పశువుల కాపరి డాక్టర్‌ పట్టా

పదమూడేళ్ల వరకూ... అక్షరం ముక్కైనా రానివాడు ఇరవై తొమ్మిదేళ్లకల్లా... పీజీలు పూర్తిచేసేశాడు పశువులు మేపినవాడు‘పరిశోధన’వంతుడయ్యాడు చదువు గెలిపించిన విజేత పండరీనాథ్‌ కథనం. 2002... పదమూడేళ్ల అబ్బాయి పొలంలో పశువులు మేపుతున్నాడు...

Published : 14 Jul 2018 01:13 IST

చదువేగుచుక్క
పశువుల కాపరి డాక్టర్‌ పట్టా

పదమూడేళ్ల వరకూ... అక్షరం ముక్కైనా రానివాడు
ఇరవై తొమ్మిదేళ్లకల్లా... పీజీలు పూర్తిచేసేశాడు
పశువులు మేపినవాడు‘పరిశోధన’వంతుడయ్యాడు
చదువు గెలిపించిన విజేత పండరీనాథ్‌ కథనం.
 

2002...
పదమూడేళ్ల అబ్బాయి పొలంలో పశువులు మేపుతున్నాడు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న ఎంవీ ఫౌండేషన్‌ సభ్యులు అక్కడికొచ్చారు. అబ్బాయిని గుర్తించి బడికి పంపారు.

2018 జులై 11...
అదే బాలుడు... కష్టాలను అధిగమించాడు. వసతుల లేమిని జయించాడు. చదువే సోపానంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందాడు.

పండరీనాథ్‌ది జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామం. నాన్న పెద్ద తిమ్మప్ప, అమ్మ గోవిందమ్మ. ముగ్గురు కుమారుల్లో పండరీనాథ్‌ రెండోవాడు. వ్యవసాయమే కుటుంబానికి ఆధారం. పశువులూ ఉండేవి. వాటిని ఎవరో ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి. పెద్ద కుమారుడు ప్రతాప్‌ అప్పటికే బడికి వెళ్తున్నాడు. పశువులను చూసుకోవటం ఇబ్బందిగా మారటంతో పండరీనాథ్‌పై ఆ బాధ్యత పడింది. అలా 13 ఏళ్లు వచ్చేవరకు పశువులను మేపటానికే పరిమితమయ్యాడు.

శిల్పిచేతిలో పడ్డప్పుడే ఏ శిలైనా శిల్పంగా మారుతుంది. అలా 2002లో ఎంవీ ఫౌండేషన్‌ ప్రతినిధుల కంటపడ్డాడు. వారు రేవులపల్లి వద్ద బ్రిడ్జి పాఠశాలలో చేర్చారు. అందులో ఒక్క అక్షరమూ తెలియని పిల్లవాడు పండరీనాథ్‌ ఒక్కడే.

ఎంత పెద్ద పుస్తకమైనా ఒక్క అక్షరంతోనే ప్రారంభమవుతుంది. అలాగే ఏడో తరగతి పరీక్షతో ఇతని జీవితం మొదలైంది. కోయిలకొండలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి ఉన్నతి లభించింది. ఉపాధ్యాయురాలు అరుణ కుమారి ప్రోత్సాహం, బీసీ వసతిగృహం వార్డెన్‌ నర్సింహులు ఆదరణ పండరీనాథ్‌లో ఉత్సాహాన్ని నింపాయి. పండరీ పట్టుదలకు పదో తరగతిలో 452 మార్కులు, ఇంటర్‌ బైపీసీలో 673 మార్కులు వచ్చాయి. కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేసి, పీజీకి కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చేరారు.

గెలవాలనే తపనుంటే... గెలిపించే చేతులు వెన్ను తడతాయి. అలా ప్రొఫెసర్‌ సదానందం రూపంలో అండ దొరికింది. ఆయన పర్యవేక్షణలోనే ప్లాంట్‌ జెనెటిక్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో పీహెచ్‌డీ చేశారు. ‘మేల్‌ స్టెరిలిటీ యూజింగ్‌ సీపీ జీన్‌ ఇన్‌ సోలనేసియస్‌ క్రాప్స్‌’ అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి గాను ఈ నెల 11న వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ అందుకున్నాడు. కృషి ఉంటే పశువుల కాపరి.. పరిశోధనవంతుడు కావొచ్చని నిరూపించాడు.

‘‘పశువులు కాసేవాడిని ఇక్కడిదాకా రావటానికి కారణమైన వాళ్లంతా గుర్తుకువస్తుంటారు. ఉన్నత చదువు కోసం అమెరికాకు వెళ్లాలనుకుంటున్నా. శాస్త్రవేత్తగా రాణించాలన్నదే నా ముందున్న లక్ష్యం. అమ్మానాన్నలు చదువు ప్రాధాన్యం గుర్తించారు. వారిలాగే ప్రతీ తల్లి, తండ్రి ఆలోచిస్తే దేశంలోనే నిరక్షరాస్యతను రూపుమాపవచ్చు.’’
- తిరుపతి పెద్ది, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని