పంట పొలంలో ‘ప్రణవ్‌’ నాదం

పొలం దున్నడానికి యాప్‌లో ట్రాక్టర్‌ను బుక్‌ చేసుకుంటే... ఓ చిన్ని యంత్రంతో భూసారం క్షణంలో తెలిసిపోతే.. ఆకును సెల్‌లో ఫొటోతీసి పంపితే.. తెగులు ఏంటో... ఏ మందు పిచికారి చేయాలో మెసేజ్‌ వస్తే.. అబ్బా... కర్షకుల పంట పండిపోదూ! పంటే కాదు... అన్నదాతల కనులపంటకూ కారణమవుతోంది ‘మేకర్స్‌ హైవ్‌’. సాగుకు రుణం ఇప్పించే దగ్గరి నుంచి పంటకు గిట్టుబాటు ధర కల్పించే...

Published : 01 Sep 2018 01:40 IST

పంట పొలంలో ‘ప్రణవ్‌’ నాదం

పొలం దున్నడానికి యాప్‌లో ట్రాక్టర్‌ను బుక్‌ చేసుకుంటే... ఓ చిన్ని యంత్రంతో భూసారం క్షణంలో తెలిసిపోతే..
ఆకును సెల్‌లో ఫొటోతీసి పంపితే.. తెగులు ఏంటో... ఏ మందు పిచికారి చేయాలో మెసేజ్‌ వస్తే..
అబ్బా... కర్షకుల పంట పండిపోదూ!
పంటే కాదు... అన్నదాతల కనులపంటకూ కారణమవుతోంది ‘మేకర్స్‌ హైవ్‌’. సాగుకు రుణం ఇప్పించే దగ్గరి నుంచి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకూ తమ సేవలు అందించాలని తపిస్తోంది ఈ సంస్థ. ఒక సరికొత్త కార్యాలయ సంస్కృతితో అందరినీ ఆకట్టుకుంటోంది. బీఎస్సీ చదివిన ఇరవై నాలుగేళ్ల వెంపటి వెంకట శివ ప్రణవ్‌ కుమార్‌ ఈ సంస్థకి కర్త, కర్మ, క్రియ. మన మెదళ్లతో ఇతర దేశాలను అభివృద్ధి చేయటం కంటే మన సామాజిక సమస్యలను నిర్మూలించటమే మా లక్ష్యమనే ప్రణవ్‌ ప్రయాణమిది.

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉండే ‘మేకర్స్‌ హైవ్‌’(సృష్టికర్తల తొట్టె) గేటు తీసి లోపలికి వెళ్తూనే.. మూడు కుక్కపిల్లలు వచ్చి పలకరించాయి. లోపల సరదాగా జోకులేసుకుంటూ కొందరు కాఫీ తాగుతున్నారు. మొదటి అంతస్తులో కుక్కపిల్లలతో ఆడుకుంటున్నారు. రెండో అంతస్తులో డ్రోన్లు, త్రీడీ ప్రింటర్‌ మధ్య రోబో టెక్నాలజీపై సీరియస్‌గా పనిచేస్తున్నారు మరికొందరు. కాస్త పక్కనే ఓ కుర్రోడు తొండకు ఆహారం పెడుతున్నాడు. ‘అదిగదిగో అక్కడ ఉండే ఎర్రటి తొండ పేరు ‘రెడ్‌గారు’.. మిగతా రెండింటి పేరు.. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రీన్‌’ అంటూ ‘మేకర్స్‌ హైవ్‌’ సంస్థ సీఈఓ ప్రణవ్‌ మాట్లాడారు. ఇది పెట్‌ ఫ్రెండ్లీ ఆఫీసు. ఉద్యోగులెవరైనా వాళ్ల పెంపుడు జంతువులను తీసుకురావచ్చు. ఎంచక్కా వాటితో ఆడుకోవచ్చు. ఉద్యోగులు ముంబై, పుణె, దిల్లీ... లాంటి ప్రాంతాల నుంచి వచ్చినవారు. ‘మేకర్స్‌ హైవ్‌’లో బాసిజం లేదు. సెక్యూరిటీ, పనిమనిషి కూడా ఓ మంచి పనిలో భాగమయ్యామని గర్వంగా ఫీలవుతారు. కొత్తకల్చర్‌తో పని చేస్తున్న ఈ సంస్థ ఆఫీసులా ఏ కోశానా కనపడదు. ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది.

అలా ఈ ఆలోచన పుట్టింది..
బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదివిన ప్రణవ్‌కి అబ్దుల్‌కలాం అంటే ఇష్టం. ఆయనోసారి ‘మనం వస్తువులను ఇతరదేశాలకు ఎగుమతి చేసినట్లు మెదళ్లనూ ఎగుమతి చేస్తున్నా’మని వాపోయారు. ఆ మాటవినటమే ఈ ఆలోచనకి బీజమంటారు ప్రణవ్‌. విదేశాల్లో డబ్బు, సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుంది. అందుకే మనం అటువైపు వెళ్తాం. అయితే ప్రణవ్‌ ఏనాడూ అలా అనుకోలేదు. కన్నభూమికి ఏదోటి చేయాలనుకున్నాడు. టీసీఎస్‌లో ఆర్‌ అండ్‌ డీ డిపార్ట్‌మెంట్‌లో అగ్రికల్చర్‌ డ్రోన్లపై పనిచేస్తున్నప్పుడు ప్రణవ్‌ తన ఆలోచనలను హరితవిప్లవ నిర్మాత ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌తో పంచుకున్నారు. ఆలోచనలు నచ్చటంతో ఆయన వెన్నంటే నిలబడ్డారు. దీంతో అమెరికాకు వెళ్లి ఎమ్మెస్‌ చేయటం కంటే ఇక్కడే ఉండి ఇన్నోవేషన్‌ వర్క్‌ చేయాలనుకున్నాడు ప్రణవ్‌.

రైతు కళ్లలో ఆనందంకోసం..
ప్రణవ్‌ ఉద్యోగం చేస్తూనే సంస్థ స్థాపనకు రెండున్నరేళ్లు శ్రమించాడు. పుస్తకాలు చదివాడు. గొప్ప వ్యక్తులను కలిశాడు. ఉద్యోగం, కలను నెరవేర్చుకోవాలనే తపనతో నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు. తన ఆలోచన చాలామందికి అర్థమయ్యేది కాదు. తల్లిదండ్రులకు కొడుకు ఆలోచన నచ్చి ప్రోత్సహించారు. దీంతో ఎలాంటి విమర్శలనూ పట్టించుకోలేదు. సరికొత్త కల్చర్‌ ఉన్న ఆఫీస్‌ను నెలకొల్పటానికి పెట్టుబడిదారుల వెంట తిరిగాడు. ఆర్నెళ్ల క్రితం అతనికి మంచి ఆలోచనా దృక్ఫథం ఉండే ఇన్వెస్టర్లు దొరికారు. అలా నాలుగునెలల క్రితం ‘మేకర్స్‌ హైవ్‌’ ప్రారంభించాడు.

* సమాజంలోని సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించటమే ఈ సంస్థ ఉద్దేశం. ‘రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల.. ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌గారి హరితవిప్లవం విమర్శలకు గురైంది. అందుకే మేం ‘ఎవర్‌గ్రీన్‌ రివల్యూషన్‌’ అనే ఆలోచనతో ముందుకొచ్చాం. ఆయనే మా సలహాదారులు’ అని ప్రణవ్‌ చెప్పుకొచ్చాడు. రైతు విత్తనం నాటే దశనుంచి పంట అమ్మేవరకూ దాదాపు పదమూడు దశల్లో రైతుకి తోడుగా నిలుస్తారు. పంటకి రుణం ఇప్పించటంతో పాటు, నాణ్యమైన విత్తనాలు ఇప్పిస్తారు. నేలస్వభావం, నీటిపారుదల, దగ్గరలో ఉండే మార్కెట్ల ఆధారంగా ఎలాంటి పంట వేయాలనే విషయాలు చెబుతారు. విత్తనాలు వేశాక.. పంటబీమాను చేయిస్తారు. దీనివల్ల పురుగుకొట్టడమో, ప్రకృతి విధ్వంసమో జరిగితే తిరిగి రైతు డబ్బులను పొందుతాడు. ఉబర్‌ స్టార్టప్‌లాగే.. రైతుల దగ్గర ఉండే ట్రాక్టర్లకోసం ఓ యాప్‌ను తయారు చేస్తున్నారు. ఆ యాప్‌తో పొలం పనులకోసం ట్రాక్టరును బుక్‌ చేసుకోవచ్చు. ఇలా రైతు కళ్లలో ఆనందం చూడటం కోసమే ‘మేకర్స్‌ హైవ్‌’ సంస్థ పని చేస్తుంది. చివరిగా పంట చేతికి వచ్చాక దళారీ లేకుండా డైరెక్ట్‌గా రైతుకు లాభం వచ్చేట్లు మార్కెట్లో అమ్మిస్తారు వీళ్లు.

టెక్నాలజీతో గ్రామాలు సస్యశ్యామలం చేయటానికి..
వ్యవసాయానికి కావాల్సిన టెక్నాలజీని అందించటమే ‘మేకర్స్‌ హైవ్‌’ పని. వీళ్లు తయారు చేసిన ‘సోలార్‌ పవర్‌ వెదర్‌ స్టేషన్‌’తో వాతావరణం కచ్చితంగా తెల్సుకోవచ్చు. చేనుకోసం వీళ్లు ఓ కిట్‌ను రూపొందించారు. సూర్యకాంతితో నడిచే ఈ సాయిల్‌ మానిటరింగ్‌ పరికరం ఐఓటీ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. దీన్ని చేలో పెడితే చాలు.. ఆ నేల స్వభావం, నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాషియం..శాతాలు కేవలం నిమిషంలో తెలుస్తాయి. ‘శాటిలైట్ డేటా రైతులకు అందాలంటే ఖర్చు ఎక్కువ. అందుకే మేం శాటిలైట్‌ మీద ఉండే మల్టీ స్పెక్ట్రల్‌ కెమెరా, సెన్సర్లు, థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరాలను డ్రోన్ల మీద అటాచ్‌ చేస్తున్నాం. డ్రోన్లను కూడా మేమే తయారు చేసుకున్నాం’ అంటారు ప్రణవ్‌. చేనులో పంటతెగులు రైతు గుర్తించే నాటికి అప్పటికే 70శాతం పంట నాశనమై ఉంటుంది. అందుకే రైతు గుడ్డిగా ఆరో రోజు ఫలానా మందు, నెలరోజుల్లో మరో మందు పిచికారి చేస్తున్నాడు. అవసరం ఉందో లేదో తెలీదతనికి. ‘మా డ్రోన్లలోని మల్టీస్ప్రెక్ట్రమ్‌లోని ఐఆర్‌ టెక్నాలజీ వల్ల పదిరోజుల ముందుగానే పంట సమస్య బయటపడుతుంది. దీని వల్ల రైతు అవసరం ఉన్నచోటే పురుగుమందు వాడతాడు. ఇవేవీ తెలీవని రైతు అంటే.. ఒక్క స్మార్ట్‌ఫోన్‌ తీసుకుని మొక్క ఆకుల్ని ఫొటోతీసి మాకు పంపిస్తే చాలు. వాటికుండే వ్యాధిని చెబుతాం’ అంటారు ప్రణవ్‌. ఈ సంస్థ ఉద్యోగులు చెన్నయ్‌ దగ్గర ఉండే పది పల్లెలను ఎంపిక చేసుకుని త్వరలో పరీక్షలు చేయనున్నారు. భవిష్యత్తులో సెమీ మెకనైజేషన్‌ టూల్స్‌ను రైతు సులువుగా ఉపయోగించే విధంగా తయారు చేస్తోందీ సంస్థ. ఓ పల్లెలోని రైతులంతా కలిసి టెక్నాలజీ కిట్స్‌ను కొంటే చాలు. అందరూ వాడుకోవచ్చు.

‘మేకర్స్‌ హైవ్‌’ సంస్థ అగ్‌మెంటెడ్‌ రియాలిటీ వర్క్‌ ప్రాజెక్ట్‌ చేస్తోంది. ఇదేంటంటే ఓ మనిషి ఓ స్టూడియోలో 140 కెమెరాల మధ్య మాట్లాడతాడు. అన్ని కోణాల్లో డెప్త్‌గా వీడియో షూట్‌ చేస్తారు. ఆ మనిషి మన ఇంట్లో మనమధ్య మాట్లాడినట్లు కనిపిస్తాడు. ఈ టెక్నాలజీని వచ్చే ఎన్నికల్లో వాడేందుకు ఈ సంస్థ సన్నాహమవుతోంది. రాజకీయ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లందరితో మాట్లాడటం కుదరదు. ఈ టెక్నాలజీతో వాళ్లు జనాలను ఆకట్టుకుంటారు.

ఆలోచిస్తే చాలు చేయి పని చేస్తుంది..
మేకర్స్‌ హైవ్‌ సంస్థ ఆరోగ్యరంగంలోనూ కృషి చేస్తోంది. వికలాంగులు, ప్రమాదాల బారినపడిన వారికి ఫుల్లీ ఫంక్షనల్‌ రోబోటిక్‌ హ్యాండ్‌ తయారు చేశారు. ప్రతి చేయి ఒక్కోరకంగా ఉంటుంది. భుజం కండరానికి ఈ రోబో హ్యాండ్‌ను సెట్‌ చేస్తే అందులో ఉండే కండరాలను బట్టి కదులుతుంది. ఒకవేళ భుజం కండరాలు పని చేయకుంటే.. బ్రెయిన్‌ కంట్రోల్డ్‌ సిస్టమ్‌ తయారు చేశారు. ఇదెలా పని చేస్తుందంటే.. మనసులో చేయి ఇలా కదలాలనుకుంటే చాలు.. అలాగే అది పని చేస్తుంది. భవిష్యత్తులో పక్షవాతం ఉండేవారికోసం వీళ్లు చైర్‌ చేయటానికి పరిశోధన చేస్తున్నారు. పక్షవాతం ఉండే మనిషి మనసులో అనుకుంటే చాలు.. ఆ తరంగాల ఆధారంగా వీల్‌ చైర్‌ కదులుతుంది. ‘ప్రోస్థటిక్‌ హ్యాండ్‌ను పరీక్షించేప్పుడు ఆ వ్యక్తుల కళ్లల్లోంచి వచ్చే ఆనందభాష్పాలే మాకు స్ఫూర్తి. అవే మమ్మల్ని నడిపిస్తాయి’ అంటారు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన నిపుణులు.

అదే మా కల..

‘మేకర్స్‌ హైవ్‌’ సంస్థ బతకటానికి డబ్బు కావాలి. అయితే డబ్బే సర్వస్వం దీని సిద్ధాంతం కాదు. సమాజానికి ఏదో చేయాలనే తపన ఇక్కడి వాళ్లది. నలుగురితో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ రోబో ప్రాజెక్టులో నేను ప్రారంభం నుంచే పనిచేస్తున్నా. ఈ అవగాహనతోనే ఓ రోబోను మేం తయారు చేస్తున్నాం. ఇది వచ్చే ఏడాది మా సంస్థ గురించి చెప్పే గైడ్‌ అవుతుంది. మా ఆఫీసులో పాతికమంది ఉద్యోగులు పని చేస్తారు. వీళ్లు మకావ్స్‌, చిలుకలతోనూ ఆఫీసుకి వస్తారు. దేశంలోనే సరికొత్త క్రియేటివ్‌ కల్చర్‌ వేదిక ఇది. వీళ్లే సొంతంగా పెన్సిల్స్‌, టేబుల్స్‌, గార్డెన్‌ను తయారు చేసుకున్నారు. విసిరేసిన వాహన విడిభాగాలతో కళారూపాల్ని తయారు చేస్తారిక్కడ. వీళ్లంతా చిన్నచిన్న పనుల్నీ, అందమైన క్షణాలను అద్భుతంగా గడిపే స్వభావమున్నవాళ్లు. నైన్‌ టు ఫైవ్‌ ఆఫీసు వీళ్లకు నచ్చదు. మేం ప్రతివారాంతం హ్యాకథాన్‌ చేస్తాం. ఆ రోజు పనిచేయం. ఐడియాలను షేర్‌ చేసుకుంటాం. సమస్యల గురించి చర్చిస్తామంతే. వచ్చే పదేళ్లలో ఇక్కడ రెండువేల మంది పని చేయాలి. టెక్నాలజీ సృష్టికర్తల ఊరులా నా ఆఫీసు కావాలి. వాళ్లంతా ఏదో సమస్యను తీసుకుని పనిచేసి పరిష్కారం చూపించాలన్నదే నా కల.

- వెంపటి ప్రణవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని