తరలిరాద తనే సంగీతం

పనికిరాని వస్తువులతో కుర్చీలు, బొమ్మలు, వివిధ రకాలుగా ఆర్ట్‌వర్క్స్‌ చేస్తారు. దీన్నే అప్‌సైక్లింగ్‌ అంటారు. అదే పనికిరాని వాటితో సంగీత పరికరాలు తయారు చేయవచ్చొంటున్నాడు హైదరాబాద్‌కి చెందిన శిరీష్‌ సత్యవోలు. పరికరాలు తయారు చేసే విధానంతోపాటు..

Published : 07 Jul 2018 01:56 IST

మ్యూజిక్‌...మ్యాజిక్‌
తరలిరాద తనే సంగీతం

పనికిరాని వస్తువులతో కుర్చీలు, బొమ్మలు, వివిధ రకాలుగా ఆర్ట్‌వర్క్స్‌ చేస్తారు. దీన్నే అప్‌సైక్లింగ్‌ అంటారు. అదే పనికిరాని వాటితో సంగీత పరికరాలు తయారు చేయవచ్చొంటున్నాడు హైదరాబాద్‌కి చెందిన శిరీష్‌ సత్యవోలు. పరికరాలు తయారు చేసే విధానంతోపాటు.. వాటితో మ్యూజిక్‌ను ఎలా సృష్టించొచ్చనే విషయాల్ని పాఠాలుగా చెబుతోన్న అతన్ని ‘ఈతరం’ పలుకరించింది.

టీగ్లాసు, పాత ఫర్నీచర్‌, కూల్‌డ్రింక్స్‌ మూతలు, వైన్‌ బాటిల్స్‌.. ఇలా పనికిరాని వస్తువులతో సరికొత్త సంగీత పరికరాలు తయారు చేసి మ్యూజిక్‌ చేస్తుంటాడు శిరీష్‌. హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో ట్రాష్‌తో మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఎలా చేయాలి? అని నేర్పిస్తున్న ఆయన పాఠాల కోసం ముప్పైయి మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ‘అమెరికా, యూకే దేశాల్లో ఈ ట్రెండ్‌ ఉంది. మనకిది పూర్తిగా కొత్త. ఇలాంటి భావజాలం ఉన్న వాళ్లు మన హైదరాబాద్‌లో ఉండటం విశేషం’ అంటాడాయన.

అవుటాఫ్‌ ది బాక్స్‌
ప్రతి సంగీత కళాకారుడికి ఫలానా చోట ఏ వస్తువు ఎలా ఉంటే ఏ సౌండ్‌ వస్తుందో? తెలుస్తుంటుంది. వాస్తవానికి ప్రతీ వస్తువుకూ ఓ ధ్వని, సంగీతం చేసే గుణం ఉంటుంది. ఎలా ఉపయోగిస్తే ఆ మంచి సంగీతం పలుకుతుందనే స్పృహ మనలో ఉండాలంతే. అలా ఉన్న వ్యక్తే శిరీష్‌. ఎవరైనా సంగీతం పరికరం చేయాలంటే మొదట బొమ్మ గీసుకుంటారు. ఒక పద్ధతి ప్రకారం తయారు చేస్తారు. అయితే పనికిరాని వస్తువులతో అలా చేయటం కుదరదు. అనుకున్న ఫలితం రాకపోవచ్చు. కష్టాలు పడి చేసినా చిన్న పొరబాట్లతో మ్యూజిక్‌ చేయటం కష్టమవుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు చెబుతున్నాడు. ‘పరిసరాలపై అవగాహన ఉండి, గమ్‌, వెల్డింగ్‌, తాళ్లతో కట్టేయొచ్చా.. సంగీతం పుట్టించవచ్చా.. లాంటి ఆలోచనలుండాలి. ఏ సామగ్రిని తాకితే ఎలాంటి శబ్దం వస్తుందనేది గుర్తించాలి. ఒక్కమాటలో అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించాలి’ అంటూ విద్యార్థులకు నేర్పిస్తున్నాడు.

మ్యూజిక్‌ టెక్నాలజీ కోర్సులో..
బీటెక్‌ చదివే రోజుల్లో సీనియర్స్‌ వల్ల సంగీతంపై ఆసక్తి పెరిగింది. ఆ క్రమంలో రాసుకున్న పాటలకు మ్యూజిక్‌ చేసుకున్నాడు. ‘మ్యూజిక్‌ మెషీన్‌’ అనే బ్యాండ్‌ ఏర్పాటు చేశాడు. సొంతంగా చిన్న స్క్రిప్ట్స్‌ రాసుకుని, షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాడు. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తితో అమెరికాలోని జార్జియా నగరంలో మ్యూజిక్‌ టెక్నాలజీకి దరఖాస్తు చేశాడు. ఇతని ఆలోచనలు చెబితే కాలేజీలో సీటు ఇచ్చారు. బీటెక్‌లో మెకానికల్‌, ఎమ్‌.టెక్‌లో మెటీరియల్‌ సబ్జెక్ట్‌ తీసుకోవటంతో ఇన్‌స్ట్రుమెంట్‌ డిజైనింగ్‌ స్పెషలైజేషన్‌గా ఎంచుకున్నాడు. చదివిన చదువు, ఆసక్తి రెండూ కలిసొచ్చాయి. ఆవిష్కర్తగా మార్చాయి.

ప్రత్యేక సంగీత పరికరం
గిటార్‌లాంటి వాటితో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలుంటాయి. ఫోన్‌ మూమెంట్స్‌ బట్టి ధ్వని వస్తుంటుంది. బీపీ, మెదడులోని తరంగాల కదలికలను బట్టి మ్యూజిక్‌ ప్లే చేయవచ్చు. ఇదంతా డిజిటల్‌ (కోడింగ్‌ చేయటం), ఎలక్ట్రానిక్స్‌ (సెన్సర్స్‌, మోటర్లు) ఎకోస్టిక్‌ (ఫిజికల్‌) ద్వారా సాధ్యమవుతుంది. ఇన్‌స్టుమ్రెంట్‌ డిజైనింగ్‌లో చేరటంతో లేజర్‌కటింగ్‌, త్రీడీ ప్రింటింగ్‌.. లాంటి పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు. పుస్తకాలతో పాటు రివర్స్‌ ఇంజినీంగ్‌ చేయటంతో సంగీత పరికరాల తయారీ అర్థమైంది. సొంతంగా ట్రబ్లర్‌ (పన్నెండు తీగలుంటాయి. నలుగురు ప్లే చేసే సంగీత పరికరం), హ్యూమన్‌ డిజిటల్‌ ఆడియో వర్క్‌ స్టేషన్‌ అనే పరికరం చేశాడు. తర్వాత సర్కులర్‌ గిటార్‌ తయారు చేశాడు. వైన్‌ గ్లాసులతో జలతరంగ్‌ చేశాడు. దీన్ని రోబోట్‌ ప్లే చేస్తుంది. దీన్ని తయారు చేయటానికి ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాడు. తొమ్మిది నెలలు పట్టింది. ‘ఆ పరికరం సృష్టించే సంగీతం విన్నప్పుడు.. ఇలాంటి పరికరం ఒకటే ఉంటుందన్న భావన కలిగిన క్షణంలో నా ఆనందానికి అవధుల్లేవంటాడు శిరీష్‌. రెండు చిన్న సినిమాలకు సౌండ్‌ డిజైనర్‌గా, పాటలకూ సంగీతం చేశాడు.

పరికరం సృష్టించారు

వింటర్‌గటా అనే పాపులర్‌ బ్యాండ్‌ బృందం పాటకోసం ఓ సంగీత పరికరాన్ని చేసింది. పదినెలల వారు శ్రమించి వింటర్‌గటా మార్బల్‌ మిషన్‌ను తయారు చేశారు. మార్బల్స్‌, చెక్కలతో ఆ పరికరాన్ని రూపొందించారు. ఇందులో మార్బల్స్‌ మీద గోలీలు పడుతుంటాయి. ప్రతి గోలీ ఒక్కోరకంగా పడుతూ భిన్నమైన శబ్దాన్ని సృష్టిస్తుంది. కోడ్‌ రాసినట్లు చక్కగా మ్యూజిక్‌ వస్తుంది.

‘‘ఈ తరానికి ట్రాష్‌తో పరికరాలు తయారీ, సంగీతం చేసే విధానాన్ని నేర్పించాలనుకుంటున్నా. ఇందుకోసమే హైదరాబాద్‌లో వర్క్‌షాప్స్‌ చేస్తున్నా. ‘జీరోస్థాయి నుంచి ట్రాష్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ డిజైనింగ్‌ నేర్పిస్తున్నా. ట్రాష్‌తో మ్యూజిక్‌ పరికరాలు తయారు చేసే వారు విభిన్నమైన సంగీత పరికరాలను పుట్టించకుండా ఉండరు కదా? నేను తయారు చేసిన పరికరాలతో ఓ సినిమాకి మ్యూజిక్‌ చేయాలన్నదే నా కల.’’

- రాళ్లపల్లి రాజావలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని