ముందు డిగ్రీ.. తర్వాత ఇంటర్‌..

కష్టాలు ఏం చేస్తాయి?మనిషిని రాటుదేలుస్తాయి నష్టాలు ఏం నేర్పుతాయి? నిలదొక్కుకోవాలనే తపన పెంచుతాయి అవకాశాలు ఏం ఇస్తాయి? ఒక్కోమెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని చేరుకోమంటాయి అలా రాటుదేలిన, నిలదొక్కుకున్న, లక్ష్యాన్ని చేరుకొన్న....

Published : 03 Mar 2018 01:42 IST

కష్టాలు ఏం చేస్తాయి?మనిషిని రాటుదేలుస్తాయి నష్టాలు ఏం నేర్పుతాయి? నిలదొక్కుకోవాలనే తపన పెంచుతాయి అవకాశాలు ఏం ఇస్తాయి? ఒక్కోమెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని చేరుకోమంటాయి అలా రాటుదేలిన, నిలదొక్కుకున్న, లక్ష్యాన్ని చేరుకొన్న వారే వీరిద్దరూ. గ్రూప్‌-2లో ప్రథమ స్థానం సాధించిన విజయ్‌కుమార్‌రెడ్డి, ఇదే పరీక్షలో ఉపతహసీల్దారు ఉద్యోగం పొందిన వెంకటసుబ్బారావులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచారు. విజయం వైపు సాగిన వీరి పయనం స్ఫూర్తిదాయకం.

ముందు డిగ్రీ.. తర్వాత ఇంటర్‌..

ఇప్పుడు గ్రూప్‌-2

* రోజూ 10 నుంచి 12 గంటలు చదివేవాణ్ని. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో ప్రణాళిక వేసుకున్నాను. 
* సమాచారం కోసం ఇంటర్నెట్‌ శోధన, కరెంట్‌ అఫైర్స్‌ ఫాలోకావడం బాగా కలిసొచ్చింది. 
* ఈనాడు పత్రికను క్షుణ్ణంగా చదివాను. ఇది ఎంతో ఉపకరించింది. స్నేహితుల సలహాలు పనికొచ్చాయి. స్థిర లక్ష్యం, సాధించాలనే తపన నన్ను నడిపించాయి.

తుకు చెప్పే పాఠాలు నేర్చుకొంటే... భవిత ఉజ్వలంగా ఉంటుంది. వెంకటసుబ్బారావు అందుకు నిదర్శనం. బత్తి చిన్నపాలంకయ్య, అంకమ్మల కుమారుడు వెంకటసుబ్బారావు. వీరిది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పొద్దకొలుకుల గ్రామం. మధ్యతరగతి కుటుంబం. సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే 2000 సంవత్సరంలో పదోతరగతి పూర్తిచేశాడు సుబ్బారావు. ఎలాగైనా తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనే ఆశయం నాన్నది. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేర్పించారు. మారుమూల గ్రామం నుంచి వెళ్లడంతో అక్కడి వాతావరణానికి భయపడి నెలరోజులకే ఇంటికి పారిపోయి వచ్చేశాడు. తల్లిదండ్రులు ఎంత బతిమాలినా, కళాశాలకు వెళ్లలేదు. చదువు మానేస్తానని, ఊళ్లోనే కూలీ పనులు చేసుకుంటానని ఉండిపోయాడు. అలా తొమ్మిదేళ్లు కూలీగానే ఉండిపోయాడు. పదేళ్లు బడిలో చదివిన పాఠాల కంటే... తొమ్మిదేళ్లలో జీవితం నేర్పిన గుణపాఠాలు ఎక్కువ మార్పును తీసుకొచ్చాయి.

బాధ్యతలే బాటలేశాయి
సొంత పొలం అయిదెకరాలు ఉండేది. పత్తి, మిరప, కంది వేసేవారు. కరవు కావడంతో వ్యవసాయంలో నష్టాలే. పొలాన్ని బీడుగా విడిచి కూలీ పనులకు వెళ్లారు. 2004లో అక్క సుబ్బలక్ష్మి భర్త మరణించారు. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. ఇద్దరూ పసివాళ్లే. అక్క, పిల్లలకు తోడుగా ఉండాల్సి వచ్చింది. మాచర్ల మండలం రచ్చమల్లపాడులో ఉంటూ వారి పొలం సాగుచేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకున్నాడు సుబ్బారావు. 2008లో పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన తర్వాత అక్క ఇంట్లో ఉండడం సబబు కాదని, ఏడాది తర్వాత సొంతూరు పెద్దకొలుకుల వచ్చేశాడు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించలేమని అర్థమవడానికి కరవు గురువైంది. ఆర్థికంగా కష్టాలు వెంటాడాయి. మార్పు మొదలైంది. చదువే ఈ కష్టాల నుంచి తనని బయటపడేస్తుందని భావించాడు. ఈ ఊరి నుంచి పాతికమంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. వారి నుంచి అందిన స్ఫూర్తి, భవిష్యత్తుపై భయం ఉండడంతో తనూ ఉపాధ్యాయుడు కావాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగిన కార్యాచరణ, ప్రణాళికలు సిద్ధంచేసుకున్నారు. బీఈడీ చదవాలంటే డిగ్రీ అర్హత కావడంతో అదే ఏడాది దూరవిద్యలో డిగ్రీలో చేరారు. కూలీ పనులకు వెళ్తూ చదువుకొని పరీక్షలు రాశారు. డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా ఒక పాప(సంజన) పుట్టింది. కుటుంబ బాధ్యతలు చూస్తూనే 2012లో 60శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేశారు. వెంటనే బీఈడీ ప్రవేశపరీక్ష రాస్తే 105వ ర్యాంకు వచ్చింది. అప్పుడే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులన్నీ టీటీసీ చదివిన వారికి కేటాయిస్తూ నిర్ణయం వచ్చింది. దీంతో బీఈడీ చదవాలనే ప్రయత్నం విరమించుకుని గ్రూప్స్‌ సాధించాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఇంటర్మీడియట్‌ తప్పనిసరిగా ఉండాలని 2013లో వన్‌ సిట్టింగ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసి 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.

ఒకేసారి రెండు కొలువులు 
ఇంటర్మీడియట్‌ అవ్వగానే ప్రభుత్వం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు భర్తీచేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో కుటుంబాన్ని వదిలి హైదరాబాద్‌ వెళ్లి మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్నారు. ఓ వైపు వీఆర్‌వో, మరోవైను పంచాయతీ కార్యదర్శి రెండు పరీక్షలు రాశారు. రెండింటిలోనూ విజేతగా నిలిచారు. ఒకేసారి రెండు కొలువులు వరించాయి. సన్నిహితుల సూచనతో వీఆర్వో ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగం వచ్చిన కొన్నిరోజులకు బాబు(భానుమనీష్‌) పుట్టాడు. 2016లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇక లక్ష్యం ఇదే. ఉద్యోగానికి సెలవుపెట్టి, కుటుంబాన్ని కొన్నాళ్లు దూరంగా పెట్టి తను హైదరాబాద్‌ వెళ్లిపోయారు. స్నేహితులతో కలిసి ఏడాదిపాటు సొంతంగా సాధన చేశారు. పత్రికలు, సమకాలీన అంశాలు, అంతర్జాలంలో అంశాలను మేళవించుకుని మిత్రులతో చర్చించడం ద్వారా పరీక్షలో విజయం సాధించారు. 332 మార్కులతో ఉపతహసీల్దారుగా ఎంపికయ్యారు.


కుటుంబమే అండ

హైదరాబాద్‌లో ఏడాది శిక్షణలో ఉంటే మరి కుటుంబానికి దిక్కెవరు? ఇంటిని పోషించడానికి, తన చదువుకి డబ్బు అవసరం తప్పనిసరి. అప్పుడే అమ్మానాన్నలు, స్నేహితులు అండగా నిలిచారు. పొలం పనులు, కూలీపనులు చేస్తూ డబ్బులు పంపించేవారు. పిల్లల బాధ్యతంతా నా భార్య వీరనారాయణమ్మ చూసుకునేది. నా విజయంలో కీలక పాత్ర నా జీవిత భాగస్వామిదే. కరెంటు అఫైర్స్‌ కోసం పూర్తిగా ‘ఈనాడు’పైనే ఆధారపడ్డాను. ‘ఈనాడు’లో వచ్చిన కరెంటు అఫైర్స్‌లో 80శాతం ప్రశ్నలు పరీక్షల్లో వచ్చాయి. రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే నాలక్ష్యం. 

- వెంకట సుబ్బారావు

విజయ్‌ ప్రస్థానం

* సమాచార సేకరణకు ఎక్కువగా నెట్‌పై ఆధారపడ్డాను. ఎకనమిక్‌సర్వేను అధ్యయనం చేయడం ఎంతో ఉపకరించింది.
* కరెంట్‌అఫైర్స్‌ బుక్స్‌, యోజన ఉపయోగపడ్డాయి.
* నిరంతరం చదవడం... చదివిన వాటిని రాయడం ద్వారా గుర్తుంచుకోవడం సులువైంది. చదివిన వాటి గురించి చర్చించడం మంచి ఫలితాన్నిచ్చింది.

అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూనే దశలవారీగా లక్ష్యాలు సాధించడం విజేతల లక్షణం. చింతలపూడి విజయ్‌కుమార్‌రెడ్డి అలాంటి విజేతే. 2016 గ్రూప్‌-2 పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించి ఉపతహసీల్దారు పోస్టుకు అర్హత సాధించారు. ఇదే పరీక్షలో ఈయన భార్య గీతాకుమారీ మంచి మార్కులతో ఉప తహసీల్దారుగా అర్హత సాధించారు. భార్యభర్తలిద్దరూ రెండుసార్లు గ్రూప్‌-2 పరీక్షలు రాసి విజేతలుగా నిలవడం వారి ప్రతిభకు నిదర్శనం. వీరితో పాటు విజయ్‌కుమార్‌రెడ్డి తమ్ముడూ ఇదే పరీక్షలో ఉద్యోగం పొందడం మరో విశేషం. దీంతో ఈ కుటుంబం స్థానికంగా గ్రూప్‌-2 కుటుంబమైపోయింది. ఇంతటి విజయాలు సులువుగా దక్కలేదు. కళ్లెదుటే భూములున్నా సాగు సాధ్యం కాక... తరచూ వ్యాపారంలో నష్టాలతో నాన్న నిరుత్సాహంగా ఉండేవారు. అయినా విజయ్‌కుమార్‌ వెనుకడుగు వేయలేదు. ఎప్పటికప్పుడు తనని తాను మలుచుకుంటూ విజేతగా నిలిచారు. భార్య, తమ్ముడినీ అదే బాట పట్టించారు.

ఆది నుంచి కష్టాలే
ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనకబడిన ప్రాంతం, కరవు నేలలున్న పెద్దారవీడు మండలంలోని కంభంపాడు విజయ్‌కుమార్‌ స్వగ్రామం. అక్కడే అయిదో తరగతి వరకు ప్రాథమిక బడిలో చదివారు. ఈ ప్రాంతంలో భూములున్నా విలువ ఉండదు. సేద్యం సాధ్యం కాదు.  విజయ్‌ తండ్రి సుబ్బారెడ్డి పంటలు పండక, తరచూ పొలం అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. సేద్యాన్ని, సొంతూరుని విడిచిపెట్టి 1994లో వారి కుటుంబమంతా మార్కాపురం పట్టణానికి వలస వచ్చేశారు. అప్పుడే బొగ్గుబట్టీల వ్యాపారం మొదలుపెట్టారు. ఏ వ్యాపారమూ స్థిరంగా సాగలేదు. ఇలా వివిధ వ్యాపారాలు చేసినా తరచూ నష్టాలు వచ్చేవి. వారు పస్తులుండైనా పిల్లలను చదివించారు. అలా విజయ్‌ పదోతరగతి పూర్తిచేశారు. 61 శాతం సగటు మార్కులతో.

నష్టాలు మలిచిన శిల్పం
విజయ్‌ చిన్ననాటికి ఈ కుటుంబానికి నలభై ఎకరాల పొలం ఉండేది. పదోతరగతి పూర్తయ్యే సరికి మూడెకరాలే మిగిలింది. ఓ వైపు పొలం పోతుంది. వ్యాపారంలో లాభాలు లేవు. ఏం చేసినా నష్టాలే. తండ్రి సుబ్బారెడ్డిది సూటిగా వెళ్లే వ్యక్తిత్వం. సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి.  నెల్లూరులోని వీఆర్‌ కళాశాలలో బీఏ చదివారు. ఆ సమయంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ నాయకుడు. అత్యయికస్థితిలో అరెస్టయ్యారు. దీంతో చదువు ఆపేసి సొంతూరుకి వచ్చేసి వ్యవసాయం, వ్యాపారంపై దృష్టిపెట్టారు. తను నష్టపోయినా ఎదుటి వాళ్లకు అన్యాయం జరగకూడదు అనుకునే తత్వం. వ్యాపారాలు ఏవీ సక్రమంగా సాగలేదు. ‘వ్యాపారం చేసుకోండి, చదువులతో లాభం లేదు. మనకు ఉద్యోగాలు రావు’ అంటూ బిడ్డలకు చెప్పేవారు.  కానీ నాన్న కష్టనష్టాలు కళ్లారా చూసిన విజయ్‌ ఉద్యోగాన్ని సాధించి కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నారు. ఇంటర్మీడియట్‌ సమయంలో పెదనాన్న ప్రోత్సాహంతో ఆర్థిక అవసరాలు తీర్చుకుని కళాశాల విద్యలోకి అడుగుపెట్టారు. పెదనాన్న అల్లూరిరెడ్డి కానిస్టేబుల్‌. విజయ్‌కు ఈ విషయంలో అండగా నిలిచారు. వెన్నుతట్టారు. 

విజయానికి తొలి అడుగు 
మార్కాపురంలోని సాధన కళాశాలలో విజయ్‌ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత బీఈడీ. 2006 డీఎస్సీలో 94.5 మార్కులతో ఉపాధ్యాయ ఉద్యోగం పొందారు. పట్టణానికి దగ్గరలోని రాయవరంలో 2007 వరకు పనిచేశారు. 2008లో గ్రూప్‌-2 రాశారు. రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించి, విశాఖపట్నంలో కార్మికశాఖ అసిస్టెంట్‌ అధికారిగా ఉద్యోగంలో చేరారు. ఇలా తొలిరెండు ప్రయత్నాల్లోనే రెండు ఉద్యోగాలు సాధించారు. 2011లో గ్రూప్‌-1 రాశారు. తొలిపరీక్షలో అర్హత సాధించినా, కోర్టు వివాదాలతో రెండో పరీక్షకు దూరమయ్యారు. దీంతో 2016 గ్రూప్‌-2పై దృష్టిపెట్టారు. ఈ పరీక్షకు భార్య గీతాకుమారితో కలిసి సాధన చేశారు. ఇద్దరూ కలిసి చదువుకుని, ఆలోచనలు పంచుకుని, పుస్తకాలు సొంతంగా సిద్ధంచేసుకుని ఆరునెలలు శ్రమించారు. విజయ్‌కుమార్‌ 357.35 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించారు. సొంతజిల్లాలో ఉపతహసీల్దారుగా ఉద్యోగం సాధించాలనే తపన తీరింది. భార్య గీత కూడా 310 మార్కులు సాధించి ఉపతహసీల్దారుగానే ఉద్యోగ అర్హత పొందారు. విజయ్‌ తమ్ముడు అశోక్‌కుమార్‌రెడ్డి 2016 గ్రూప్‌-2 పరీక్షలో 332 మార్కులు సాధించి ఉప తహసీల్దారుగా అర్హత పొందారు. ఇలా ఒకే కుటుంబంలోని ముగ్గురు విజేతలయ్యారు. 


చిన్న చిన్న లక్ష్యాలు

ఒకేసారి ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంటే సాధించే అవకాశం ఉండకపోవచ్చు. దశల వారీగా లక్ష్యాలను మార్చుకోవాలి. నాన్న పడిన కష్టం, నాన్న నమ్మిన సిద్ధాంతాలు నన్ను బాగా ఆలోచింపజేశాయి. ఆయన నుంచి నేర్చుకున్న పాఠం, పెదనాన్న అందించిన ప్రోత్సాహంతో రాణించగలిగాను. గ్రూప్‌-2లో విజేతలుగా నిలవాలంటే పట్టుదల, సాధన ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన యోజన, కురుక్షేత్ర వంటి పుస్తకాలతో పాటు, అంతర్జాలం, పత్రికల్లోని వార్తాంశాలు, సమకాలీన అంశాలు బాగా అవగాహన చేసుకోవాలి. సబ్జెక్టుపై తరచూ భార్య, తమ్ముడు, స్నేహితులతోనే చర్చించడం ద్వారా పరీక్షకు సన్నద్ధమయ్యాం.

- మంచిది విజయ్‌కుమార్‌

- మానెం శ్రీనివాసరావు, ఈనాడు డిజిటల్‌, ఒంగోలు,
- మందుల వెంకటనాయుడు, న్యూస్‌టుడే, యర్రగొండపాలెం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని