కాల్‌ కొడితే తలుపు తడతారు

నగరాల్లో ఇప్పుడంతా ఇన్‌స్టంట్‌ లైఫ్‌.. అనుకున్నదే తడవుగా.. చిత్తం అంటూ సేవలు వాకిలి ముందుకొచ్చి పలకరించాలి.. అందుకే డోర్‌ డెలివరీ కాన్సెప్ట్‌నే నమ్ముకుంటున్నాయి అన్ని సంస్థలూ. కూరగాయలు,పండ్లు, బిర్యానీ, సరకులు, దుస్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు.. ఇలా అన్నీ ఇంటి తలుపుతట్టాల్సిందే. ..

Published : 09 Jun 2018 01:48 IST

అంకురార్పణ
కాల్‌ కొడితే తలుపు తడతారు
ఇంటివద్దే మొబైల్‌ మరమ్మతులు

నగరాల్లో ఇప్పుడంతా ఇన్‌స్టంట్‌ లైఫ్‌.. అనుకున్నదే తడవుగా.. చిత్తం అంటూ సేవలు వాకిలి ముందుకొచ్చి పలకరించాలి.. అందుకే డోర్‌ డెలివరీ కాన్సెప్ట్‌నే నమ్ముకుంటున్నాయి అన్ని సంస్థలూ. కూరగాయలు,పండ్లు, బిర్యానీ, సరకులు, దుస్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు.. ఇలా అన్నీ ఇంటి తలుపుతట్టాల్సిందే. ఇదే పంథాలో మీ ఇంటికొచ్చి, నట్టింటికొచ్చి అక్కడే పాడైపోయిన మీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తామంటోంది హైదరాబాద్‌కి చెందిన ఫిక్స్‌సెల్‌ అనే స్టార్టప్‌ సంస్థ. స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ పోయిందా..? అవతలివాళ్లు మాట్లాడేది వినిపించలేదా? జస్ట్‌ ఒకే ఒక్కకాల్‌..

న ఇంటికొచ్చి స్మార్ట్‌ఫోన్‌ మరమ్మతు చేస్తామంటోంది ఫిక్స్‌సెల్‌ సంస్థ. స్క్రీన్‌ పగిలితే ఇరవై నిమిషాల్లో కొత్తది వేస్తారు. స్పీకర్ల సమస్య వచ్చినా అక్కడికక్కడే సిద్ధం చేస్తారు. ఇతర సమస్యలు తలెత్తితే టైమ్‌ పడుతుందని స్మార్ట్‌ఫోన్‌ను యజమానికే ఇస్తారు టెక్నిషియన్‌. అతను గోడౌన్‌కి వెళ్లి సంబంధిత పరికరాన్ని తీసుకొని వచ్చి సమస్యను పరిష్కరిస్తాడు. సాఫ్ట్‌వేర్‌ సమస్యలు ఉంటే పరిశీలనకు ఒక రోజు వాళ్ల దగ్గర ఉంచుకొని పరీక్షిస్తారు. మరుసటి రోజే సమస్య పరిష్కరించి ఇంటికి తెచ్చిస్తారు. ఫోన్‌డెడ్‌ అయితే సర్వీస్‌ చేయటం బదులు కొత్తఫోన్‌ కొనటం మంచిదని సలహా ఇస్తారు. అంతేకానీ డబ్బులకోసం సర్వీస్‌ చేసినట్లు నటించరు. అదే వారిని మార్కెట్లో దూసుకుపోయేలా చేస్తోంది.

అవినాష్‌ది వైజాగ్‌, బీటెక్‌(ఈసీఈ) చదివే సమయంలో మొబైల్‌ మరమ్మతులకు గిరాకీ ఉందనుకున్నాడు. ఫేస్‌బుక్‌లో మొబైల్‌ రిపైర్‌ అనే పేజీని క్రియేట్‌ చేసి సమస్యలని పరిష్కరించేవాడు. పాకెట్‌మనీ వచ్చేది. హైదరాబాద్‌కు వచ్చి విస్తరించాలనుకున్నాడు. టీహబ్‌లో ‘టోఅప్‌’ (విమానంలోని కాక్‌పిట్‌ను కావాలనుకున్న చోట అసెంబుల్‌ చేసే సంస్థ) అనే స్టార్టప్‌ ఐడియా మేకర్‌ నేహను కలిశాడు. నేహ హైదరాబాద్‌లోని బాలనగర్‌కి చెందిన అమ్మాయి. అప్పటికే ఆమె ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. స్టార్టప్స్‌పై అవగాహన ఉంది. అవినాష్‌ ఐడియా బావుందని నేహ డిష్కస్‌ చేసింది. చివరికి ఇద్దరూ కలిసి 2016 నవంబర్‌లో ‘ఫిక్స్‌సెల్‌’ అనే పేరుతో సంస్థను రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాత టీహబ్‌లో చేరారు. ఇదే సమయంలో డిజిటల్‌ మార్కెట్‌పై పట్టుందని సందీప్‌ అనే యువకుడు వీళ్లతో కలిశాడు. మొదట మూన్నెళ్లపాటు మార్కెట్‌ను పరిశీలించారు. తయారీదారులు, నిపుణులు, వ్యాపారులతో మాట్లాడారు. ‘ప్రస్తుతం మార్కెట్లో 720 రకాల స్మార్ట్‌ఫోన్స్‌ వాడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరి ఫోన్‌కి సమస్య ఉంది. నమ్మకమే పెట్టుబడిగా మా సంస్థ ముందుకు వెళ్తోందంటోంది’ నేహ.

మార్కెట్‌లో మాకో కాంపిటేటర్‌ సంస్థ ఉంది. అయితే వాళ్లు డోర్‌ డెలివరీ సర్వీస్‌ ఇవ్వరు. మేం కాస్త ముందుకు అడుగేశాం. మాకో ఇంటర్నెల్‌ యాప్‌ ఉంది. ముందే కస్టమర్‌కి ఫోన్‌లో ఇంత ధర అవుతుందని చెబుతాం. తీరా టెక్నీషియన్‌ వెళ్లాక కస్టమర్‌ తాళం వేసి ఉంటే.. లేరని ఓ ఫొటో తీసి ఇంటర్నెల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇలా ఎక్కడ ఏ టెక్నీషియన్‌ ఉన్నాడో మేం పర్యవేక్షిస్తుంటాం. సీనియర్‌ సిటిజన్స్‌, బిజీగా ఉండే ఉద్యోగులు, వ్యాపారస్థులు, విద్యార్థులు దగ్గరనుంచి కాల్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటినుంచి బయటకు వెళ్లలేని పెద్దవాళ్లు మా సర్వీస్‌కి ఫిదా అవుతున్నారు.    
- అవినాష్‌, నేహ.

ప్రతిరోజూ పది కాల్స్‌ వస్తాయి..
అవినాష్‌, నేహల దగ్గర సొంతంగా సంపాదించుకున్న డబ్బుల్లేవు. ఇంట్లోవారిని అడిగి టీహబ్స్‌ వెంట తిరిగారు. బాలనగర్‌లో ఓ మొబైల్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ నెలకొల్పారు. పది ఫెయిల్‌ అయిన వారికి శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. అదే సమయంలో టీహబ్‌లో బెస్ట్‌ స్టార్టప్‌గా ఎంపికయిన ఫిక్స్‌సెల్‌ సంస్థకి ఐల్యాబ్స్‌లో ఉచితంగా స్పేస్‌ ఇచ్చారు. అక్కడున్న పదివేల మంది ఉద్యోగులకు కచ్చితంగా పదివేల స్మార్ట్‌ఫోన్లుంటాయి. అక్కడే పని మొదలు పెట్టారు. వారిలోనే దాదాపు 200 స్మార్ట్‌ఫోన్ల సమస్యలను విజయవంతంగా పరిష్కరించారు. సామర్థ్యంపై నమ్మకం వచ్చింది. మాసాబ్‌ట్యాంక్‌లో కార్యాలయం తెరిచారు. సంస్థ వెబ్‌సైట్‌ చూసి కొందరు కాల్స్‌ చేశారు. సేవల పొందిన వారు ఇతరులకు నెంబర్‌ ఇవ్వటంతో ఇంకొందరు స్పందించారు. ఇదే సమయంలో ఇరవై లక్షల రూపాయులు ఎస్‌బీఐ రుణం ఇచ్చింది. మొత్తం పదిహేను మంది బృందంగా పనిచేస్తూ... కొత్తదారిలో విజయకేతనం ఎగురవేస్తున్నారు.

ఛార్జీలు ఇలా...
ఫోన్‌ కంపెనీ, మోడల్‌ను బట్టి ఫిక్స్‌సెల్‌ ఛార్జ్‌ తీసుకుంటుంది. ముందే సమస్య చెబితే దానికి సంబంధించిన కిట్‌తో టెక్నీషియన్‌ ఇంటిదగ్గరికి వస్తాడు. సమస్య చెప్పలేకపోయినా వచ్చి తెలుసుకుని సేవలందిస్తారు. సాఫ్ట్‌వేర్‌ సమస్య ఉంటే మొదట డాటా కాపీ చేసి తీసుకొని వెళ్లి మరుసటి రోజు ఇంటిదగ్గరే అందిస్తారు. ప్రస్తుతం వీళ్లు హైదరాబాద్‌లో స్టాల్స్‌ నిర్వహిస్తూ, నలభై శాతం మార్జిన్‌తో సేవలు అందిస్తున్నారు. ఫిక్స్‌సెల్‌ను వైజాగ్‌కూ విస్తరించారు.

-  రాళ్లపల్లి రాజావలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని