కలల్ని ఎగరేశాడు

కొన్ని లక్ష్యాలు... అలవాట్లూ మనిషి జీవితంలోకి ఏదో ఒక దశలో.......

Published : 31 Mar 2018 01:46 IST

వెరైటీ
కలల్ని ఎగరేశాడు

 చిన్నప్పుడు ఎప్పుడో సంతలో... అమ్మ కొనివ్వని ఎగిరే బొమ్మ... ఖరీదు ఎంతో తెలుసా? రూ.30
ఆ బాలుడి తెలివికి సవాల్‌ విసిరింది...
అదే చిట్టి బుర్రలో గొప్ప ఆవిష్కరణగా మిగిలిపోయింది... ఇప్పుడు అతని వయసు ముప్పైల్లోకి వచ్చింది...ఆవిష్కరణకీ ఊపిరొచ్చింది... ఇప్పుడతని కలలు ‘రోబోటిక్‌ పక్షుల్లా’ ఎగురుతున్నాయి.
కొన్ని లక్ష్యాలు... అలవాట్లూ మనిషి జీవితంలోకి ఏదో ఒక దశలో ప్రవేశిస్తాయి. విజయ్‌కుమార్‌ జీవితంలోకీ అంతే. చిన్నతనంలో హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో కొనుక్కుందామనుకున్న రబ్బర్‌ బ్యాండ్‌తో ఎగిరేబొమ్మ అతని ఆలోచనా విధానాన్ని మార్చేసింది. సోదరి ప్రీతి, స్కూల్‌ టీచర్ల ప్రోత్సాహంతో రబ్బర్‌ బ్యాండ్‌తో ఎగిరే విమానాలు తయారు చేశారు. ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేయాలని విజయ్‌ లక్ష్యంగా చేసుకున్నాడు. తండ్రి అనారోగ్యం.. కన్న కలని అప్పుడే కాకి ఎత్తుకెళ్లిపోయింది. బీకామ్‌లో చేరాడు. ఆలోచనలు మాత్రం రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి ఎగరాలనే చూశాయి. దీంతో ఇంటర్నెట్‌నే  ఆసరాగా చేసుకుని యూట్యూబ్‌ ట్యుటోరియల్స్‌తో తన టెక్నాలజీ స్కిల్స్‌ని ట్యూన్‌ చేసుకున్నాడు. ఏళ్ల పాటు  చేసిన ప్రయోగాలు రిమోట్‌ సాయంతో ఎగిరే ‘రోబర్డ్‌’ పక్షికి (ప్లాపింగ్‌ బోర్డ్స్‌) రూపాన్నిచ్చాయి. బ్యాటరీ  సాయంతో  ఈ రోబో పక్షుల్ని తయారు చేస్తోంది విజయ్‌ ఒక్కడే.

ప్రాజెక్టుల్లో ఆసరా అయ్యాడు

 నాలుగేళ్లుగా వేల మంది విద్యార్థులకు తన టెక్నాలజీ స్కిల్స్‌తో సాయం చేస్తున్నాడు. క్యాంపస్‌ ప్రాజెక్టుల్ని ప్రోత్సహిస్తూ... అంకుర ఆలోచనలకు మెంటర్‌గా వ్యవహరిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. సుమారు 25 కాలేజీల్లో 6,000 మందికి పైనే విద్యార్థులకు ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్లైయింగ్‌పై వర్క్‌షాప్‌లతో అవగాహన కల్పించాడు. 25  ఎయిర్‌షోల్లో భాగస్వామిగా రోబోర్డ్‌లను ఎగరేశాడు. నగరంలో 10 రోబర్డ్‌ ఫ్లయింగ్‌ షోలు చేశాడు.

- వసంత్‌, ఫొటోగ్రాఫర్‌

నెట్టిల్లే వేదిక

డిగ్రీ పూర్తయ్యే సమయానికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో శోధించి టెక్నాలజీ  మెలకువలు తెలుసుకున్నా. యూట్యూబ్‌ వీడియోలేనాకు పాఠాలు. 2010లో చిన్న  ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎగరేయగలిగా. ఆన్‌లైన్‌తో నా ప్రయోగాలు తేలికయ్యాయి. ఒక రోబర్డ్‌  తయారీకి రూ.10 వేలు ఖర్చు అవుతుంది. వారంలో అన్ని హంగులతో బర్డ్‌ని రూపొందిస్తా.

 - విజయ్‌ కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని