అమ్మ నమ్మకాన్ని గెలిపించాడు

అందరూ నృత్యం వద్దన్నా.. అమ్మ నన్ను ప్రోత్సహించింది. నా ప్రతిభ చూసి నాన్న కూడా అండగా నిలిచారు. ఢీ 10 టైటిల్‌ గెలవడం నా అదృష్టం...

Published : 21 Jul 2018 01:46 IST

అమ్మ నమ్మకాన్ని గెలిపించాడు

అందరూ నృత్యం వద్దన్నా.. అమ్మ నన్ను  ప్రోత్సహించింది. నా ప్రతిభ చూసి నాన్న కూడా అండగా నిలిచారు. ఢీ 10 టైటిల్‌ గెలవడం నా అదృష్టం. చైతన్య, చిట్టి మాస్టర్లు నాకు అందించిన సాయం, ప్రోత్సాహం నా జీవితంలోమరువలేను. సినిమాల్లో డాన్స్‌ మాస్టర్‌గా స్థిరపడాలనేది నా లక్ష్యం.

డాన్స్‌ మనకు కూడుబెడుతుందా?
- మధ్యతరగతి మనిషిగా నాన్న ప్రశ్న.
చదువుకొని ఉద్యోగం చూసుకోక... ఏంట్రా పిచ్చి గంతులు?
- బంధువుల సూటిపోటీ మాటలు.
సరే.. నీకిష్టమైందే చేయ్‌.. గెలువు..
- బిడ్డ మీద మమకారమున్న అమ్మ ప్రేమ.
... 2018 జులై 18... ఈటీవీలో ఢీ-10 ఫైనల్స్‌ డాన్స్‌ కోసమే పుట్టావురా
- శేఖర్‌ మాస్టర్‌ ప్రశంస.
ఒక తప్పులేదు... పర్‌ఫెక్ట్‌గా చేశావ్‌
- ప్రియమణి మెచ్చుకోలు.
హాట్సప్‌.. ఇంతకంటే ఏం చెప్పాలో తెలియడం లేదు
- జూనియర్‌ ఎన్టీఆర్‌ అభినందన

ఢీ-10 విన్నర్‌ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొనకముందు అందరి మాటలు... ఆ తర్వాత అతని తపనకు లభించిన ప్రశంసలవి. రాజుగా సుపరిచితమైన ఈ యువకుడి అసలు పేరు కందిమళ్ల సాకేత్‌ రాజు... ఇతను ఆషామాషిగా ఈ విజయం అందుకోలేదు. అందులో అకుంఠిత దీక్ష ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదముంది. గురువుల ప్రోత్సాహముంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రాజు తండ్రి వెంకటేశ్వర్లు సుతారి మేస్త్రీ, తల్లి పద్మ టైలర్‌. పనుల కోసం 8 ఏళ్ల క్రితం అమ్మానాన్నలు ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి నృత్యమంటే ప్రాణంగా భావించి సాధన చేశాడు. ఎన్నో బహుమతులు గెలిచాడు. ‘భద్రాద్రి బాలోత్సవ్‌’లో పోటీల్లో రెండేళ్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి జిల్లాలోని ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు. 2012లో ఖమ్మంలో రాజు ఇచ్చిన ప్రదర్శనకు డాన్స్‌ మాస్టర్‌ చైతన్య వచ్చారు. రాజులోని ప్రతిభను గుర్తించారు. శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు. ఆయన సూచన మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరి, శిక్షణతో రాటుదేలాడు.

అమ్మే నడిపించింది : చిన్నతనం నుంచే రాజులోని తపనని తల్లి గుర్తించింది. తండ్రి ఓ వైపు వద్దంటున్నా అన్నివిధాల సహకరించింది. ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లమని వెన్నుతట్టింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. అతని ఆసక్తి గమనించి తర్వాత తండ్రి ప్రోత్సహించారు. సంపాదన అంతంతగా ఉన్నా, అద్దె ఇంట్లో కాలం నెట్టుకొస్తున్నా... కుమారుడిని నడిపించారు. దీంతో రాజు సాధనకు తిరుగులేకుండా పోయింది. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని విజేతగా నిలిచేవాడు. అమ్మపెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వచ్చాడు.

నాలుగేళ్ల శ్రమ : 2014లో ఈటీవీ నిర్వహించిన ఢీ జూనియర్స్‌లో చైతన్య మాస్టర్‌ బృందంలో సైడ్‌ డాన్సర్‌గా అవకాశమొచ్చింది. ఎప్పటికప్పుడు తనని మలుచుకుంటూ... ఢీ జూనియర్‌, ఢీ జోడి కార్యక్రమాల్లో సహాయకునిగా ప్రదర్శనలిచ్చాడు. ఢీ10 కోసం నిర్వహించిన ఎంపికల్లో సత్తా చాటి అర్హత సంపాదించాడు. అక్కడ చిట్టీ మాస్టర్‌ ప్రోత్సాహం, శిక్షణతో వారం, వారం తన ప్రతిభను చాటుకుంటూ వచ్చాడు. ప్రదీప్‌, అక్సాఖాన్‌, ముకుల్‌, దర్శిని, తేజస్విని, ఐశ్వర్య వంటి పోటీదారులను దాటుకొని టైటిల్‌ విజేతగా నిలిచాడు.

- వాసిరెడ్డి శ్రీహరి, న్యూస్‌టుడే, ఖమ్మం అర్బన్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని