు ఉంది. నెలకు 30 మంది రక్తదాతలు కావాలి’ ఓ ఆంగ్ల దిన పత్రికలో వచ్చిన వార్త తన మనసును కుదిపేసింది. ఆలోచింపజేసింది. పది మంది స్నేహితులకు ఫోన్‌ చేశాడు. ఐదుగురు స్పందించారు. ఇంకా పాతికమంది రక్తదాతలు ఎక్కడ దొరుకుతారో తెలియలేదు. చాలా మధన పడ్డాడు. ఇలా ప్రతిరోజూ ఎంత మందికి... ఎన్ని చోట్ల... ఎంత రక్తం అవసరముందో? ఎన్ని ప్రాణాలు రక్తదాతల కోసం ఎదురుచూస్తున్నాయో? అనే ప్రశ్నలు మెదడును చుట్టుముట్టాయి. ప్రశ్నల నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయి. అప్పుడప్పుడే ఫేస్‌బుక్‌ ప్రాచుర్యం పొందుతోంది. ఫేస్‌బుక్‌ చూస్తుండగా మెరిసిందే ఈ పరిష్కారం. ఇందులో శోధించి రక్తదాతలను వెతకొచ్చు అనిపించింది. గ్రూపుల వారీగా ఏ, బీ, ఏబీ, ఓ బ్లడ్‌గ్రూపులతో ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచాడు. వందల సంఖ్యలో స్పందించారు. సభ్యులయ్యారు. ఆ పేజీల్లో రక్తం అవసరమని ఎవరైనా మెసేజ్‌ పెడితే ఎంతో మంది ముందుకొచ్చేవారు. ఇలా బెంగళూరులో అనేక మందికి రక్తం లభించడం సులువైంది.

ఆలోచన ఆకాశమంతైందిలా...
బెంగళూరు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రక్తం కోసం ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో వినతులు(రిక్వెస్ట్‌లు) వచ్చాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌.. లాంటి దేశాలనుంచీ అవే సంక్షిప్త సందేశాలు. దీంతో సమస్య బెంగళూరులోనే కాదు ప్రతిచోటా ఉందని తెలుసుకున్నాడు. ఈ లోపే అతని ఆలోచనకు గుర్తింపు వచ్చింది. ఓ అవార్డూ దక్కింది. ఈ ఆలోచనను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్లాడు కార్తీక్‌.. రక్తదాతలను ఒక వేదిక మీదికి తెచ్చే సంస్థను నెలకొల్పాలనే ఆశయాన్ని స్నేహితులకు వివరించాడు. వాళ్లు ప్రోత్సహించారు. అలా 2011లో ‘సోషల్‌ బ్లడ్‌.ఇంక్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను స్థాపించాడు.

మనసుంటే మార్గం..
తొలుత ‘సోషల్‌ బ్లడ్‌’ పేరుతో డెస్క్‌టాప్‌ యాప్‌ను క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత ఆసుపత్రుల వెంట తిరిగాడు. ‘ఎవరికైనా రక్తం కావాలంటే.. మా యాప్‌లో రిక్వెస్ట్‌ చేయవచ్చ’ని అడిగాడు. చాలా వరకు ఆసుపత్రుల్లో రక్తం వ్యాపారమయం కావటంతో వాళ్లు పెద్దగా స్పందించలేదు. కొందరైతే ఆలోచన బావుందని పిలిపించేవారు. ప్రజెంటేషన్‌ విన్నాక.. ‘చూద్దాం’ అని చెప్పేవారు. కొందరైతే సొంతంగా ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి ప్రయత్నించారు. కార్తీక్‌ పక్కనుండే డెవలపర్స్‌నూ ఆకర్షించారు. కార్తీక్‌ ఎక్కడా బెదరలేదు. ఎందరో మనసున్న వాళ్ల కదలికతో బెంగళూరుతో పాటు హైదరాబాద్‌, ముంబై ప్రాంతాల్లో ‘సోషల్‌బ్లడ్‌’ జనంలోకి వెళ్లింది. తర్వాత మొబైల్‌ యాప్‌ను క్రియేట్‌ చేశాడు. నగరాల్లో యాప్‌ త్వరగా సేవలందించింది. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో.. ఓ మూడేళ్ల చిన్నారికి నాలుగు బాటిళ్ల రక్తం అవసరమని వైద్యులు చెప్పారు. ఆ చిన్నారి నాన్న సోషల్‌ బ్లడ్‌ యాప్‌లో రక్తం కావాలని రిక్వెస్ట్‌ చేశాడు. గంటలోపే ఆ చిన్నారికి రక్తం అందింది. ‘నాలుగు బాటిళ్ల రక్తం సాయం చేయమని అడిగితే.. 150 మంది ఫోన్‌ చేసి రక్తం ఇస్తామన్నారు’ అంటూ ఉద్వేగంతో ఫోన్‌ చేసి కార్తీక్‌కు కృతజ్ఞతలు చెప్పాడా తండ్రి. ఇలాంటిదే మరో సంఘటన మర్చిపోలేనంటారు. ఓ బంగ్లాదేశీ తన భార్యకు ప్రసవ సమయంలో రక్తం అవసరమైంది. తన చిన్నఫోన్‌లో సోషల్‌ బ్లడ్‌ యాప్‌లో రిక్వెస్ట్‌ పంపాడంతే. పదుల సంఖ్యలో ఫోన్స్‌ వచ్చాయతనికి. తన భార్య, పండంటి బిడ్డను చూసుకుని మురిసిపోయాడట. ఎల్లలు లేని సేవంటే ఇదేనేమో!

అదే మమ్మల్ని నడిపించింది
2013లో సేకరించిన ఫండ్‌ అయిపోయింది. ఆ సమయంలో నా భార్య జీతంలోంచి డబ్బులు తీసుకుని డెవలపర్స్‌కి జీతం ఇచ్చాను. ‘‘కొందరు కాల్‌ చేసి ‘మీ వల్లే నా కూతురు బతికింది. మా నాన్నకు ప్రాణం పోశారు’ అంటూ చెబుతారు. అలాంటి మాటలు విన్నప్పుడు ఎన్ని కష్టాలున్నా.. యాప్‌ను ఆపెయ్యకూడదని అనిపించేది. రక్తగ్రహీతల ఆనందమే మమ్మల్ని నడిపించేది. నా ఆలోచన దాదాపు నెరవేరినట్లే. ఇప్పటికే మన దేశంలో ఫేస్‌బుక్‌ బ్లడ్‌ డొనేషన్‌ సేవలకు ఊపిరిపోసింది. త్వరలో బంగ్లాదేశ్‌లో ఈ ఆప్షన్‌ను ప్రారంభించబోతోంది. ఆ తర్వాత బ్రెజిల్‌.. ఇలా అన్ని దేశాలకూ వెళ్తుంది. ప్రస్తుతం మేం ట్విట్టర్‌తో మనదేశంతో పాటు బ్రెజిల్‌లో బ్లడ్‌ డొనేషన్‌ ఆప్షన్‌ను లాంచ్‌ చేయటానికి మాట్లాడుతున్నాం.. ‘సోషల్‌ బ్లడ్‌’ అనే నా ఆలోచన విశ్వవ్యాప్తం కావటం కంటే ఆనందమేముంటుందీ?’

- కార్తీక్‌ నరాలశెట్టి

ఫేస్‌బుక్‌ భాగస్వామ్యం
దీన్ని నిత్యం నడపాలంటే భవిష్యత్తులో నిధులు సరిపోకపోవచ్చు. డెవలపర్స్‌ ఇలాగే ఉంటారని నియమం లేదు. ఈ ఆలోచన రాగానే మళ్లీ పరిష్కారం కావాల్సి వచ్చింది. ఫేస్‌బుక్‌ ఒక్కటే శరణ్యమనిపించింది. ఈ పెద్ద ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటే ఎవరి అవసరం లేకుండా ఈ రక్త సేవ కొనసాగుతుందనిపించింది. ఈ ప్రయత్నంలో భాగంగా భారత్‌లో ఫేస్‌బుక్‌ను మరింత దూకుడుగా జనంలోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలో చెప్పమని ఆ సంస్థ వ్యవస్థాపకులు జుకర్‌బర్గ్‌ కార్తీక్‌కి ఫోన్‌ చేశారు. అరగంట మాట్లాడారు. ఆ తర్వాత 2015లో బార్సిలోనాలో జరిగిన వరల్డ్‌ మొబైల్‌ కాన్ఫరెన్స్‌కి ఆహ్వానించారు. అక్కడ జుకెన్‌బర్గ్‌తో పాటు ఆ సంస్థ సీనియర్లతో మాట్లాడే అవకాశం వచ్చింది. ‘బ్లడ్‌ డొనేషన్‌ ఆప్షన్‌ను భారత దేశానికి ఎప్పుడు తీసుకొస్తారు?’ అని వారిని ప్రశ్నించాడు. బ్లడ్‌ డొనేషన్‌కి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించాడు. ఆ తర్వాత మొత్తానికి 2017 సెప్టెంబర్‌లో ‘బ్లడ్‌ డొనేషన్‌’ ఆప్షన్‌ను ఫేస్‌బుక్‌ తీసుకొచ్చింది. బ్లడ్‌ కావాలన్నా, ఇవ్వాలనుకున్నా ఆండ్రాయిడ్‌ యాప్‌లో ఫేస్‌బుక్‌ వాడే యూజర్లు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ తోడ్పాడుతో సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

మూడు లక్షలమందికి..

 ఆండ్రాయిడ్‌ యూజర్లు socialblood ఆప్‌ని గూగుల్‌ ప్లే నుంచి డౌన్‌లోడ్‌ చేయాలి.  తెరవగానే లొకేషన్‌ డివైజ్‌ చెక్‌ చేసుకుంటుంది. ఆ తర్వాత ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అడుగుతుంది. ఫోన్‌ నంబర్‌ టైప్‌ చేశాక ఓటీపీ వస్తుంది. దాన్ని టైప్‌ చేస్తే సరి సోషల్‌బ్లడ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ పూర్తి అయినట్లే. యాప్‌ తెరవగానే కావాల్సిన బ్లడ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఎంటర్‌ లొకేషన్‌లో స్థలాన్ని టైప్‌ చేస్తే సరి.. ఆ ప్రదేశంలోని బ్లడ్‌ డోనర్ల నంబర్లు కనిపిస్తాయి. హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు, ముంబయి, చెన్నై..లాంటి నగరాల్లో ఈ యాప్‌లో రిజిస్టర్‌ అయిన వారి సంఖ్య ఎక్కువే. మీరూ సభ్యులై రక్తదాతలుగా మారొచ్చు. ఇప్పటివరకూ మన దేశంలో ఈ యాప్‌ ద్వారా మెట్రో నగరాల్లోనే మూడు లక్షల మంది రక్తగ్రహీతలున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని