వీరిని గెలిపిద్దాం గురూ!

ప్రత్యుర్థులు ఎందరినైనా గెలుస్తారు... పేదరికాన్ని ఓడించలేకపోతున్నారు. కన్నీటి కష్టాలకు రాటుదేలారు. కరెన్సీ కష్టాలకు తాళలేకున్నారు.

Published : 11 Aug 2018 02:06 IST

వీరిని గెలిపిద్దాం గురూ!

ప్రత్యుర్థులు ఎందరినైనా గెలుస్తారు...
పేదరికాన్ని ఓడించలేకపోతున్నారు.
కన్నీటి కష్టాలకు రాటుదేలారు.
కరెన్సీ కష్టాలకు తాళలేకున్నారు.
కిక్‌బాక్సింగ్‌లో రాణించారు.  కాలం కొట్టే కిక్‌లకు... పడిపోతున్నారు.. కందుల మౌనిక, రాచకొండ సంజీవ్‌.
వీరిద్దరూ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా... ఆర్థిక కష్టాలు పాతాళంలోకి నెడుతుంటే పోరాడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన వీరికి కాస్త ప్రోత్సాహం, ఇంకాస్త భరోసా ఉంటే నిలుస్తారు. గెలుస్తారు.

పొలం అమ్మి... పసిడి గెలిచి..

పోటీలో ఎంతగానైనా పోరాడే మౌనిక... పేదరికాన్ని ఎదుర్కోలేకపోతోంది. బెల్లంపల్లి మండలం లింగాపూర్‌ గ్రామం వీరిది. నాన్న సుదర్శన్‌, అమ్మ హేమలత. వ్యవసాయ కూలీ జీవనాధారం. మౌనికకు చదువుతో పాటు ఆటలంటే ఆసక్తి. ఆ ఇష్టంతో 6వ తరగతిలో నుంచే కరాటే తరగతులకు హాజరయ్యేది. 8వ తరగతి నుంచి కోచ్‌ భరత్‌ శిక్షణలో రాటుదేలింది. ఇంటర్‌ పూర్తయ్యేలోపు రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 18 బంగారు, 2 వెండి పతకాలను సాధించింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన కోచ్‌, 2017 నుంచి కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు. అదే సంవత్సరం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో పసిడి పతకం గెలిచింది. దీంతో రష్యా నుంచి ఆహ్వానం అందింది. ఇక్కడి వెళ్లడానికి పెరిక సంఘం, మరికొంత మంది దాతలు చేసిన సాయం సరిపోలేదు. అక్కడకు వెళ్లాలంటే రూ. 2.50 లక్షలు అవసరం. అంత స్థోమత లేకపోయింది. కూతురు మీద భరోసాతో ఉన్న కొంచెం పొలాన్ని అమ్మి విమానం ఎక్కించారు తల్లిదండ్రులు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెండు వేర్వేరు విభాగాల్లో పసిడి, కాంస్యాలను కైవసం చేసుకుంది. కొండంత ఆశతో స్వదేశానికి వచ్చిన ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. మరో అంతర్జాతీయ వేదికపై ఆడేందుకు ఆహ్వానం అందినా ఈసారి అమ్మేందుకు వారి దగ్గర ఏమీ మిగల్లేదు.

‘‘సరైన ఆదరణ లేక నాలాంటి పేద క్రీడాకారులు ఆటలు వదిలి ఉద్యోగాలు వెతుక్కోవల్సిన పరిస్థితి. తగిన ప్రోత్సాహం ఉంటే మరిన్ని విజయాలు సాధిస్తాను.’’ - కందుల మౌనిక

ఫుల్‌టైం బాక్సింగ్‌... పార్ట్‌టైమ్‌ ఉద్యోగం...

‘‘ఈ ఆట ఆడేవారు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలి. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. సరైన శిక్షణ ఉండాలి. వీటన్నింటికీ డబ్బు అవసరం. ప్రభుత్వం మాలాంటి వారికి చేయూత అందిస్తే బాగుంటుంది.’’ - రాచకొండ సంజీవ్‌

కిక్‌బాక్సింగ్‌లో ఏడు రకాల విభాగాలుంటాయి. అందులో అన్నింటి కన్నా కష్టమైనది ఫుల్‌కాంటాక్ట్‌ రింగ్‌ఫైట్‌. ఇది ఆడటమంటే ప్రాణాలతో చెలగాటమే. అలాంటి కఠినమైన ఆటలో తన సత్తా చూపిస్తూ, తెలంగాణలోనే రింగ్‌ఫైట్‌ చేస్తున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన రాచకొండ సంజీవ్‌. అమ్మానాన్నలు మల్లమ్మ, నానయ్య. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. సంజీవ్‌ చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనేవాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ మీద ఇష్టంతో ఆవుల రాజనర్సయ్య దగ్గర తర్ఫీదు తీసుకున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో 20 బంగారు, 10 వెండి పతకాలను సొంతం చేసుకున్నాడు. ఆటలతో పాటే చదువులోనూ ముందంజలో ఉండే సంజీవ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య పూర్తి చేశాడు. సవాలుతోనే మన సామర్ధ్యం తెలుస్తుందని ముందునుంచి నమ్మేవాడు. ఆ ఆసక్తితోనే 2014 నుంచి కిక్‌బాక్సింగ్‌లోని ఫుల్‌కాంటాక్ట్‌ రింగ్‌ఫైట్‌ వైపు దృష్టి సారించాడు. వేముల సతీష్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకుని 2015లో ప్రైవేటు కంపెనీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలో చేరాడు. నెల నెలా వచ్చే జీతంతోనే పోటీలకు వెళ్లేవాడు. జాతీయ స్థాయిలో పాల్గొని 2 బంగారు, 2 వెండి పతకాలను కైవసం చేసుకున్నాడు. ఆర్థికంగా భారమైనా కొందరి సాయంతో రష్యా వెళ్లి వెండి పతకాన్ని సాధించాడు. మైక్‌టైసన్‌, విజేందర్‌ సింగ్‌ వంటి వాళ్లు ఆడే ప్రొఫెషనల్‌ విభాగంలోనూ ప్రతిభ కనబర్చాడు. రాబోయే ఆసియా, కామన్‌వెల్త్‌ క్రీడలే లక్ష్యంగా ప్రగతినగర్‌లోని ఎఫ్‌99 కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు. ఆర్థిక కష్టాలతో రోజూ యుద్ధం చేస్తున్నాడు.

- పవన్‌ కొప్పర్తి, ఈనాడు జర్నలిజం స్కూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని