తండ్రి కల... తనయుడి కళ

ఓ తండ్రి కలగన్నాడు... తాను అనుకున్నది తన కొడుకు సాధించాలని తపనపడ్డాడు. తన తాహతుకు మించి లండన్‌కు పంపి సంగీత సాధన చేయించాడు...

Published : 22 Sep 2018 02:07 IST

తండ్రి కల... తనయుడి కళ

ఓ తండ్రి కలగన్నాడు... తాను అనుకున్నది తన కొడుకు సాధించాలని తపనపడ్డాడు. తన తాహతుకు మించి లండన్‌కు పంపి సంగీత సాధన చేయించాడు...
ఆ కొడుకు తండ్రి కలను తనదిగా భావించాడు. లక్ష్యం కోసం తపించాడు... ఇప్పుడు సంగీతంలో ఎవరూ అందుకోని అరుదైన ఘనతను సాధించాడు... ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పియానో వాయించే వాద్యకారుడిగా గుర్తింపు పొందిన ఓ యువకుడి కథ. సంగీతంలో రెండు వాయిద్యాల్లో 8వగ్రేడు, రెండు డిప్లమోలు అందుకున్న హైదరాబాద్‌కు చెందిన డా.టి.ఎస్‌.సతీష్‌ స్వీయ గాథ.

మా నాన్న జయప్రకాశరావు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు... మేం నలుగురు సంతానం. నేనే మొదటివాడిని. ఇంట్లో హార్మోనియం ఉండేది. నాన్న దానిపై సాధన చేస్తుంటే అందరూ గొప్పగా చూసేవారట. అయితే ఆయనకు కుటుంబ బాధ్యతలు, టీచర్‌గా విధులతో సంగీతం కొనసాగించడం సాధ్యపడలేదు. కానీ నాపై నాన్నకు చాలా ఆలోచనలుండేవి... మూడేళ్ల వయస్సులోనే నన్ను హార్మోనియం ముందు కూర్చొబెట్టే వారంట. ఆ వయస్సులో హార్మోనియం మెట్లపై వేళ్లు కదిలిస్తుంటే అమ్మ, నాన్న  ఆనందించేవాళ్లట. నేను నాలుగో తరగతిలో అనుకుంటా... స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ప్రదర్శన ఇస్తే అంతా ఆశ్చర్యపోయారు. మా ప్రధానోపాధ్యాయులు నాకు బహుమతులిచ్చిన రోజును నేను మరిచిపోలేను. ఇక అప్పటి నుంచి సంగీత సాధన నా జీవితంలో ముఖ్య భాగమైంది. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు స్కూల్‌ నుంచి రాగానే హోంవర్క్‌, చదువు రెండు గంటల్లో పూర్తి చేసి హార్మోనియం ముందు వాలిపోయేవాణ్ణి. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో ఉన్న ఏ ఒక్క రోజూ కీబోర్డు మీద వేళ్లు కదపకుండా ఉన్నది లేదు. కొంతమంది స్నేహితుల ఇళ్లలోకి తీసుకెళ్లి పియానో చూపించేవాడు. కొత్త పియానో కొనే పరిస్థితి లేకపోయినా ఇంటర్‌లో తొలిసారి నాకోసం నాన్న సెకండ్‌ హ్యాండ్‌ పియానో కొన్నారు...  అప్పటి నుంచి అది నాకో నేస్తమైంది. కబుర్లు, సరదాలు అన్నీ దాంతోనే. చిన్నగా ఆ సరదా కాస్తా ఓ లక్ష్యంగా మారిపోయింది.  ఏదో రోజు సంగీతంలో నాకంటూ ఓప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని అనిపించేది.

ఇక నాన్న తాను సాధించలేనిది నేను చేయాలనుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే తనలో నన్ను చూసుకునేవారు. తానే పియానోపై శిక్షణ ఇచ్చేవారు. పాఠశాల, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఇలా చదువుతోపాటే కీబోర్డుపై ఎక్కువ పట్టు సాధించాను. ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన లండన్‌లోని ట్రినిటీ కళాశాలలో నాకు సంగీతం నేర్పించాలని నాన్న కలగనేవారు.  నాకూ ఆసక్తి ఉంది. అప్పటికి ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు. కానీ నాన్న కష్టంగానే డబ్బు సర్దుబాటు చేసి నన్ను లండన్‌ పంపారు.

నాన్న ఆశయం, నా సంకల్పం ఓ సాధారణ విద్యార్థిగా లండన్‌ వెళ్లిన నాకు అరుదైన గౌరవాన్నిచ్చాయి.  లండన్‌ ట్రినిటీ కళాశాలలో దేశదేశాల నుంచి చాలామందే శిక్షణ పొందుతున్నారు. కానీ అక్కడ ఏదో ఒక వాయిద్యంలో 8వ గ్రేడ్‌ వరకూ పూర్తి చేసిన వాళ్లు తక్కువే. అందులో డబుల్‌ 8వ గ్రేడ్‌ పూర్తి చేసింది ప్రపంచంలో నేనొక్కడినే. ఇదే కళాశాల నుంచి సంగీత దర్శకులు ఎ.ఆర్‌.రహమాన్‌ పియానోలో 8గ్రేడ్‌ పూర్తి చేశారు. ఇళయరాజా గిటార్‌లో 8వ గ్రేడ్‌ పూర్తి చేశారు. నేను పియానోతో పాటు, డ్రమ్స్‌లో 8వ గ్రేడ్‌ పూర్తి చేశాను. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ సంగీతం, తబలాలో డిప్లమా పూర్తి చేశాను. ఇలా రెండు వాయిద్యాల్లో 8వగ్రేడు, రెండు డిప్లమాలు సాధించనవారిలో ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా నిలబడగలిగాను. నాన్న ఆశయాన్ని తీర్చగలిగాను.

ఇవీ ఘనతలు...

* ఒక సెకన్‌లో 47నోట్స్‌ ప్లే చేయగలిగారు.
* మొత్తం 35 ప్రపంచ రికార్డు పుస్తకాల్లో ఆయన పేరు ఉంది. 
* స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌  భారత్‌ గౌరవ పురస్కార్‌ ద్వారా కళాశిరోమణిని అందించింది.
* పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం కళారత్న అందుకున్నారు.
* విజయవాడ లయోలా కళాశాల నుంచి గాన కళానిధి అందుకున్నారు.
* గుజరాత్‌ ఇండియా జీనియస్‌ ఫౌండేషన్‌ మ్యూజికల్‌ జీనియస్‌ను అందించింది.

 - సుంకరి అరుణ్‌, బన్సీలాల్‌పేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని