డీజే.. దివ్యాంగ జాకీ

దిల్లీలో అదో పేరుమోసిన అయిదు నక్షత్రాల హోటల్‌. అందులో ఓ నైట్‌ క్లబ్‌. చీకటి వెలుగుల కలయికతో గోడల నిండా కనువిందైన చిత్రాలు.

Published : 15 Sep 2018 02:04 IST

డీజే.. దివ్యాంగ జాకీ

దిల్లీలో అదో పేరుమోసిన అయిదు నక్షత్రాల హోటల్‌. అందులో ఓ నైట్‌ క్లబ్‌. చీకటి వెలుగుల కలయికతో గోడల నిండా కనువిందైన చిత్రాలు.
అందరూ తలలూపుతూ.. ఊగుతూ నృత్యం చేసేలా వినవస్తున్న సంగీతం.. హృదయాలను మీటుతున్న ఆ సంగీతాన్ని అందిస్తున్నది 28 ఏళ్ల యువకుడు.
పెద్ద గడ్డం, జబ్బలపై టాటూ, నెత్తిన టోపీ, చెవుల్లో హెడ్‌ఫోన్స్‌తో ఈ తరం యువతకు అతనో ప్రతీక.
ఇంకొంచెం ముందుకెళ్లి చూస్తే కొద్ది సేపు మీ మెదడు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే.. వైవిధ్యమైన డీజేయింగ్‌తో అందరి కాళ్లూ కదిలించే ఆ యువకుడు కాళ్లు కదపలేడు. అతను కూర్చున్నది ఓ వీల్‌చైర్‌లో. అవును భారత్‌లోనే తొలి దివ్యాంగ డీజే అతడు. పేరు వరుణ్‌ ఖుల్లార్‌. కాళ్లు ఎలా పోయాయి.. సంగీతం తనని ఇలా నడిపించిందన్న విషయాలను ‘ఈతరం’తో పంచుకున్నాడు.

చిన్నప్పటి నుంచీ వరుణ్‌కు సంగీతం అంటే ఇష్టం. ఏవైనా సమస్యలున్నపుడు మరింతగా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయేవాడు. ఎలా సంగీతాన్ని సృష్టించాలన్నది తెలుసుకుంటూ ఉండేవాడు. డిగ్రీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ డీజే కావాలనే కలలు కనేవాడు. ఓ ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుందని.. అపుడు ఈ సంగీతమే తనని నిలబెడుతుందని తెలియదు.

రెండేళ్లు.. నాలుగు గోడల మధ్యలో.. నాలుగేళ్ల కిందట.. జూన్‌ 7, 2014. ఆ రోజు కొత్త జీవితం ప్రారంభమైందంటాడు వరుణ్‌. ఎందుకంటే.. స్నేహితులతో కలిసి మనాలికి వెళుతుంటే పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మిగతా వారంతా గాయాలతో బయటపడగా.. వరుణ్‌ ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పాలి. చికిత్స సమయంలో ‘ఎస్‌సీఐ పేషెంట్‌’గా ప్రకటించారు. అంటే నడుము కింది భాగం చచ్చుపడిపోయిన మనిషన్నమాట. మెలకువ వచ్చిన వెంటనే ఇక జన్మలో నడవలేను అని అతనికి తెలిసింది. తొలుత నమ్మలేదు. అమ్మ కన్నీటి ధార చూశాక ఆ విషయం అర్థమైందని చెబుతాడు వరుణ్‌. ఆ సమయంలోనే గట్టిగా అనుకున్నాడు. ప్రతికూల భావనలు మనసులోకి రానివ్వకూడదని. అయితే రెండేళ్ల పాటు నాలుగు గోడల మధ్య ఉండాల్సి వచ్చింది. ఫిజియోథెరపీకి ఆసుపత్రికి వెళ్లి వచ్చేవాడు.

ల్యాప్‌టాప్‌, హెడ్‌ఫోన్సే స్నేహితులుగా.. అమిటీ యూనివర్సిటీలో మాస్‌ కమ్యూనికేషన్స్‌ చేసే సమయంలోనే డీజే కావాలనుకున్నాడు. సౌండ్స్‌ ఆఫ్‌ సోల్‌ అనే డీజే స్కూల్‌లో చేరాడు కూడా. కానీ ప్రమాదంతో అతని సంగీత ప్రపంచం రెండేళ్ల పాటు మూగవోయింది. గాయాలు నయమయ్యాక.. డీజే ఎలా కావాలో పరిశోధించసాగాడు. తనలాంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కారులో డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. ఇక మిగిలింది డీజే క్లాసులకు వెళ్లడమే. అయితే కొన్ని సంస్థలు అతని పరిస్థితిని చూసి అంగీకరించలేదు. చివరకు ఐఎల్‌ఎమ్‌ అకాడమీ అతనికి అవకాశం ఇచ్చింది. అంతక్రితం నేర్చుకోని పాఠాలన్నిటినీ ఒంటబట్టించుకున్నాడు. మూడేళ్ల పాటు మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ నేర్చుకున్నాడు. డీజేయింగ్‌ కోర్సు పూర్తి చేశాడు. నాలుగు గోడల మధ్య ల్యాప్‌టాప్‌, హెడ్‌ఫోన్స్‌ను స్నేహితులుగా చేసుకున్నాడు. పుస్తకాలను చదివాడు. యూట్యూబ్‌లో తనకు అవసరమయ్యే ప్రతీ సమాచారాన్ని తెలుసుకున్నాడు.

అదే మలుపు తిప్పింది ఇదంతా సరే... డీజేగా అవకాశాలు ఎవరు ఇస్తారు. మళ్లీ వేట మొదలైంది. ఏదైనా వైకల్యం ఉన్నవాళ్లను ఈ ప్రపంచం వేరేలా చూస్తుందంటాడు వరుణ్‌. అయితే తన చక్రాల కుర్చీని చూసి కాకుండా.. తన నైపుణ్యాన్ని చూసి అవకాశం ఇవ్వాలని కోరుకున్నాడు. అపుడే లలిత్‌ గ్రూప్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేశవ్‌ సూరికి ఇతని ప్రతిభ నచ్చింది. దిల్లీలోని కనాట్‌ ప్లేస్‌లో ఉన్న అయిదు నక్షత్రాల హోటల్‌ ‘ద లలిత్‌’ లో ఉన్న ‘కిట్టీ సు’ నైట్‌ క్లబ్‌లో రెసిడెంట్‌ డీజేగా అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.

మనల్ని.. మనం అంగీకరిస్తేనే..

‘‘అందరికీ ఎవరో ఒకరు స్ఫూర్తిగా ఉంటారు. అయితే వారిని పూర్తిగా అనుసరిస్తేనే ఫలితం ఉంటుంది. నా విషయంలో సర్‌ పాల్‌ జాన్సన్‌ను నమ్మాను. ప్రపంచంలోనే తొలి వీల్‌ఛెయిర్‌ డీజే జాన్సన్‌ కాగా.. ప్రపంచంలోనే రెండో వీల్‌ఛెయిర్‌ డీజే, దేశంలోనే తొలి వీల్‌ఛెయిర్‌ డీజేగా నేనయ్యాను. మన పరిస్థితిని మనం అంగీకరిస్తేనే.. ఇతరులూ అంగీకరిస్తారు.’’

దిల్లీలోని ‘కిట్టీ సు’ నైట్‌ క్లబ్‌లో ప్రతీ శుక్ర, శని వారాల్లో  డీజేయింగ్‌ చేస్తూ కనిపిస్తాడు వరుణ్‌.  కిట్టీ సు ఇచ్చిన ప్రోత్సాహంతోనే గతేడాది గోవాలో జరిగిన టైమ్‌అవుట్‌ 72లో అంతర్జాతీయ సంగీత కళాకారులైన విజ్‌ ఖలీఫా, మార్టిన్‌ గారిక్స్‌తో కలిసి ప్రేక్షకుల్ని అలరించారు. ఇక ప్రఖ్యాత మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ అయిన గ్రీష్మ్‌ ఉత్సవ్‌, సోషియల్‌ స్పేసెస్‌లలో పాల్గొన్నాడు.

- బెజవాడ వెంకటేశ్వర్లు, బిజినెస్‌ డెస్క్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు