చదువుకు ‘శ్రేయ’స్సు

మానవశక్తి మేధోశక్తిగా మారి ప్రపంచం అభివృద్ధి దిశగా దూసుకుపోవాలంటే సైన్స్‌ సాయం ఉండాల్సిందే! అందుకే సైన్స్‌, గణితం పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచేందుకు ‘కేర్‌’ సంస్థను ప్రారంభించి ఐదువందలమంది

Published : 07 Apr 2018 01:23 IST

‘కేర్‌’టేకర్‌
చదువుకు ‘శ్రేయ’స్సు

మానవశక్తి మేధోశక్తిగా మారి ప్రపంచం అభివృద్ధి దిశగా దూసుకుపోవాలంటే సైన్స్‌ సాయం ఉండాల్సిందే! అందుకే సైన్స్‌, గణితం పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచేందుకు ‘కేర్‌’ సంస్థను ప్రారంభించి ఐదువందలమంది కార్యకర్తలతో ఆఫ్రికా సహా అనేక దేశాల్లో సేవలందిస్తోంది శ్రేయ అట్లూరి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఆమెకు అండగా నిలిచాయి...

సాంకేతికరంగంలో శరవేగంతో దూసుకుపోయే దేశాల పేర్లు చెప్పమంటే మనకి ముందుగా గుర్తొచ్చేది జపాన్‌. నాలుగేళ్ల క్రితం జపాన్‌లో ‘స్టెమ్‌ అండ్‌ గ్లోబల్‌ పాలసీ’ అనే అంశంపై ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ని కలిపి సంక్షిప్తంగా ‘స్టెమ్‌’ అంటారు. సైన్స్‌ పరిశోధలని ప్రోత్సహించే దిశగా జపాన్‌లో జరిగిన ఈ సమావేశానికి అమెరికా నుంచి ఆరుగురు ఎంపికైతే అందులో ఒకరు పదహారేళ్ల తెలుగమ్మాయి శ్రేయ. అప్పటికే సైన్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారికిచ్చే తొషిబా నాయకత్వ అవార్డుని గెల్చుకుందీ అమ్మాయి. మరో ఏడాదికే అమెరికాలో వైట్‌హౌస్‌లో జరిగిన సైన్స్‌ఫెయిర్‌కి ఆమె అతిథిగా హాజరయ్యి బరాక్‌ఒబామా, అమెరికా చీఫ్‌టెక్నాలజీ ఆఫీసర్‌ మెగాన్‌స్మిత్‌ వంటి వాళ్ల ప్రసంశలు అందుకుంది. వాస్తవానికి శ్రేయ లక్ష్యం సైన్స్‌ని ప్రోత్సహించడం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన చదువుకు దూరమైన చిన్నారులను వెన్నుతట్టి ప్రోత్సహించడం, వారికి అండగా ఉండటం కూడా. ఆ లక్ష్యంతోనే కేర్‌ సంస్థను స్థాపించింది.

కేర్‌ని అలా స్థాపించా...
‘అమెరికా రంగుల ప్రపంచమే కావొచ్చు. అక్కడా సమస్యలుంటాయి.. ఇబ్బందులుంటాయి. అవే నన్ను కేర్‌(క్రియేటింగ్‌ అవేర్‌నెస్‌ ఇన్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌) సంస్థను స్థాపించేలా చేశాయి. నాన్న ఉద్యోగరీత్యా నాకు రెండేళ్ల వయసులోనే మన దేశం వదిలి... అమెరికా వెళ్లిపోయా. పెరిగిందంతా వాషింగ్టన్‌ డీసీలోనే. నేను, అక్క చిన్నప్పుడు స్కూల్‌కి కారులోనే వెళ్లేవాళ్లం.  అక్కడున్న చాలా మంది పిల్లలు శీతాకాలం ఎముకలు కొరికే చలిలో స్కూల్‌ బస్సుకోసం వణుకుతూ ఎదురుచూసేవారు. మనకిక్కడ మేనెల ఎండాకాలంలో చెప్పుల్లేకుండా నడవడం ఎంత కష్టమో.. వాళ్లకు ఇలా చలిలో బడికి వెళ్లడమూ అంతే. మొదటిసారి అలాంటి పిల్లలకోసం నేను దాచుకున్న డబ్బుతో జాకెట్‌ డ్రైవ్‌(చలికి తట్టుకునే జాకెట్లు)చేశా. అమెరికాలో ‘సమాజానికి తిరిగి ఇవ్వడం’ అనే అలవాటుని తప్పనిసరిగా బాల్యం నుంచే నేర్పిస్తారు. అదే అలవాటు నాకూ వచ్చింది. ట్యూషన్లు చెప్పడం, హంగర్‌ డ్రైవ్స్‌(ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం)ని అభిరుచిగా మార్చుకున్నాను. నిధులు సేకరించి సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను ఎందుకు నిర్వహించకూడదనే ఆలోచనతో కేర్‌ని 2012లో ప్రారంభించాను.

చదువు.. నాయకత్వ లక్షణాల్లో..
ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది దరఖాస్తున్న ప్రతిష్ఠాత్మక రాబర్ట్‌సన్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికై ఒకేసారి రెండు యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశాన్ని చేజిక్కించుకుంది శ్రేయ. ఈ కార్యక్రమం లక్ష్యం.. చదవడం, నాయకత్వ లక్షణాల్లో ముందుండేలా చూడ్డం. చదువుకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించడం. అలా డ్యూక్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌కెరోలినాలో చదువుకునే అవకాశం వచ్చింది. ఆయా విశ్వవిద్యాలయాల్లో ఎకనామిక్స్‌, బిజినెస్‌ డిగ్రీలు చేస్తూనే.. మరోపక్క కేర్‌ మీద దృష్టిపెట్టింది. తొషిబా, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు శ్రేయ సేవలకు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం అందిస్తున్నాయి. దాంతో కేర్‌ ఇండియా, ఆఫ్రికా, అమెరికా, లుథియానా, న్యూఆర్లీన్స్‌ వంటి ప్రాంతాల్లో వేగంగా విస్తరించింది. ‘మొత్తం పనులు నేనే చూసుకోవాలి అంటే కష్టమవుతుంది. అందుకే సేవచేయాలనే ఆసక్తి ఉన్న నాలాంటి యువతరానికి ఈ బాధ్యతలు అప్పగించాను. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉపకారవేతనాలు అందించడం, పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు, నైపుణ్యాలు అందించడం ప్రధానంగా కేర్‌ చేస్తున్న పనులు. ఇంతవరకూ ఆరువేలమందికి ఉపకారవేతనాలు అందించాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ట్యూషన్‌ ఫీజులు అందిస్తున్నాం. ఎన్నాళ్లు ఈ ఉపకారవేతనం అందిస్తాం అనేది... పిల్లల మార్కులు(పెర్‌ఫార్మెన్స్‌పై) ఆధారపడి ఉంటుంది. గన్నవరం, ఖమ్మం, వైరా, పోరంకి... పెనమలూరు మండలాల్లో ప్రస్తుతం మా సేవలు అందుతున్నాయి’ అంటూ కేర్‌ కార్యక్రమాలని వివరించింది శ్రేయ.

సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు కిట్లు...
మనదేశంలో కొంతవరకూ ఫర్వాలేదు... ఐరోపా దేశాల్లో ఆడపిల్లలు సైన్స్‌,. సాంకేతిక రంగాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. అటువంటి వారి కోసం ప్రత్యేకించి ‘స్టెమ్‌’ టూల్‌కిట్‌లను తయారుచేస్తోంది శ్రేయ. వీటి ద్వారా తేలిగ్గా సైన్స్‌ ప్రయోగాలు చేసి చూపిస్తూ పిల్లల్లో సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచొచ్చు. ఇందుకు కావాల్సిన సాయాన్ని గూగుల్‌ అందిస్తోంది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా గోల్డ్‌మెన్‌సాక్స్‌ బ్యాంకులో పనిచేసే అవకాశాన్ని చేజిక్కించుకున్న శ్రేయ ప్రస్తుతం ‘గ్లోబ’ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ బిజినెస్‌ వ్యవహారాలను అధ్యయనం చేస్తోంది.

- శ్రీసత్యవాణి గొర్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని