అలా... తనతో ప్రేమలో పడ్డా

‘నాన్న..! చూడగానే తెలిసిపోయింది... తను లేకపోతే చచ్చిపోతానని’... అంటూ ‘అందాల రాక్షసి’లో గమ్మత్తుగా మాట్లాడి అమ్మాయిలను ప్రేమతో కట్టిపడేశాడు...

Published : 25 Aug 2018 01:36 IST

అలా... తనతో ప్రేమలో పడ్డా

‘నాన్న..! చూడగానే తెలిసిపోయింది... తను లేకపోతే చచ్చిపోతానని’... అంటూ ‘అందాల రాక్షసి’లో గమ్మత్తుగా మాట్లాడి అమ్మాయిలను ప్రేమతో కట్టిపడేశాడు...
- అప్పుడు నటుడు
‘ప్రతీఒక్కడికీ కత్రినాకైఫే కావాలి...బట్‌ ఎవడూ రణ్‌బీర్‌లా ఉండడు’... అంటూ చి।।ల।।సౌ।।లో అమ్మాయిల మనసులోని మాటను బయటికి చెప్పించి మెప్పించాడు.
ఇప్పుడు దర్శకుడు...
ఇంతకీ ఎవరంటారా?
అదేనండి రాహుల్‌ రవీంద్రన్‌. నటన నుంచి దర్శకత్వానికి ఎందుకొచ్చాడు? తన ప్రేమ? పెళ్లి... ఇలా కబుర్లెన్నో చెప్పాడు. చదివేయండి...

మా నాన్న వ్యాపారవేత్త. మా అమ్మ గృహిణి. పుట్టి పెరిగింది చెన్నైలో. తొమ్మిదో తరగతి నుంచే సినిమాల్లోకి రావాలనే ఆశ ఉండేది. మా అమ్మకి ఫైన్‌ ఆర్ట్స్‌ అంటే ఇష్టం. ఆమె సింగర్‌, వీణ వాయిస్తారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ కూడా. మా అమ్మ కొత్త లాంగ్వేజ్‌ త్వరగా నేర్చుకుంటుంది. నేనూ అంతే. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం, గుజరాతీ భాషలొచ్చు. మా అమ్మ చిన్నపుడు నటిస్తూ కథలు చెప్పేది. అలా ఊహాశక్తి పెరిగింది. కామర్స్‌లో డిగ్రీ చదివాక అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశా.

నా వ్యక్తిత్వాన్ని మార్చేసింది..  ఎంబీఏ చేశాక ముంబైలో ఓ మీడియా కంపెనీకి మార్కెటింగ్‌లో అసిస్టెంట్‌ బ్రాండ్‌ మేనేజర్‌గా పని చేశాను. అది వదిలేసి దర్శకత్వం చేద్దామని వచ్చాను. నటుడిగా అవకాశం వచ్చింది. దర్శకుల దగ్గర ఫిల్మ్‌ మేకింగ్‌ నేర్చుకోవచ్చని సరేనన్నా. డబ్బులు సంపాదించి, పరిచయాలతో దర్శకుడిని అవ్వాలనుకున్నా. నటుడిగా నిలదొక్కుకోవటానికి మంచి కథలు చేయాలి. ఒక్కోసారి మన దగ్గరికి మంచి కథలొచ్చినా నిర్మాతలు దొరకటం కష్టం. కొన్ని కథలు చూశాక.. దర్శకుడిపై నమ్మకంతో సంతకం చేస్తాం. దర్శకుడు చెప్పినంతగా లేదనే విషయం షూటింగ్‌లో రెండోరోజే అనిపిస్తుంది. అయినా భరించి చేయాల్సిందే.  ఇవన్నీ పక్కనబెడితే.. నటనతో నా వ్యక్తిత్వం మెరుగుపడింది.

నా అందాల రాక్షసి... చిన్మయి: నేను హీరోగా నటించిన ‘అందాలరాక్షసి’ చిత్రంలో కథానాయిక పాత్రకు చిన్మయి డబ్బింగ్‌ చెప్పింది. చెన్నైలో ఆ చిత్ర ప్రదర్శన సమయంలో తనని కలిశాను. మా ఇద్దరికీ ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదేంటంటే పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌, సైన్స్‌, మైథాలజీ.. ఇలా ఏ సబ్జెక్టునయినా మాట్లాడుకుంటాం. అలా తనతో స్నేహం పెరిగాక ఒక్కో విషయంపై మూడు, నాలుగు గంటలు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. హోదాను బట్టి కాకుండా తను అందరితో బాగా మాట్లాడుతుంది. సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉంది. సొంతంగా ఆలోచిస్తుంది. మానసిక బలం, సామాజిక అవగాహన.. ఇలా నేను కోరుకున్న లక్షణాలు చిన్మయిలో ఉన్నాయి. దీంతో తనతో ప్రేమలో పడ్డాను. ప్రపోజ్‌ చేశాను. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఏదైనా ఓ పాట గుర్తొస్తే ఉదయం నుంచీ పాడుతుంటా. ‘ఈ రోజు నాకు రికార్డింగ్‌ ఉంది. నీ  పాట వింటే సంగీతం మర్చిపోతాను’ అంటూ ఆట పట్టిస్తుంది. తన యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం ‘లా లా ల్యాండ్‌’ పాటను నాతో పాడించింది చిన్మయి. ‘అమృత’ చిత్రంలో ‘ఏ దేవి వరము నీవో....’ అనే ఓ అమ్మ పాటను పదిహేనేళ్ల వయసులో చిన్మయి పాడింది. ఆ పాటంటే నాకెంతో ఇష్టం.

అలా కథ పుట్టింది : దాదాపు పదేళ్లక్రితం నా స్నేహితుడి జీవితంలో ఓ సంఘటన జరిగింది. అది ఇంకోలా జరిగి ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో రెండుపాత్రలతో ఓ కథ రాసుకున్నా. లఘుచిత్రం తీద్దామనుకున్నా. ఈ కథ చెప్పినపుడు ‘ఇంటర్వెల్‌ వరకూ చెబితే ఎలా? తర్వాత ఏమైంద’ని ఆసక్తిగా అడిగేవారు. దీంతో ఆ కథపై దృష్టి పెట్టాను. అలా ఎనిమిదేళ్ల క్రితమే చి।।ల।।సౌ।। కథ పూర్తయ్యింది. మా ఆవిడ చిన్మయికి ఈ కథ చెప్పినపుడు తనకెంతో నచ్చింది. సమంతా, చైతూ ఓకే అన్నాక సుశాంత్‌కి స్టోరీ వినిపించాను. నిర్మాతలు ఓకే అనటంతో 32 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం.

నటన... దర్శకత్వం  నటుడిగా తెలుగులో ఎనిమిది చిత్రాలు, తమిళంలో మూడు చిత్రాలు చేశాను. ఇప్పటికీ నా తొలి తెలుగు చిత్రం ‘అందాల రాక్షసి’ హీరోగానే గుర్తుపడతారు. హీరోగా నటించటం వల్ల హీరోలతో ఎలా దర్శకుడు మాట్లాడాలో తెలిసొచ్చింది (నవ్వులు). నటిస్తూనే దర్శకత్వం వైపు దృష్టి పెడతా.

సమంత, నేను ‘మాస్కోవిన్‌ కావేరీ’ అనే తమిళ చిత్రంలో తొలిసారి నటించాం. మా ఇద్దరికీ అదే తొలిచిత్రం. అప్పటినుంచే ఆమె నాకు స్నేహితురాలు. అడవి శేషు, వెన్నెల కిషోర్‌ మంచి మిత్రులు.

-  రాళ్లపల్లి రాజావలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని