అడిగిందల్లా అద్దెకిస్తారు

అడిగిందల్లా అద్దెకిస్తారు ఇంట్లోకి కావాల్సిన ఫర్నీచర్‌, ఇతర విద్యుత్‌ గృహోపకరణాలూ, ద్విచక్ర వాహహనాలూ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడొందల రకాల ఉపకరణాల్ని అద్దెకిస్తుందీ.

Published : 28 Apr 2018 01:47 IST

అడిగిందల్లా అద్దెకిస్తారు  

ఇంట్లోకి కావాల్సిన ఫర్నీచర్‌, ఇతర విద్యుత్‌ గృహోపకరణాలూ, ద్విచక్ర వాహహనాలూ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడొందల రకాల ఉపకరణాల్ని అద్దెకిస్తుందీ సంస్థ. పెద్ద మొత్తం ఖర్చుపెట్టలేనివారు, తాత్కాలికంగా నగరాల్లో ఉండాల్సి వచ్చినవారు.. గ్రాబ్‌ఆన్‌రెంట్‌.కామ్‌ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఈ సంస్థ ఐఐటీ గౌహతీ పూర్వవిద్యార్థుల మెదళ్లలో ప్రాణం పోసుకుంది. మనీష్‌, శుభం జైన్‌, ఆదిత్య శర్మ, నికుంజ్‌ అగర్వాల్‌ మూడేళ్లుగా ఈ సేవలు అందిస్తున్నారు. వీరంతా హైదరాబాద్‌కి చెందిన యువత. బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి చోట్ల సేవల్ని అందిస్తూ.. విస్తరిస్తున్నారు. మనీష్‌ బృందంలో నాయకుడిగా అందరినీ నడిపిస్తున్నాడు.

సేవలేంటంటే?
గ్రాబ్‌ఆన్‌రెంట్‌ ఈ- పోర్టల్‌ద్వారా ఏసీ, ఫ్రీజ్‌, వాషింగ్‌మెషీన్‌, కూలర్లూ, ఓవెన్‌, డైనింగ్‌టేబుల్‌, స్టడీ టేబుల్‌, కుర్చీ, బెడ్‌లూ, పరుపులూ, బైకులూ, వ్యాయామ పరికరాలూ, కంప్యూటర్లూ, ల్యాప్‌టాప్‌లూ, ఇన్వెట్టర్ల వంటివి అద్దెకి ఇస్తారు. నెలవారీగా వీటికి అద్దె తీసుకుంటారు. అలానే మన ఇంటి వద్దకొచ్చి వీటిని అమర్చడం.. పని చేయకపోతే బాగు చేయడం, తిరిగి ఇచ్చేటప్పుడు వచ్చి తీసుకెళ్లడం.. అలా అన్నీ ఈ సంస్థ సభ్యులే చూసుకుంటారు. ఆర్డర్‌ ఇవ్వడం వరకే మన పని. అంతేకాదు అద్దెకే కదా ఇచ్చేది అని ఏవి పడితే అవి ఇవ్వరు. కొత్త వాటినీ అదీ బ్రాండెడ్‌ ఉపకరణాలనే అందిస్తారు.

భలే ఆలోచించారు
వీరంతా ఐఐటీ గౌహతిలో చదువుకునేటప్పుడే ఉద్యోగాలు చేయాలనుకోలేదు. వాటిని సృష్టించి పలువురికి ఉపాధినివ్వాలని ఆలోచించారు. ఒక డిజైనింగ్‌ సంస్థని ఏర్పాటు చేసి.. కొన్నాళ్లు కోల్‌కతాలో సేవలు అందించారు. ఆ తరవాత బెంగళూరులో స్థిరపడాలని వ్యాపారాన్ని అక్కడకు తరలించారు. ఈ క్రమంలో ఆఫీసులో, ఇంట్లో ఫర్నీచర్‌, ఇతర వస్తువులు కొనాలంటే చాలా బడ్జెట్‌ కావాల్సి వచ్చింది. పని వేగంగా జరగాలంటే నాణ్యమైన ల్యాప్‌టాప్‌లూ, ప్రింటర్లు అవసరం. దానికే ఎక్కువ ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఏం కొనాలో అర్థంకాని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి చర్చలు నడుస్తున్నప్పుడే వాళ్లకి కావల్సిన వస్తువులు ఎవరైనా అద్దెకిస్తే బాగుండేది కదాని అనిపించింది. అసలు ఎవరో కాదు మనమే ఆ సేవల్ని ఎందుకు మొదలుపెట్టకూడదు అని ఆలోచించారు. 2015లో గ్రాబ్‌ఆన్‌రెంట్‌ స్థాపించారు.

పట్టుదలే పెట్టుబడి 

యూనీకాన్‌ వెంచర్స్‌, ఐవీ క్యాప్‌ వెంచర్స్‌ అనే రెండు సంస్థల వారికీ వీరి ఆలోచన, పట్టుదల నచ్చి పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాయి. అలా ఈ సంస్థకు దాదాపు పందొమ్మిది కోట్ల పెట్టుబడి తొలినాళ్లలోనే అందింది. దాంతో వీరు మూడొందల రకాల బ్రాండెడ్‌ ఉపకరణాలను కొనుగోలు చేశారు. పైగా నాలుగు వందల మంది వ్యాపారులతోనూ ఒప్పందాలు చేసుకున్నారు. అలా వీరి నుంచి ఎప్పటికప్పుడు రకరకాల ఉపకరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ పోర్టల్‌ నుంచి ఏవైనా ఆర్డర్‌ చేయాలంటే.. కేవైసీ పూర్తి చేసి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మర్నాడు గుమ్మం వద్దకే కావల్సిన వస్తువు వచ్చేస్తుంది. ప్రస్తుతం పదకొండు వేల మంది వినియోగదారులు గ్రాబ్‌ఆన్‌రెంట్‌ సేవలు పొందుతున్నారు. అద్దె.. వస్తువు ఖరీదును బట్టి ఉంటుంది. ఇంతకీ ఈ సేవల్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే.. ‘మధ్యతరగతి వారూ, తరచూ ఉద్యోగాలు మారేవారు, కొత్తగా కాపురం పెట్టినవారు, చదువులకోసం నగరాలకు వచ్చినవారు మా సేవల్ని అందుకుంటున్నారు’ అంటూ వివరిస్తున్నాడు మనీష్‌.

అంకురార్పణ

* వేసవి ఎండలు మండిపోతున్నాయి... ఏసీ లేనిదే గడవని పరిస్థితి. అలాగని అందరికీ కొనుక్కునే స్థోమత ఉండదు. ఒకవేళ ఏసీ కొన్నా అది అన్ని కాలాల్లోనూ ఉపయోగపడదు. ఈ మూడునెలలు ఏసీ ఇచ్చి... తర్వాత వెనక్కి తీసుకుపోయే వారుంటే ఎంత బాగుంటుంది. 
* శ్రీధర్‌కి ఈ మధ్యనే పెళ్లైంది. మరో ఆరు నెలల్లో అమెరికా వెళ్లడానికి వీసాతోపాటు టికెట్లు సిద్ధమయ్యాయి. మరి అప్పటి వరకూ హైదరాబాద్‌లో ఆఫీసుకు హాజరవ్వాలి. అలాగని కొత్తగా కాపురం పెట్టాక ఫర్నిచర్‌ కొనకపోతే బాగోదు. కొంటే.. ఆరు నెలల తరవాత వాటిని ఏం చేయాలి? నా కొత్త కాపురానికి కావాల్సినవన్నీ అద్దెకిచ్చి... నాకు అవసరం లేనప్పుడు తీసుకుపోతే నాకు ఎంత సౌకర్యం. 
* కొందరు ఇలా సమస్యల గురించి ఆలోచిస్తారు. మరికొందరు సమస్యల్లో అవకాశాలను వెదుకుతారు. పరిష్కారాలను ఆవిష్కరిస్తారు. అలా పుట్టుకొచ్చిందే గ్రాబ్‌ఆన్‌రెంట్‌.కామ్‌.

- పద్మ వడ్డె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని