ఎగువమత్యం నుంచి ఎగసిన ముత్యం

రమేష్‌...శభాష్‌ బిహార్‌ రాష్ట్రం. పట్నా జిల్లా మానేర్‌ మండలం. రోజు ఉదయాన్నే ఆడ, మగ తేడా లేకుండా అందరూ చెంబులు చేత పట్టుకుని బహిరంగ విసర్జనకు వెళ్తున్నారు.....

Published : 21 Apr 2018 01:40 IST

  రమేష్‌...శభాష్‌

ఎగువమత్యం నుంచి ఎగసిన ముత్యం

బిహార్‌ రాష్ట్రం.
పట్నా జిల్లా మానేర్‌ మండలం.
రోజు ఉదయాన్నే ఆడ, మగ తేడా లేకుండా అందరూ చెంబులు చేత పట్టుకుని బహిరంగ విసర్జనకు వెళ్తున్నారు.
వారిని చూసీచూడగానే విజిల్స్‌ గట్టిగా పడతాయి.
అక్కడున్న వారు పొదల్లో నుంచి పారిపోయేదాక...!

ఆ గ్రామాల్లో చెంబు చేతపటుకొని ప్రదర్శనకు వెళ్తున్నట్లు బయలుదేరతారు అందరూ.
వారు కన్పించగానే వారిలో వాడిపోయిన పూల మాలలు పడతాయి. వారు ‘బయటికి’వెళ్లే ప్రక్రియ ఆగేదాకా..!

పరిశుభ్రతపై అసలు అవగాహన లేని గ్రామాల్లో ఇలా బహిరంగ మలవిసర్జనపై ఒక పెద్ద పోరాటమే జరిగింది. వారంత మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ముందుకొచ్చే వరకూ స్వచ్ఛఉద్యమం ఉదయిస్తూనే ఉంది. ఆ ఉదయంలో ఓ కిరణం, ఆ పోరాటంలో ఓ సైన్యం మన తెలుగు కుర్రాడు రమేష్‌.
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని మత్యం గ్రామ పంచాయతీలోని ఎగువమత్యం దళితవాడకు చెందిన ఆనందన్‌ రమేష్‌ స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా ఆ పంచాయతీకి ‘స్వచ్ఛదూత’. పంచాయతీలోని ఆరు గ్రామాల్లో  ప్రజలందరికీ అవగాహన కల్పించి మరుగుదొడ్లను నిర్మించాడు. ఇప్పుడు తన గ్రామపంచాయతీని ‘బహిరంగ మల విసర్జన రహిత’ంగా (ఓడీఎఫ్‌) మార్చేశాడు. అతను చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. బిహార్‌ రాష్ట్రం పాట్నా జిల్లాలో వెనుకబడిన మానేర్‌ మండలంలోని గ్రామాల్లో ప్రజలకు మరుగుదొడ్లపై చైతన్యం కల్పించేందుకు పిలుచుకుని వెళ్లారు. ఏప్రిల్‌ 1 నుంచి 10వ తేదీ వరకు బృందంతో కలిసి మానేర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో ఉండి.. అవగాహన తెచ్చి మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించాడు. అదే రాష్ట్రం చంపారన్‌ జిల్లాలో జరిగిన ‘చంపారన్‌ సత్యాగ్రహ’ శతాబ్ది ఉత్సవాల్లో  ప్రధాని మోదీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు. రూ.51వేల నగదు, ప్రశంసా పత్రాన్ని సగర్వంగా స్వీకరించాడు.

రాత్రింబవళ్లూ అదే పని
పంచాయతీలోని దిగువ మత్యం,- హరిజనవాడ, ఎగువమత్యం,- హరిజనవాడ, ఎం.పైపల్లె, జోగువారిపల్లె గ్రామాల్లో 509 నివాసాలున్నాయి. ఇక్కడ స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రారంభమైనప్పుడు కొన్ని సామాజిక వర్గాల వారికి మినహా మిగతావారెవ్వరికీ మరుగుదొడ్లు ఉండేవి కావు. దళితవాడల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. మహిళలు, పురుషులు తేడా లేకుండా అందరూ బహిరంగ మల విసర్జనకు అలవాటు పడ్డారు. స్వచ్ఛదూతగా ఆర్నెళ్ల కాలంలో ఉన్నతాధికారుల సహకారంతో ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాడు రమేష్‌.  ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లోనే గడిపాడు. నిర్మాణం, వాడకంపై అవగాహన కల్పించాడు. నిర్మాణాలకు సహకరించడమే కాకుండా చైతన్యం రగిల్చాడు. నిధుల్లేక వెనుకడుగు వేసేవారికి సర్పంచి ‘మయూరి జగన్నాథరెడ్డి’తో మాట్లాడి ఆర్థిక సాయమందేలా ఏర్పాట్లు చేశాడు. సర్పంచి సాయంతో పాటు డ్వాక్రా సంఘాల్లో మహిళలకు రూ.5వేలు నిర్మాణ రుణంగా దక్కడంతో ఇక స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆగలేదు. లక్ష్యం పూర్తయ్యింది. రమేష్‌ కృషికి ఫలితం దక్కింది.

గంగానది గొప్పదనం చెప్పాం 

బిహార్‌ రాష్ట్రంలోని గ్రామాల్లో మా బృందం మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత మీద అవగాహన కల్పించేది. వారిలో నేను ఒకడిని. ఈ క్రమంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి రోజు సాయంత్రం పూట గ్రామాల్లో లఘు చిత్రాలతో అవగాహన కల్పించాం. పాట్నాలో గంగానది ప్రవహిస్తోంది. ఈ నదిని ఇతర రాష్ట్రాల్లో దేవతగా కొలుస్తారు. పూజలు చేసి, హారతులిస్తారు. ఇక్కడ మీరంతా కలుషితం చేస్తున్నారని వారికి వివరించాం. వారిలో మార్పు కన్పించింది. 

- రమేష్‌, స్వచ్ఛదూత

- కరీముల్లా, ఈనాడు డిజిటల్‌, చిత్తూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని