అలా.. హీరో అయ్యా

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను, నా సినిమా ఆర్‌ఎక్స్‌100ని ఆదరిస్తున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు. వీడెవడ్రా... పిచ్చోడి లెక్కున్నాడు...? అనుకున్నారు కొందరు ఈ సినిమా పోస్టర్‌ చూసినప్పుడు.. వీడికేమైనా మెంటలా? అనుకున్నారు... ట్రైలర్‌ చూసినోళ్లంతా...! వీడిలో ఏదో ఉందిరా... అన్నారు సినిమా చూశాక..! అందుకే ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవడానికి మీ ముందుకొచ్చాను....

Published : 28 Jul 2018 01:34 IST

ఆర్‌ఎక్స్‌100 కార్తికేయ
అలా.. హీరో అయ్యా  

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను, నా సినిమా ఆర్‌ఎక్స్‌100ని ఆదరిస్తున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు.
వీడెవడ్రా... పిచ్చోడి లెక్కున్నాడు...? అనుకున్నారు కొందరు
ఈ సినిమా పోస్టర్‌ చూసినప్పుడు..
వీడికేమైనా మెంటలా? అనుకున్నారు... ట్రైలర్‌ చూసినోళ్లంతా...!
వీడిలో ఏదో ఉందిరా... అన్నారు సినిమా చూశాక..!
అందుకే ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవడానికి మీ ముందుకొచ్చాను.

న్నట్టు మాది మన హైదరాబాదే. వనస్థలిపురంలో మీలాగే సుష్మా, సంపూర్ణ థియేటర్లలో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినోడినే. మా అమ్మ పేరు రజిని. నాన్న విఠల్‌రెడ్డి. వీళ్లిద్దరూ వనస్థలిపురంలో నాగార్జున స్కూల్స్‌ నడుపుతున్నారు.

వారానికో సినిమా చూపిస్తేనే
అందరు తల్లిదండ్రుల్లానే మా అమ్మనాన్నలూ నేను బాగా చదువుకోవాలని, జీవితంలో బాగా స్థిరపడాలని ఆశించారు. నాకేమో సినిమాల పిచ్చి. అంతంత మాత్రంగా చదివేవాడిని. కల్చరల్‌ యాక్టివిటీస్‌లో మాత్రం ముందుండే వాడిని. స్కూల్‌లో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లు ఇచ్చేవాడిని. అద్దం ముందు నిలబడి సినిమా డైలాగులు చెబుతూ హీరోలా ఫీల్‌ అయ్యేవాడిని. మార్కులు తక్కువ వస్తుంటే అమ్మ ఒకరోజు బాగా క్లాస్‌ తీసుకుంది. వారానికి ఒక రోజు సినిమా చూపిస్తే... బాగా చదువుతానని చెప్పాను. అలాగే కచ్చితంగా ప్రతివారం నన్ను సినిమాకు పంపించేవారు. చిన్నప్పుడు చిరంజీవికి ఫ్యాన్‌ని. ‘ఇంద్ర’ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఆయనలా డ్యాన్స్‌ చేయాలని ప్రతివారం అదే సినిమాకు వెళ్లి చూసేవాడిని. స్టెప్పులు ప్రాక్టిస్‌ చేసేవాడిని.

షార్ట్‌ఫిల్మ్స్‌ చేశా..
ఎన్‌ఐటీ వరంగల్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. మా అమ్మ చదివించిన విధానానికీ... ఏ ఐఐటీలోనో టాపర్‌ ర్యాంకర్‌ను కావాల్సిందే. నాకున్న సినిమా పిచ్చి వల్ల ఇలా ఎన్‌ఐటీతో ఆగిపోయాను. అక్కడ చేరాక... జిమ్‌కి వెళ్లడం, డాన్స్‌ క్లబ్‌లో ప్రాక్టిస్‌ చేయడం దినచర్యగా మార్చుకున్నా. మూడో సంవత్సరంలో ఫ్రెండ్స్‌తో కలిసి ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా. ‘ఇట్స్‌ టై టూ సే ఐ లవ్‌ యూ’ దాని పేరు. ఇప్పుడు దాన్ని చూసుకుంటే నవ్వొస్తుంది.

గొంతు పోగొట్టుకున్నా...
ఇంజినీరింగ్‌ అయిన వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. అమ్మ ఒప్పుకోలేదు. నాన్నతో మాట్లాడా.. ‘మీరు చెప్పినట్లు మంచి ఉద్యోగం చూసుకొని సెటిల్‌ అవుతా.. కానీ ఎప్పటికీ నా మనసులో కోరిక తీరలేదనే అసంతృప్తి జీవితాంతం ఉండిపోతుంది. హీరోగా ట్రైచేస్తా..  నావల్ల కాకపోతే... అప్పుడు మీరు చెప్పినట్లు వింటా’ అని చెప్పి వారిని ఒప్పించా. సుబ్బారావు గారని దిల్లీ యాక్టింగ్‌ స్కూల్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌.. ఆయన వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. ఆయన నీ గొంతు బాగాలేదు. మార్చుకోవాలి అన్నారు. గొంతు మార్చుకోవడం ఎలా? అన్నా... ఉన్నది పోగొట్టుకో అన్నారు. రెండువారాలు గట్టిగా అరిచి, అరిచి గొంతు పోగొట్టుకున్నా. అమ్మ చాలా బాధ పడింది. తర్వాత పూరి జగన్నాథ్‌ గారు నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్స్‌ పోటీలో మేం తీసిన ‘నా లైఫ్‌.. .నా ఇష్టం’కు బహుమతి వచ్చింది.

పొట్టిగా ఉన్నా...

నేను 10వ తరగతి వరకూ పొట్టిగా ఉండేవాడిని. హీరో కావాలంటే ఎలా? అనుకునేవాడిని. పొట్టిగా ఉన్న నటులను చూసి వారే నా రోల్‌ మోడల్స్‌ అనుకునేవాడిని. దేవునిదయ వల్ల ఇంటర్‌ సెకండియర్లో బాగా   (6అడుగులు) పెరిగాను. దాంతో కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఇంటర్‌లో పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. డాన్స్‌ ఆగిపోయింది. బాగా లావైపోయాను.

మోసం చేశారు

న్నో ఆడిషన్స్‌కి వెళ్లేవాడిని.. ఇదిగో, అదిగో అంటూ చాలా మంది తిప్పుకొన్నారు. ‘అంతారెడీ... ఓ లక్ష రూపాయలుంటే సినిమా స్టార్ట్‌ అవుతుందంటే తెచ్చి ఇచ్చే వాడిని...తర్వాత షూటింగ్‌ మొదలు కాదు. ఇలా కొందరు మోసం చేశారు. కొన్ని షూటింగ్‌లు మొదలై ఆగిపోయాయి. గతేడాది ‘ప్రేమతో మీ కార్తిక్‌’ అనే సినిమా రిలీజ్‌ అయింది. అది వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియదు.

ఆర్‌ఎక్స్‌ 100 ఇలా..

ర్శకుడు అజయ్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథ రాసుకొని తిరుగుతున్నారు. వేరే స్నేహితుడి ద్వారా నేను ఆయనకు పరిచయం అయ్యా. ఫొటో షూట్‌ చేశాం. డమ్మీ వీడియో తీశాం. అప్పుడు మాకు బాగా నమ్మకం ఏర్పడింది. నా ప్రయత్నాలు చూసి అమ్మానాన్న సహకరించారు. ఎన్నో కష్టాల కోర్చి సినిమా పూర్తిచేశాం. ఇప్పుడు వస్తున్న స్పందన చూసి కష్టమంతా మరిచిపోయా. సినిమా చూసి నాన్న కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. దర్శకులు సుకుమార్‌గారు సినిమాని మెచ్చుకున్నారు. రవితేజగారు ఫోన్‌లో అభినందించారు. నితిన్‌, సునీల్‌... ఇలా చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే.. నేను ఎట్టకేలకు హీరో అయ్యా అని ఆనందంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని