కాల్పనిక ‘కథా’నాయకుడు

అమెరికాలో చదువు ఉపాధిని ఇవ్వనప్పుడు.. అక్కడ బతకాలంటే పెళ్లి ఒక......

Published : 24 Mar 2018 01:27 IST

కాల్పనిక ‘కథా’నాయకుడు

అమెరికాలో చదువు ఉపాధిని ఇవ్వనప్పుడు.. అక్కడ బతకాలంటే పెళ్లి ఒక ఆసరా. 30ఏళ్లు నిండని ఒక భారతీయ విద్యార్థి ఈ బాట పడతాడు. అప్పటికే పెళ్లై, భర్తతో విడిపోయిన, ఒక బిడ్డకు తల్లి అయిన అమెరికా గ్రీన్‌కార్డు నల్లజాతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. బతుకు భద్రం అని భావిస్తాడు. ఉత్తుత్తి పెళ్లి చేసుకుని ఎంబసీలో దొరికిపోతాడు. అప్పుడు ఆ జంట మానసిక స్థితి ఎలా ఉంటుంది?
దీనిపై ఓ రచన చేస్తే...!
స్థానిక నల్లజాతి అమ్మాయితో కుదుర్చుకున్న ఒక ఒప్పంద వివాహం ‘ఆన్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌’. కాగితాల మీదనే భర్తగా ఆమెకు నెలకు ఇంత చెల్లించే ముందస్తు ఒప్పందం ఇదన్నమాట. ఇందులోని మానసిక సంఘర్షణ ఒక వైపు, పెళ్లి అంటే ఒక బంధం అని నమ్మిన కుటుంబాల కథ మరోవైపు....
దీన్ని అక్షరబద్ధం చేస్తే...!
లా వర్తమాన సమాజంలోని మనుషుల మనసుల్లోని సంక్లిష్టతను అక్షరీకరించి, అమెరికా విశ్వవిద్యాలయాలను మెప్పించాడు మన ఖమ్మం కుర్రాడు నిశాంత్‌. సైడ్‌ ఎఫెక్ట్స్‌, లైఫ్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌, టౌన్‌ఆఫ్‌ది డెడ్‌, హైవే, పైలెట్‌, సుమ్మేర్స్‌ ఆఫ్‌ పెయింటింగ్స్‌, ఆన్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌, లుక్‌ఇన్‌సైడ్‌ లాంటి 8 కథలు రాశాడు. వీటిని ప్రచురించడానికి అక్కడి మూడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. అంతేకాదు... మిషిగన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించే ‘హెలెన్‌జిల్‌’ అనే శిక్షణకు ఎంపికై చరిత్ర సృష్టించాడు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో జన్మించిన నిశాంత్‌ తండ్రి ఐవీ రమణారావు ఆంగ్ల అధ్యాపకులు. తల్లి లక్ష్మి వైద్యురాలు. అమెరికాలోని యూ-పెన్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత చికాగోలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ట్రిబ్యూన్‌లో డిజిటల్‌ పైపర్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. అలా అమెరికాలో స్థిరపడిన నిశాంత్‌ భిన్నమైన బాటను ఎంచుకున్నాడు. తన చుట్టూ ఉన్న మానసిక ఉక్కపోత నుంచి ఉపశమనం పొందటం కోసం రచనను ఒక వ్యాపకంగా మార్చుకున్నాడు. ఆ వ్యాపకమే కోటి రూపాయల ఉపకారం వేతనం పొందేలా చేసింది.
నిరంతర తపన
8వ తరగతిలోనే కథలు రాయటం మొదలు పెట్టాడు. అమెరికాలో రాత్రి విధులు ముగించుకొని స్టూడియో చికాగో పేరిట సాగే రచయితల సమావేశాలకు, సాహిత్య సభలకు వీలైనన్ని ఎక్కువ సార్లు హాజరయ్యేవాడు. ఈ క్రమంలోనే ప్రముఖ సాహిత్య పత్రిక టిన్‌ హౌస్‌ వారి వేసవి శిక్షణ తరగతులకు, లైట్‌హౌస్‌ రచయితల కార్యశాలకు వెళ్లాడు. స్టాన్‌ఫర్డ్‌లో ఆన్‌లైన్‌ రైటర్స్‌ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకున్నాడు. ఈ నిరంతర కృషి అతన్ని విజయం వైపు నడిపింది.

సాహిత్యంలో..
వృత్తి రీత్యా తన నైపుణ్యం ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఉన్నా ప్రవృత్తి రీత్యా తాను అభిమానించే కాల్పనిక సాహిత్యం(క్రియేటివ్‌ ఫిక్షన్‌) వైపు అడుగులు వేశాడు.
12 మందిలో ఒకరు
అమెరికాలో సృజనాత్మక రచనలను చేసే వారి నైపుణ్యాలను సానబెట్టేందుకు మూడేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(ఎం.ఎఫ్‌.ఏ) కోర్సు ఉంది. అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ ఇస్తారు. ఇందులో చాలా ముఖ్యమైనది ‘హెలెన్‌ జిల్‌’ రైటర్స్‌ ప్రోగ్రాం. ఇది ఆన్‌ ఆర్బర్‌లో ఉన్న మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో ఉంది. ఇందులో 12సీట్ల కోసం వందల మంది పోటీ పడతారు. 2018లో ప్రవేశాలకు గానూ 1800 పైగా దరఖాస్తులు వచ్చాయి. మూడేళ్ల కోర్సు కాలంలో మొదటి రెండేళ్లకు గానూ విశ్వవిద్యాలయం వారు ఫెలోషిప్‌ కింద లక్షా 66వేల డాలర్లు ఇస్తారు. ఈ ఫెలోషిప్‌ ఈ ప్రోగ్రాంకు ప్రత్యేక ఆకర్షణ. అంతే కాక జ్ఞాన్‌పీఠ్‌తో పోల్చదగిన పులిట్జర్‌ అవార్డు గ్రహీతలు ఇక్కడ ఆచార్యులుగా పనిచేయటం విశేషం. ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుత సంవత్సరం ఎంపిక చేసిన 12మంది రచయితల్లో నిశాంత్‌ ఒకడయ్యాడు.


విలక్షణత... భావోద్వేగాలు

నా చుట్టూ ఉన్న విలక్షణమైన జీవితాలు, భావోద్వేగాలు సృజనాత్మక వ్యాసంగంవైపు నన్ను మళ్లించాయి. అరుంధతీరాయ్‌, జుంపాలహరి, గ్రేస్‌ పాలేని వంటి వారి రచనలు నాకిష్టం. డానియల్‌ ఇవాన్‌, జుడిత్‌ మిచెల్‌ లాంటి అధ్యాపకుల సహచర్యం నా రాతకు పదును పెట్టాయి. మానవ జీవితంలోని ఉద్వేగాలపై ఒక గ్రహాంతర వాసికి ఉన్నంత కుతూహలం నాకుంది. ప్రకృతిపై హిమాలయాలంత ప్రేమ ఉంది. ఈ రెండు ఆసక్తులే నన్ను కాల్పనిక సాహిత్యంవైపు నడిపిస్తున్నాయి.

- ఇంజం నిశాంత్‌
- షేక్‌ లాలా, న్యూస్‌టుడే, ఖమ్మం విద్యావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని