ఈ దూకుడూ.. సాటెవ్వడూ!

ఇంజినీరింగ్‌ విద్యార్థి.. బక్కపల్చని కుర్రాడు... చిన్నప్పట్నుంచే బైకింగ్‌ అంటే మహా ఇష్టం...

Published : 23 Jun 2018 03:33 IST

ఈ దూకుడూ.. సాటెవ్వడూ!

ఇంజినీరింగ్‌ విద్యార్థి.. బక్కపల్చని కుర్రాడు...
చిన్నప్పట్నుంచే బైకింగ్‌ అంటే మహా ఇష్టం...
ఎంతంటే పోటీల కోసం ఒక్కపూటలో ఆరువందల కిలోమీటర్లు బైక్‌పై వెళ్లి వచ్చేంత...
మోకాలు విరిగినా.. శస్త్రచికిత్సలు జరిగినా మోటార్‌సైకిల్‌ వదలనంత...
ఈ అంకితభావమే అతడ్ని జాతీయస్థాయి పోటీల విజేతని చేసింది...
ఆ బైకరే సందీప్‌ (సత్యనారాయణరాజు). ఈతరం మాట కలిపింది.
హోండా వన్‌ మేక్‌ ఛాంపియన్‌షిప్‌. చెన్నై ట్రాక్‌లో జరుగుతున్న చివరి రౌండ్‌. బరిలో దిగుతున్నవారంతా అనుభవజ్ఞులు, ఇంతకుముందు వివిధ నగరాల్లో నిర్వహించిన పోటీల్లో గెలిచినవారు. వారిలో ఒకే ఒక్క తెలుగు కుర్రాడు సందీప్‌. రేస్‌ బైక్‌ పట్టుకొని ఏడాదే. అయినా ఈ ప్రతిష్ఠాత్మక పోటీని అవలీలగా నెగ్గేశాడు. ఇదొక్కటే కాదు.. రెండు జాతీయస్థాయి పోటీల్లోనూ మెరిశాడు.
అలా మొదలైంది
సందీప్‌ ఊరు అమలాపురం. చిన్నప్పుడు టీవీల్లో రేసింగ్‌ పోటీలు వస్తుంటే కన్నార్పకుండా చూసేవాడు. ఏడేనిమిదేళ్ల వయసపుడే స్కూటీ నడిపాడు. ఆరో తరగతిలో బైక్‌ పట్టాడు. రేసింగ్‌లో పాల్గొనాలనే ఉబలాటం ఎక్కువయ్యేది. ఈలోపే కుటుంబం హైదరాబాద్‌కి మారింది. యూట్యూబ్‌ వీడియోలు చూసి, తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకొని ఖాళీగా ఉన్న రోడ్లపై బైక్‌పై జామ్మంటూ దూసుకెళ్లేవాడు. ఈ క్రమంలో పల్సర్‌ వాళ్లు 2016లో ఓ పోటీ నిర్వహిస్తున్నారనే విషయం తెలిసింది. ఫ్రెండ్‌ బైక్‌ తీస్కొని వెళ్లాడు. తొలి పోటీలోనే విజయం వరించింది. అక్కడే బైకర్లకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దే కోచ్‌ కళ్లలో పడ్డాడు. ఆయన సూచనలతో మెరుగులద్దుకున్నాడు.

* 2016, 2017, 2018 పల్సర్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ స్పీడ్‌ సీజన్‌ విజేత
* 2016 కేటీఎం
* ఆరెంజ్‌ డే విజేత
* హోండా వన్‌ మేక్‌ ఛాంపియన్‌షిప్‌ మొదటిస్థానం 
* కేటీఎం ఆరెంజ్‌ కప్‌ రన్నరప్‌.

ఇంట్లో తెలియకుండా
సాధారణంగా రేసింగ్‌ అంటే చాలామందికి తప్పుడు అభిప్రాయం ఉంటుంది. వేగంగా బండి నడుపుతారనీ, ప్రమాదాలు జరుగుతాయనీ అనుకుంటారు. సందీప్‌ ఇంట్లోవాళ్లదీ అదే అభిప్రాయం. పోటీలకు వెళ్లొద్దని వారించేవారు. సందీప్‌కి ఇవేం చెవికెక్కలేదు. ఓసారి కేటీఎం కంపెనీ విజయవాడలో ఆరెంజ్‌ డే అని ఒక పోటీ నిర్వహిస్తోందని తెలిసింది. ఇంట్లో చెబితే ఒప్పుకోరు. ఫ్రెండ్‌ ఇంటికి వెళ్తున్నాని చెప్పి మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయల్దేరాడు. సాయంత్రానికి అక్కడికి చేరి పోటీలో పాల్గొని విజయం సాధించాడు. ట్రోఫీతో రాత్రికల్లా తిరిగొచ్చాడు. కన్నవాళ్లు ఇక అడ్డు చెప్పలేదు. తగిన జాగ్రత్తలు తీసుకొమ్మని మాత్రం చెప్పడం మొదలుపెట్టారు. ఆపై ఎక్కడ పోటీలు జరిగినా సందీప్‌కి ఆహ్వానం అందుతూనే ఉంది. జాతీయస్థాయి రేసింగ్‌ల్లో పాల్గొన్నాక ఏడుసార్లు జాతీయ ఛాంపియన్‌ ఇమ్మాన్యుయేల్‌ జెబరాజ్‌ పరిచయమయ్యారు. ఆయన శిక్షణలో మరింత రాటుదేలాడు.
ఇదీ పోటీ
బైక్‌ రేసింగ్‌ అంటే బండి కిక్‌ కొట్టినంత తేలికేం కాదు. కఠోర సాధన చేయాలి. శరీరం అదుపులో ఉండేలా డైట్‌ పాటించాలి. కేజీలకొద్దీ బరువుండే ట్రాక్‌ సూట్‌తో బరిలో దిగాలి. జాతీయస్థాయి శిక్షణ బృందంలో కొన్నాళ్లైనా శిక్షణ తీసుకోవాలి. ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌స్పోర్ట్స్‌ నుంచి లైసెన్స్‌ పొందాలి. ఖర్చు సొంతంగా భరించాలి. ఛాంపియన్‌షిప్‌లు గెలిచినా వచ్చే పారితోషికం తక్కువ. స్పాన్సర్‌షిప్‌లు దొరకడం కష్టం. బరిలో దిగే విభాగాన్ని బట్టి పది రేసులు, ఐదారు రౌండ్లలో పోటీలుంటాయి. వాటన్నింటిలో గెల్చిన పాయింట్లన్నింటినీ కూడి చివరికి విజేతను తేల్చుతారు. ఓసారి చెన్నైలో జరగాల్సిన ఫైనల్స్‌లో పాల్గొనడానికి ముందు బైక్‌ ప్రమాదానికి గురయ్యాడు.  మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. కొన్నాళ్లు మంచానికే పరిమితం అయ్యాడు. బైక్‌ని వదిలేయమన్నారు సన్నిహితులు. అయినా లెక్క చేయలేదు. ఇన్ని అడ్డంకులు దాటుకుంటూ 400 సీసీ విభాగంలో పోటీ పడుతున్నాడు. తర్వాత మోటో జీపీ నెగ్గి 1000సీసీ విభాగంలో భారత్‌ తరపున ప్రాతినిధ్యమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు సందీప్‌.

- శ్రీనివాస్‌ బాలె  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని