మీలో ఉందా విటమిన్‌ జీ?

ఇరవైలు దాటుతుండగానే కోట్లలో వ్యాపారం... స్థిరపడేలోపే ఊహించని నష్టాలు... కోట్లు పోయాయి... కంపెనీలు క్లోజ్‌ అయ్యాయి.. నిండా మనిగాడు... దారితోచలేదు... గోదారే దిక్కనుకున్నాడు... కానీ, చస్తే ఏమౌతుంది? గెలిచినట్టా? ఓడినట్టా? జీవితాన్ని లెక్కగట్టడం మొదలెట్టాడు...

Published : 05 May 2018 01:21 IST

మీలో ఉందా విటమిన్‌ జీ?

ఇరవైలు దాటుతుండగానే కోట్లలో వ్యాపారం... స్థిరపడేలోపే ఊహించని నష్టాలు... కోట్లు పోయాయి... కంపెనీలు క్లోజ్‌ అయ్యాయి.. నిండా మనిగాడు... దారితోచలేదు... గోదారే దిక్కనుకున్నాడు... కానీ, చస్తే ఏమౌతుంది? గెలిచినట్టా? ఓడినట్టా? జీవితాన్ని లెక్కగట్టడం మొదలెట్టాడు... ఆ గమనంలోనే ఓ విలువైన సూత్రం పుట్టుకొచ్చింది. అదే ‘కృతజ్ఞత’... ‘గ్రాటిట్యూడ్‌’... విటమిన్‌-‘జీ’ మనిషిగా భూమిపై పరిచయం అయినందుకు తనకు తానే కృతజ్ఞడిగా మారాడు ప్రశాంత్‌ జైన్‌... ఆ క్షణం నుంచి ప్రతీదీ కృతజ్ఞతతో స్వీకరించాడు... పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి అన్నట్టుగా... తిరిగి విజయతీరాలకు చేరాడు... తనలా ‘విటమిన్‌-జీ’ అవసరం ఉన్నవారికి పుస్తకం ద్వారా జీవితం పట్ల ఎలాంటి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలో చెబుతున్నాడు...4జీ వేగంలో నెట్‌ స్పీడ్‌ ఊపందుకున్న మాదిరిగా... అన్నీ క్షణాల్లో అందుబాటులోకి వచ్చేశాయ్‌. సమాచారం మొదలు... సౌకర్యాల వరకూ అన్నీ. ఆధునిక టెక్నాలజీ... ఇంటర్నెట్‌ అందుకు ప్రధాన వేదికలయ్యాయి. వేచి చూడడం బాగా తగ్గిపోయింది. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా... ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలనే ధోరణి యువతలో బాగా బలపడింది. ఒకవేళ అనుకున్నట్టుగా జరగకుంటే... ‘నాకే ఎందుకిలా జరుగుతుంది? ఎప్పుడూ ఇంతే!’ అనుకుని ఒత్తిడిని కొనితెచ్చుకుంటారు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో గెలుపు కోసం ఆరాటపడేవారు అనుకున్న ఫలితం రాకుంటే నిరాశావాదులుగా మారిపోతుంటారు. నేనూ ఓ దశలో ఇలానే... ఐదేళ్ల పాటు ఒత్తిడికి లోనయ్యా. దాన్నుంచి బయటపడడం చాలా కష్టం అయింది. కోట్లల్లో వ్యాపారం చేసిన నేను షేర్‌ఆటోలో వెళ్లడానికి డబ్బులు లేని స్థితికి వచ్చా. కొన్నేళ్ల పాటు యాంటీ డిప్రసెంట్స్‌ (కొన్ని మాత్రలు) తీసుకున్నా.  కారు నడపలేని స్థితికి వచ్చా. ఇప్పటికీ స్టీరింగ్‌ పట్టుకుంటే నా చేతులు వణుకుతాయి. ఆత్మహత్యే పరిష్కారం అనుకునే స్థితికి వెళ్లిపోయా. ఆ సమయంలోనే ఎన్నో పుస్తకాలు... గురువులు.. వర్క్‌షాపులకీ వెళ్లా. అన్నింటి సారం టార్చ్‌ లైట్‌లా వెలుగుని చూపించాయి... ఇక నడవాల్సింది నేనే అని నాకు అర్థమయ్యింది.
ఆశావాదిగా...
నా మానసిక స్థితిని అర్థం చేసుకున్నా. పాజిటివ్‌గా ఆలోచించా. నా జీవిత గమనాన్ని విశ్లేషించడం మొదలు పెట్టా. అందరూ చెప్పే ఈ ‘పాజిటివ్‌... నెగిటివ్‌’లకు అతీతంగా మరేమైనా ఉందా? అని ఆలోచనలో పడ్డా. ఈ క్రమంలోనే నాతో నేను ఎక్కువగా గడిపా. నన్ను నేను పూర్తిగా ఆవిష్కరించుకునే ప్రయత్నం నుంచి కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవడం మొదలయ్యింది. నాపై నేనే ఎన్నో రకాల ప్రయోగాలు చేసుకున్నా. ‘గ్రాటిట్యూడ్‌’ మంత్రం ఒత్తిడిని మాయం చేస్తుందని నమ్మడానికి నాకు ఐదేళ్లు పట్టింది. ఎందుకంటే నేనో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సాధారణ యువకుడిలా పెరిగా. ఇంజినీరింగ్‌ పట్టాపట్టుకుని గుంటూరు నుంచి అమెరికా వెళ్లా... పాతికేళ్లు నిండకుండా మిలియన్‌ డాలర్‌ కంపెనీకి ఓనర్‌నయ్యా... ఆ వెంటనే జీరోనయ్యా.. ఇన్ని ఎత్తుపల్లాల్ని చూసిన నేను విటమిన్‌-జీ అంటే వివరించడానికి నన్ను నేనే ఓ ప్రయోగశాలగా చేసుకున్నా. పడిలేచిన కెరటంలా తిరిగి ‘కంట్రోల్‌ ఎస్‌’ టెక్నాలజీ కంపెనీతో పాటు మారో నాలుగు సంస్థల్ని విజయవంతంగా నడుపుతున్నా. పలు కంపెనీలకు ట్రైనర్‌గా పని చేస్తున్నా. ఇదంతా నా ఒక్కడి కష్టం కాదు. ఎంతో మంది పాత్ర ఉంది. నా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, సహోద్యోగులు... చాలా మందే ఉన్నారు. అందరిపట్లా ఎల్లప్పుడు కృతజ్ఞతతో ఉంటాను.
నాలాంటి ఎంతోమందికి...
చనిపోవడమే పరిష్కారం అనుకున్న నేను ఈ రోజు తిరిగి పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. కృతజ్ఞతా పూర్వకంగా బతకడంలో ఉన్న కిక్‌ని నేటి పోటీ ప్రపంచంలో పడిలేచే యువతకి పరిచయం చేయాలనుకున్నా. నా అనుభవాల్ని అభ్యాసాలుగా ‘43 ఛాప్టర్ల’లో నిక్షిప్తం చేశా. ఇప్పుడున్న ట్విట్టర్‌ జనరేషన్‌ని ఎంతమేరకు ఆకట్టుకుంటుందో నాకు తెలీదుగానీ. కచ్చితంగా మిలీనియల్స్‌కి మాత్రం ‘జీ’ విటమిన్‌ తప్పక అందాలి. ‘డీ’ విటమిన్‌ లోపం ఉంటే పొద్దునే లేని సూర్యరశ్మికి ఎలా ఎదురు నిల్చుంటామో... జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాల్ని సమంగా చూడాలంటే ‘గ్రాటిట్యూడ్‌’ అవసరం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు... చదువు బోధించిన ఉపాధ్యాయులు... పంచుకోవడం నేర్పే తోబుట్టువులు... మిత్రులు.. చివరికి శత్రువులు... అందరిపట్ల కృతజ్ఞతతో ఉండడం అనివార్యమని అందరూ గ్రహించాలి.
* కృతజ్ఞత లేకుండా ఎలా ఉంటాం అనుకోవచ్చు. గురకపెట్టడం ఎవరికి వారు గుర్తించలేరు. అది ఇతరులకే తెలుస్తుంది. ఇదే మాదిరిగా మీరు కృతజ్ఞతా పూర్వకంగా ఉన్నారో లేదో మన కంటే మన చుట్టూ ఉన్నవారికే ఎక్కువగా తెలుస్తుంది.
* కష్టాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడం మామూలే. సుఖం, సక్సెస్‌లోనూ కృతజ్ఞతని చూపించాలి. ఒక విద్యార్థి మంచి ర్యాంకు సాధించాడంటే అది తనొక్కడి కష్టం కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు... ఇలా చాలా మందే ఉంటారు. వారందరి పట్ల కృతజ్ఞతని చూపించినప్పుడే విద్యార్థి పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతాడు.
* సంతోషంగా ఉన్నప్పుడే ఈ విటమిన్‌-జిని సమృద్ధిగా గ్రహిస్తే... కష్టాల్లో కూరుకున్నప్పుడు ఒత్తిడిగానీ... మరే ఇతర న్యూనతా భావాలు గానీ దరిచేరవు.
* కృతజ్ఞతా భావం ఓ ‘ఎమోషనల్‌ మజిల్‌’ అనుకుంటే.. నిత్య సాధనతోనే దాన్ని దృఢపర్చుకోవచ్చు.
* ఎప్పుడూ జరిగిన తప్పుల గురించే ఆలోచించొద్దు. మెరుగు అవ్వడంపైనే దృష్టిపెట్టాలి. మంచిని గుర్తించడం... అందుకు కారణం అయినవారిని ప్రోత్సహించడం మర్చిపోవద్దు.

పుస్తకం కోసం http://prashantjain.in/wp/shop/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని