ఎందుకొచ్చాన్రా బాబు అనుకున్నా

సినిమా చూడని స్నేహితులకు ఆ కథను కళ్లకు కట్టినట్లు చెప్పిన విద్యార్థి.. కాలేజీకి వచ్చే సరికి కల్చరల్‌ లీడరయ్యాడు...

Published : 18 Aug 2018 01:47 IST

కొత్త కిరణం
ఎందుకొచ్చాన్రా బాబు అనుకున్నా

సినిమా చూడని స్నేహితులకు ఆ కథను కళ్లకు కట్టినట్లు చెప్పిన విద్యార్థి..
కాలేజీకి వచ్చే సరికి కల్చరల్‌ లీడరయ్యాడు..
బ్యాంకు ఉద్యోగం వచ్చినా కాదని... పదేళ్లు సినిమా పరిశ్రమలో తిరిగాడు.
కథలు చెప్పి... చెప్పి... అలసిపోయాడు.
ఇప్పుడు బ్రహ్మాండమైన హిట్‌ చిత్రానికి దర్శకత్వం చేసినా ‘గూఢచారి’గానే ఉండిపోయాడు.
ఎవరంటారా?
అమలాపురం కుర్రాడు తిక్క శశికిరణ్‌. తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమా తీసి మెప్పించిన ఈ యువ దర్శకుడు ‘ఈతరం’తో తన సినీ ప్రస్థానం వివరాలు పంచుకున్నాడు.
మాది అమలాపురం. మా నాన్నగారు తిక్క సూర్యనారాయణ కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. మా బాల్యం పాలకొల్లు, చెన్నయ్‌, హైదరాబాద్‌లో సాగింది. మా స్కూల్‌లో ఎవడైనా ఫలానా సినిమా చూడలేదంటే బ్రేక్‌ టైంలో వాళ్లకు కథ చెప్పేవాడ్ని. కొందరు ఆ సినిమాకి వెళ్లొచ్చి ‘సినిమా బాలేదు. నువ్వు చెప్పే స్టెయిల్‌’ బావుందనేవారు. నేను కథను చెప్పటంలో ఎంజాయ్‌ చేసేవాణ్ణి. ఇలా కథలు చెప్పే సామర్థ్యం మా అమ్మమ్మ, నాన్నమ్మలనుంచే అబ్బింది. విజయవాడ లయోలా కాలేజీలో చదివేప్పుడు నాటకాల్లో పాల్గొనేవాడిని. డైలాగ్స్‌ లేని సీన్లను ముఖాభినయంతో సహా చెప్పేవాడ్ని. దీంతో కాలేజీలో కల్చరల్‌ లీడర్‌ అయ్యాను. మా కాలేజీలోని ఓ ఫంక్షన్‌లో నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్సెలర్‌ నన్ను చూసి ‘సినిమాల్లోకి వెళ్లు. మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారు. దీంతో సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది. ఇంట్లో వాళ్లకోసం ఎంబీఏ చేశా. ఇంటెర్న్‌షిప్‌ చేశాక, ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగావకాశం వచ్చింది. జీతం ఆకర్షించింది. అయితే సినిమాపై ఇష్టంతో ఆ ఉద్యోగం వద్దనుకున్నా.
శేఖర్‌ కమ్ముల శిష్యరికం.. తొలిసారిగా ‘సెవన్‌ డేస్‌ ఇన్‌ స్లోమోషన్‌’ చిత్రానికి ప్రొడక్షన్‌ సూపర్‌ వైజర్‌గా పని చేశా. తర్వాత అమెరికాలోని ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమి’లో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశా. హైదరాబాద్‌ వచ్చాక ‘లీడర్‌’ సినిమాకు శేఖర్‌ కమ్ముల గారి దగ్గర  చేరాను. ‘మహానటి’ చిత్ర దర్శకుడు నాగ్‌అశ్విన్‌ నాతో కలిసి పని చేశాడు. మంచి స్నేహితులమయ్యాం. శేఖర్‌గారి దగ్గరనుంచి టెక్నికల్‌ విషయాలు, మేనేజ్‌మెంట్‌, గట్స్‌ నేర్చుకున్నా. ఆ తర్వాత కొందరు స్నేహితులకు రచనలో సహకారం అందించా. ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలో.. మన కథ ఓకే కావటానికే కాదు.. అయ్యాక బోలెడంత ఓర్పుండాలని నేర్చుకున్నా.

సీరియస్‌గా సినిమా ప్రయత్నాలు మొదలెట్టినపుడు.. కొన్ని కథలు ఓకే అయ్యేవి. తర్వాత వర్కవుట్‌ అయ్యేవి కావు. మరి కొన్ని కథలు ఓకే అయి ఎంచక్కా జీతం ఇచ్చేవారు. ఓ ఆర్నెళ్ల తర్వాత సినిమా ఆగిపోయిందనేవారు. ఆ సమయంలో అసలు ఎంబీఏ చదివి బ్యాంకు ఉద్యోగం వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చానో అనే బాధ వెంటాడేది. స్నేహితులంతా విదేశాల్లో సెటిలయ్యారు. నువ్వేం చేస్తున్నావని అడిగితే సమాధానం ఉండేది కాదు. దీంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా. ఈ విషయాన్ని, నా బాధల్ని నా మిత్రుడు సాగర్‌ చంద్ర (‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్ర దర్శకుడు)కి చెప్పాను. ‘ఓకే అయ్యి.. వెంటనే నువ్వనుకున్నట్లే ఆ ప్రాజెక్టు ముందుకు పోతే.. అంతకంటే చెత్తసినిమా ఉండదన్నాడు. ఇలాంటి వాటివల్ల నీ ఫౌండేషన్‌ స్ట్రాంగ్‌ అవుతుంది. ఇంకా ఇలాంటి కష్టాలు వస్తాయి. ఇన్నేళ్లనుంచీ ఉన్నావు. అసలు ఇండస్ట్రీ వదలొద్దు’ అని ధైర్యం చెప్పాడు.

ఆ మొండిధైర్యమే నడిపించింది.. ‘క్షణం’ చిత్రానికి ముందునుంచే అడవి శేషు, నేను కలిసి ప్రయాణించాం. మేం మంచి స్నేహితులం. ఏ పనిచేసినా నిక్కచ్చిగా ఉండాలనేది మా తాపత్రయం. మొదట రెండు, మూడు కథలు రాసుకున్నాం. అవి నిర్మాతలకు నచ్చలేదు. 2016 ఫిబ్రవరిలో అడవి శేషు హీరోగా నటించిన ‘క్షణం’ సూపర్‌ హిట్‌ అయింది. శేషు తనెప్పుడో రాసుకున్న ఓ ‘సీక్రెట్‌ ఏజెంట్‌’ కథ చెబితే అది నిర్మాతలకు తెగ నచ్చింది. ‘క్షణం’ చిత్రానికి పని చేసిన స్నేహితుడు రాహుల్‌ మాతో కలిసి పనిచేశాడు. కథ రాసుకున్నాక.. మాటల రచయిత అబ్బూరి రవిగారితో కలిసి మరింత లోతుగా చర్చించాం. శేషు దర్శకత్వం వద్దనుకున్నాడు. కథ రాసి, నటించాలకున్నాడు. దర్శకత్వ బాధ్యతలు నన్ను చూడమన్నాడు.
పాతికమందితో షూటింగ్‌.. ‘గూఢచారి’ చిత్రం రాసుకుంటున్నప్పుడే ‘రా’మీద వచ్చిన పుస్తకాలు, వ్యాసాలు చదివాం. గూఢచార సంస్థ ఎలా పని చేస్తుందని పరిశోధన చేశాం. 2016 నవంబర్‌లో ‘గూఢచారి’ షూటింగ్‌ ప్రారంభించి.. 2018 మే వరకూ చేశాం. ఇంత ఆలస్యం కావటానికి ఓ కారణముంది. మామూలుగా ఎంత చిన్న బడ్జెట్‌ మూవీ అయినా 80 మంది పనిచేస్తారు. మా సెట్లో పాతికమందిమే పనిచేశాం. ఒక్కోరు మూడేసి పనులు చేసేవారు. నేను, హీరో అడవిశేషు కూడా కెమెరాలు, స్టాండ్‌బ్యాగ్‌లు మోసుకున్నాం. నాలుగు రోజులయ్యాక అలసిపోయి పడిపోయేవాళ్లం. అప్పుడు బ్రేక్‌ ఇచ్చుకుని ఆ సమయంలో ఎడిటింగ్‌ చేయించేవాళ్లం. రాజమండ్రి ఎపిసోడ్‌ చేస్తున్నప్పుడు హీరో శేషుతో పాటు కెమెరామన్‌, ఎడిటర్‌ మా ఇంట్లోనే ఉన్నారు. లోబడ్జెట్‌ చిత్రం కాబట్టి కనీసం టూస్టార్‌ హోటల్‌లోనూ తీసుకోలేదు. రాజమండ్రిలో ఉండే ఓ త్రీ బెడ్‌రూమ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో మా అసిస్టెంట్‌్్స ఉండేవారు. తక్కువ బడ్జెట్‌లో తీయటం పెద్ద ఛాలెంజ్‌. మా ఇంట్లోని, మా అసిస్టెంట్స్‌ తీసుకొచ్చిన వస్తువులనే సినిమాలో ప్రాపర్టీస్‌గా వాడాం. అంతెందుకూ మా కథానాయిక శోభిత తన సొంత దుస్తులు ఇంటిదగ్గర నుంచి షూటింగ్‌కి తెచ్చుకుంది. ఇలా ఎవరికి వారు కెమెరా వెనకాల డబ్బులు వృథా ఎందుకనుకున్నారు. కెమెరా ముందు పద్ధతిగా ఖర్చుపెట్టాలనే ఆలోచనతోనే పనిచేశారు. లోబడ్జెట్‌ కావడంతో ఈ సినిమాకు రెండేళ్లు పట్టింది.
అదే నా కల.. హ్యూమన్‌ ఎమోషన్స్‌ను బాగా తెరకెక్కించడం నాకిష్టం. యాక్షన్‌ చిత్రాలతో పాటు కుటుంబ, ప్రేమకథలు తెరకెక్కించాలనుంది. ఇండో, బ్రిటీష్‌ నేపథ్యంలో ఉండే ఓ కథను చేద్దామనుకున్నా. దర్శకత్వంలో మరింత రాటుదేలాక ఆ చిత్రం చేయాలన్నదే నా కల.

- రాళ్లపల్లి రాజావలి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని