చేతి వేలే...కారు తాళం

దొంగల నుంచి కార్లను కాపాడుకోవడం ఎలా?మనం తప్ప మన కారు ఎవరూ నడపడానికి వీల్లేకుండా చేసే టెక్నాలజీ లేదా?మన కారు ఎవరో తీసుకెళ్లి ప్రమాదం చేస్తే... మన మీద కేసేంటి?ఇలా ఎన్నో ప్రశ్నలకు సాంకేతిక పరిజ్ఞానంతో సమాధానం చెబుతున్నాడో ఇంజినీరింగ్‌ కుర్రాడు. ...

Published : 12 May 2018 01:30 IST

చేతి వేలే...కారు తాళం

దొంగల నుంచి కార్లను కాపాడుకోవడం ఎలా?మనం తప్ప మన కారు ఎవరూ నడపడానికి వీల్లేకుండా చేసే టెక్నాలజీ లేదా?మన కారు ఎవరో తీసుకెళ్లి ప్రమాదం చేస్తే... మన మీద కేసేంటి?ఇలా ఎన్నో ప్రశ్నలకు సాంకేతిక పరిజ్ఞానంతో సమాధానం చెబుతున్నాడో ఇంజినీరింగ్‌ కుర్రాడు. ఓ వైపు చదువుకొంటూనే తన ఆవిష్కరణతో అద్భుతాలు చేస్తున్నాడు రితీష్‌.
ఎఫ్‌ఏడీని క్వస్ట్‌ డేటా అనలైటిక్స్‌ సంస్థ పేరుతో తయారు చేస్తున్నాను. భవిష్యత్తులో సొంతంగా ఫింగర్‌ సెన్సార్‌ల ఉత్పత్తికీ ప్రయత్నిస్తున్నాను. ద్విచక్ర వాహనాలకూ ఈ పరిజ్ఞానం ఉపయోగించుకోవచ్చ’’ని చెబుతున్నాడు రితీష్‌.రితీష్‌ వెంకట్‌జోగి రూపొందించిన ఫింగర్‌ యాక్సిస్‌ డివైజ్‌ (ఎఫ్‌ఏడీ) కార్ల చోరీలకు అడ్డుకట్ట వేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటిగరువు గ్రామానికి చెందిన రితీష్‌ హైదరాబాదులో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువున్నాడు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో తన ల్యాప్‌టాప్‌ను ఎవరో దొంగలించారు. ఎంతో విలువైన, ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోకుండా ఏం చేయలేమా? అనే ప్రశ్న నుంచి పుట్టిన ఆవిష్కరణే ఎఫ్‌ఏడీ.ఎలా పనిచేస్తుంది: ఎఫ్‌.ఎ.డి. కారు ఇంజిన్‌ వద్ద అమర్చుతారు. దీనికి కారు యజమాని వేలి ముద్రను అనుసంధానిస్తారు. కారు స్టార్ట్‌ కీ వద్ద ఒక ఫింగర్‌ సెన్సార్‌, డోరు వద్ద ఒక ఫింగర్‌ సెన్సార్‌లు ఉంటాయి. ఎఫ్‌ఏడీ యాప్‌ను కారు యజమాని చరవాణిలో నిక్షిప్తం చేస్తారు.
* కారు తలుపు వద్ద ఏర్పాటు చేసిన ఫింగర్‌ సెన్సార్‌ వద్ద ఒకసారి వేలు పెడితే కారు తలుపు తెరుచుకుంటుంది. స్టార్ట్‌కీ వద్ద ఏర్పాటు చేసిన మరో సెన్సార్‌ వద్ద రెండు సార్లు వేలు పెడితే ఇంజిన్‌ స్టార్ట్‌ అవుతుంది.
* ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన కారును ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే యజమానికి, బంధువులకు దగ్గర్లోని పోలీసు స్టేషన్‌కు సంక్షిప్త సందేశాలు వెళ్తాయి.
* కారు ప్రమాదానికి గురైతే దగ్గర్లోని ఆసుపత్రికి, పోలీసు స్టేషన్‌కు, బంధువులకు సమాచారం వస్తుంది. ఈ పరిజ్ఞానం వల్ల యజమాని తప్ప ఇంకెవ్వరూ కారు తలుపును తెరవలేరు, స్టార్ట్‌ చెయ్యలేరు.
* ఎఫ్‌ఏడీ యాప్‌లో యజమాని బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫింగర్‌ ప్రింట్స్‌ను అనుసంధానం చేయవచ్చు. అప్పుడు వారూ మన కారు ఉపయోగించవచ్చు. ఇందుకు వారి చరవాణి నంబర్లు తప్పనిసరి. దీనివల్ల ఎవరైనా తీసుకువెళ్లి ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించినా, ప్రమాదం చేసినా కారు నడిపే వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది.
పరిజ్ఞానం: ఎఫ్‌.ఎ.డి.కి అవసరమైన ‘జీ 15’ పేరుతో ఉన్న ఫింగర్‌ సెన్సార్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకొన్నారు. చరవాణిలో నిక్షిప్తం చేసిన యాప్‌లో డేటాను భద్రపరచుకునేందుకు మైక్రోసాప్ట్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఇక కారు ఎక్కడ ఉంది, ఎటు ప్రయాణిస్తుందో తెలుసుకునేందుకు జీయో పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు.
హోండాతో: ఎఫ్‌ఏడీ ఉపకరణాలను పంపిణీ చేసేందుకు ఇప్పటికే హోండా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు రితిష్‌ వెంకట్‌ చెప్పారు. సంవత్సరానికి 10 వేల ఎఫ్‌ఏడీ ఉపకరణాలు అందించనున్నారు. దీంతోపాటు బహిరంగ మార్కెట్‌లోనూ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఖర్చు తక్కువ: ఒక కారుకు లాకింగ్‌ సిష్టం ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.18 వేలు ఖర్చువుతుంది. ఆటో లాక్‌ సిస్టం అయితే మరో రూ. 10 వేలు ఖర్చు అవుతుంది. ఎఫ్‌ఏడీ ఏర్పాటు చేయడానికి రూ.10 వేలే ఖర్చు అవుతుంది.

- సుధాకర్‌, న్యూస్‌టుడే, వీరవాసరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని