ఒకటో నంబర్‌ కుర్రాడు

కంప్యూటరు ముందు కూర్చునే ఉద్యోగం...! అయిదంకెల వేతనం...! జీవితం సాఫీగా సాగిపోతోంది. అప్పుడు మొదలైంది ప్రశ్నల వర్షం. అతను తడిసి, కొత్తగా మొలకెత్తే దాక కురిసింది. ఇదేనా జీవితం..? ఏం చేస్తున్నాం.? అన్నదాత కష్టం తెలిసిన నేను... కర్షకులకు ఏం చేస్తున్నాను? ప్రశ్నలు.. ఎడతెగని ప్రశ్నలు. గమ్యం మార్చే ప్రశ్నలు. లక్ష్యం చేరే వరకూ విశ్రమించని ప్రశ్నలు... అన్ని ప్రశ్నలకు జవాబులు రాశాడు. తన రాతనే కాదు... ఎంతోమంది తలరాతను మార్చే శక్తిఉన్న ఉద్యోగం సంపాదించాడు ఆకుల వెంకటరమణ...

Published : 24 Feb 2018 01:40 IST

ఒకటో నంబర్‌ కుర్రాడు

కంప్యూటరు ముందు కూర్చునే ఉద్యోగం...! అయిదంకెల వేతనం...! జీవితం సాఫీగా సాగిపోతోంది. అప్పుడు మొదలైంది ప్రశ్నల వర్షం. అతను తడిసి, కొత్తగా మొలకెత్తే దాక కురిసింది.
ఇదేనా జీవితం..? ఏం చేస్తున్నాం.? అన్నదాత కష్టం తెలిసిన నేను... కర్షకులకు ఏం చేస్తున్నాను? ప్రశ్నలు.. ఎడతెగని ప్రశ్నలు. గమ్యం మార్చే ప్రశ్నలు. లక్ష్యం చేరే వరకూ విశ్రమించని ప్రశ్నలు...
అన్ని ప్రశ్నలకు జవాబులు రాశాడు. తన రాతనే కాదు... ఎంతోమంది తలరాతను మార్చే శక్తిఉన్న ఉద్యోగం సంపాదించాడు ఆకుల వెంకటరమణ.
ఎవరీ వెంకటరమణ... ఏమాయన ప్రస్థానం..?

డేళ్ల నిరీక్షణ. పదేళ్ల తపన. ఫలించిన వేళ గ్రూప్‌ -1లో ప్రథమర్యాంకు విజేత వెంకటరమణ ఆనందానికి అవధుల్లేవు. అమ్మానాన్నల కష్టాన్ని చూసి పెరిగిన కళ్లు వారిని తలచుకొని ఒక్కసారిగా చమర్చాయి. అన్నదాతలు ఎంతో మందికి సేవ చేసే భాగ్యం త్వరలోనే తనకు కలుగుతుందన్న సంతోషంతో వచ్చిన ఆనందభాష్పాలవి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వెంకటరమణ విజయం వెనుక... అమ్మానాన్నల ఆశయం, అన్నయ్య ఆశీర్వాదం ఉన్నాయి.

వారి ఆశయం బతికే ఉంది
పొద్దెక్కగానే పొలానికి వెళ్లాలి. లేకుంటే పూట గడవదు. సేద్యమే ఆ కుటుంబానికి జీవనాధారం. అప్పులు చేసి, ఆర్థిక కష్టాలను మింగి పిల్లలను పెద్దచేశారు. తమలా పిల్లలు కాకూడదని నలుగురు కుమారులను చదివించారు తల్లిదండ్రులు శ్రీరాములు, లక్ష్మీనరసమ్మ. జీవితాన్ని పొలానికి, పిల్లలకే ధారపోశారు. పిల్లలు చేతికందే సమయానికి ఇద్దరూ ఊపిరి విడిచారు. ఈ కష్టాలు వెంకటరమణను కదిలించాయి. ‘బాగా చదువుకోండి బిడ్డలారా... ఉన్నతస్థాయిలో ఉండాలి.’ అంటూ నాన్న చెప్పిన మాటలు తరచూ తట్టిలేపాయి. అందుకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడినా, దాన్ని విడిచి గ్రూప్స్‌పై దృష్టిపెట్టారు వెంకటరమణ. ప్రస్తుతం వారు లేకపోయినా... వారి ఆశయాన్ని బతికించాడు.

తొలి ప్రయత్నంలోనే తొలిర్యాంకు
ఆకుల వెంకటరమణ గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించారు. ఏపీపీస్సీ 2011 గ్రూప్‌-1 పరీక్షలో ఆయన అత్యధికంగా 489.5 మార్కులు సాధించారు. గ్రూప్స్‌ రాయడం ఆయనకు అదే తొలిసారి. మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. సివిల్స్‌లో రెండుసార్లు అవకాశం తప్పినా... ఈ విజయంతో కలెక్టరుగా అర్హత సాధించే వైపుగా అడుగులు పడ్డాయి.

ప్రభుత్వ బడిలోనే చదువు
మార్కాపురం సర్కారీ బడిలోనే ఓనమాలు దిద్దిన రమణ... మొదట సాధారణ విద్యార్థే. పదోతరగతి తరువాత చదువు విలువ తెలుసుకుని తీరు మార్చారు. పదిలో 68 శాతం మార్కులే. స్థానికంగా ఉన్న జార్జి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివారు. ఆ సమయంలో మొత్తం కరవు. ఏ పంట వేసినా నష్టాలే. ఇంటిల్లిపాది పొలంలో పనిచేసినా వచ్చేదేం లేదు. అప్పులు, ఆర్థిక బాధలు వెంటాడాయి. అప్పుడే బాగా చదువుకోవాలి, ఉద్యోగంలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఇంటర్‌లో 74 శాతం మార్కులు సాధించారు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో 1000 ర్యాంకు వచ్చింది. విజయవాడలోని కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఈ చదువు పూర్తికాకుండానే తండ్రి మరణించారు. పెద్దన్నయ్య తోడుతో చదువు పూర్తిచేసి వెంటనే ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొలువు దక్కించుకున్నాడు. ఉద్యోగమైతే దక్కింది. నెలనెలా వేతనం అందుతోంది. ఏదో అసంతృప్తి వెంటాడేది. జనజీవనంలో ఏదైనా మార్పు తేవాలంటే సర్కారీ కొలువుతోనే సాధ్యం. అందుకే 2009లో ఉద్యోగాన్ని వదిలేశాడు. గ్రూప్స్‌ కోసం శిక్షణ తీసుకున్నాడు. ఆదర్శనీయుల జీవిత చరిత్రలు చదివాడు. రాజ్యాంగాన్ని పూర్తిగా అవలోకనం చేశాడు.

సామాజిక బాధ్యత
గ్రూప్స్‌ రాశారు. ఫలితాలకు ఆలస్యమవుతోంది. ఉద్యోగం వస్తుందనే భరోసా ఉంది, కానీ ఫలితాలే రావడం లేదు. అందుకే 2011 నుంచి 2015 వరకు ఓ శిక్షణ సంస్థలో చేరారు. గ్రూప్స్‌ రాయబోయే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. మరోవైపు లా చదివారు. 2016లో ఎల్‌ఎల్‌బీ పట్టా తీసుకున్నారు. అన్నిటా పరిజ్ఞానం ఉండాలనే తపనతో చట్టాలను బాగా చదివారు. రాజ్యాంగం, చట్టాలు, వివిధ వ్యవసాయ పద్ధతులు, విద్యారంగంపై పరిజ్ఞానం సాధించారు. ఇదే క్రమంలో సామాజిక బాధ్యతగా హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లోని పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పేవాడు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆసక్తి ఉండడంతో 2016లో హైదరాబాద్‌లోని ఓ ఎన్‌జీవోలో సుస్థిర వ్యవసాయం- సహజ ఆహారం విభాగంలో ఉద్యోగంలో చేరారు. రైతులకు సహజసిద్ధ పంటలు పండించడం, లాభదాయక వ్యవసాయం చేసేలా సూచనలివ్వడం దీని ఉద్దేశాలు. ఇవి చేస్తూనే దూరవిద్య ద్వారా ఎంఏ ఎకనామిక్స్‌ చదువుతున్నారు.

అదే నా లక్ష్యం: రమణ
వ్యవసాయం, విద్యారంగాల్లో జనానికి ఉపయోగపడేలా విధుల్లో ఉండాలని నిశ్చయించుకున్నాను. అన్నిటా పరిజ్ఞానం అవసరమని ఓ వైపు బీటెక్‌ పూర్తిచేసినా... లా చదివాను. రైతులకు లాభదాయక వ్యవసాయం, పిల్లలకు మంచి చదువులు అందాలన్నదే లక్ష్యం. ప్రస్తుతం ఉప కలెక్టర్‌ హోదా వచ్చినా భవిష్యత్తులో కలెక్టరుగా అర్హత సాధించి, లక్ష్యాలను సాధిస్తాను.

- మానెం శ్రీనివాసరావు, ఈనాడు డిజిటల్‌- ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని