Published : 02 Jul 2016 01:25 IST

అందానికి మెరుగులద్దుతాం..ఆన్‌లైన్‌లో!

అందానికి మెరుగులద్దుతాం..ఆన్‌లైన్‌లో!

కాలేజీ కుర్రకారు నుంచి ఫ్యాషన్‌ బ్రాండ్ల వరకు చూపంతా వారిపైనే...
- వాళ్లేం సినిమా తారలు కాదు...

పైసా తీసుకోకుండానే అక్షరలక్షల సౌందర్య సలహాలిస్తారు...
- అలాగని సేవాతత్పరులు కాదు...

సూపర్‌మోడళ్లలా పోజులిస్తూ వెబ్‌సైట్లో ఫొటోలు పెట్టేస్తుంటారు...
- వాళ్లకేం క్యాట్‌వాక్‌లు తెలియదు...

మిలన్‌ షోలు, లాక్మే వీక్‌లపై అలవోకగా విశ్లేషణలు రాసేస్తారు...
- అపర రచయితలన్న పేరు మాత్రం ఉండదు...
ఇంతకీ వాళ్లెవరు? ఆసక్తినే అక్షరాలుగా మలిచి సంపాదనకూ దారులు వేసుకుంటున్న ఔట్‌ఫిట్‌ బ్లాగర్లు. తమ ప్రతిభతో ప్రపంచాన్ని సొగసుమయం చేయాలనుకునే ఔత్సాహికులు... జోరు మీదున్న ఆ ట్రెండ్‌పై కథనం.

లక్షలు ఉంటేగానీ బొటిక్‌ పెట్టలేం. డిజైనర్‌గా అవకాశం అందుకోవాలన్నా కష్టమే. మరి ప్రతిభ ఉండి ఫ్యాషన్‌నే ప్యాషన్‌గా భావించే వారి సంగతేంటి? ఇలాంటి వాళ్లే బ్లాగర్లుగా మారిపోతున్నారు.
ఐదారువేలతో వెబ్‌సైట్‌ పెడితే టాలెంట్‌నంతా అక్షరాల్లో కుమ్మరించొచ్చు. కంటెంట్ బాగుంటే ఆటోమేటిగ్గా అభిమానులు పెరిగిపోతారు. తారలూ లుక్కేస్తారు. ప్రముఖ బ్రాండ్లు ఆహ్వానం పలుకుతాయి. కానీ వీటన్నింటికన్నా ముందు ఫ్యాషన్‌ ప్రియుల్ని మెప్పించాలి. అదెలా? బొటిక్‌కు వెళ్లకుండానే సొగసు కిటుకులు చెబుతామంటే.. మేగజైన్లు తిరగేయకుండా తాజా సంగతులన్నీ వివరిస్తామంటే అభిమానులు మాత్రం అనుసరించకుండా ఉంటారా? అందుకే ఈ ట్రెండు జోరు మీదుంది. బ్లాగర్ల సంఖ్య 300 దాటింది. బ్లాగు నుంచి వయా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌... లాంటి సామాజిక మాధ్యమాలతో కోట్లమందిని చేరుతున్నారు.

పరిధి ఎక్కువ
హెయిర్‌స్టైల్‌ నుంచి హైహీల్స్‌ దాకా.. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ విశేషాల దాకా.. ఫిట్‌నెస్‌ నుంచి ఫిట్‌గా ఉన్న శరీరానికి నప్పే ఔట్‌ఫిట్స్‌ దాకా బ్లాగర్లు స్పృశించని అంశం ఉండదు. ఆఫీసువేర్‌, కాలేజీ స్టైల్‌, పెళ్లి, పండగ.. ప్రతి సందర్భం రాయడానికి అనుకూలమే. పైగా వీళ్లే డిజైనర్లు, మోడళ్లు, విశ్లేషకులూ. ఫొటోషాప్‌ ఫొటోలుండవు, విషయాన్ని అతిగా చెప్పరు. సూటిగా, సుత్తిలేకుండా వాస్తవికంగా ఉండే ఈ అంశాలు ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. ఉన్నంతలో కాస్త స్టైల్‌గా కనపడాలని భావించేవారు, నచ్చిన తారల్లా పోజు కొట్టాలనుకునేవారు ఇక ఈ బ్లాగర్లను ఫాలో కాకుండా ఉంటారా? ‘రాసేవాళ్లకి ఫ్యాషన్‌ స్కూళ్లనుంచి పట్టాలు పొందాలనే నిబంధనేం లేదు.. సృజనాత్మకత, డ్రెస్సింగ్‌ సెన్స్‌, తాజా ట్రెండ్‌ల గురించి తెలిస్తే చాలు. ఎవరైనా రాయడం మొదలుపెట్టొచ్చు’ అంటుంది తెలుగు బ్లాగర్‌ చందన.

సంపాదనకూ మార్గం
ఔట్‌ఫిట్‌ బ్లాగ్‌ ఆసక్తికి వేదిక మాత్రమే కాదు.. కాస్త మనసు పెడితే సంపాదనకూ మార్గముంటుంది. రాత బాగుంటే పేజీ వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. చెప్పే తీరు నచ్చితే అభిమానులూ పోగవుతారు. ఇంకేం.. వద్దన్నా ఫేమ్‌ వచ్చి పడుతుంది. ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్లతో చర్చలు మొదలవుతాయి. మార్కెట్లోకి వదిలే తమ డిజైన్లపై రివ్యూలు రాయమని కోరతాయి. ఒప్పందాలు చేసుకుంటాయి. ప్రతిఫలం ఘనంగానే ముడుతుంది. లాక్మే, విల్స్‌లాంటి పేరున్న ఫ్యాషన్‌వీక్‌లతో సహా చిన్నాచితకా ఫ్యాషన్‌ షోలకు ఆహ్వానాలందుతాయి. పనిలో పనిగా సొంత బ్రాండ్‌తో ఆన్‌లైన్‌లోనే అమ్మకాలు మొదలుపెట్టొచ్చు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ప్రతి తారతో రాసుకు తిరగొచ్చు. అయితే ఆసక్తి సంపాదనగా మారాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు అన్నది అనుభవజ్ఞుల సలహా.

తెలుగమ్మాయి టాప్‌

ట్‌ఫిట్‌ బ్లాగర్లలో ముంబై, దిల్లీ, బెంగళూరు వాళ్లదే ఆధిపత్యం. వారికి పోటీగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి చందనా మునిపల్లె. మొదట్నుంచీ ఫ్యాషన్‌పై మక్కువ చూపే తను బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశాక 2010లో సరదాగా బ్లాగు తెరిచింది. అప్పటికి హైదరాబాద్‌లో తనే తొలి స్టైల్‌ బ్లాగర్‌. మొదట్లో ఉద్యోగం చేస్తూ వ్యాసాలు రాసేది. తాజా ట్రెండ్స్‌, సెలెబ్రెటీ స్టైల్‌, రోజువారీ సూచనలతో మొదలెట్టి ప్రస్తుతం టాప్‌ ఫ్యాషన్‌ బ్రాండ్ల డిజైన్స్‌పై రివ్యూలు కూడా రాస్తోంది. పేరు, సంపాదన పెరగడంతో ఇప్పుడు పూర్తి సమయం బ్లాగుకే కేటాయిస్తోంది. బ్రాండ్‌ ప్రమోషన్‌, సోషల్‌మీడియా మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌.. ఏ సలహాలు కావాలన్నా సిద్ధం. మోడల్‌కి ఏమాత్రం తగ్గకుండా స్టైల్‌గా కనపడే చందన వెబ్‌సైట్‌ని నెలకు అరవై వేలమంది చూస్తారు. ఆమె ఫేస్‌బుక్‌ పేజీకి, ఇన్‌స్టాగ్రామ్‌కి నాలుగున్నర వేల మంది చొప్పున అభిమానులున్నారు.

www.thegirlatfirstavenue.com

అబ్బాయిల్లో అదుర్స్‌

మ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల కోసం ఫ్యాషన్‌ బ్లాగులు నడిపేవాళ్లు తక్కువే. ఆ కొరత తీర్చడానికి నేనొచ్చానంటాడు పురుష్‌ ఆరీ. అసలు పేరు ఆర్వీ పురుషోత్తమన్‌. ఇతగాడి బ్లాగు ఇండియాలోని టాప్‌ 5 బ్లాగుల్లో ఒకటిగా ఎంపికైంది. ఈ చెన్నై కుర్రాడి కంటెంట్‌ని జీక్యూ ఇండియా, మెన్స్‌ఎక్స్‌పీ, బజ్‌ఫీడ్‌లాంటి ప్రముఖ వెబ్‌సైట్లు సైతం వాడుకుంటాయి. వ్యాన్‌హ్యూసెన్‌, లూయిస్‌ ఫిలిప్పే, ప్యాంటలూన్స్‌, అర్‌వింద్‌ బ్రాండ్స్‌, రేమాండ్స్‌లాంటి లగ్జరీ బ్రాండ్లతో సైతం పనిచేస్తున్నాడు. ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డీసీఐ) తరపున నిర్వహించే ఫ్యాషన్‌ షోలపై కూడా అధికారిక రివ్యూలు రాస్తున్నాడు.

www.purushu.com

12 లక్షల అనుచరులు

లూథియానా అమ్మాయి నిఖితా భాటియా బ్లాగుతోపాటు పత్రికలకు వ్యాసాలూ రాస్తోంది. క్లుప్తంగా, ఆకట్టుకునేలా రాయడం ఆమె స్టైల్‌. బ్లాగడ్డా నుంచి బెస్ట్‌ ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ బ్లాగ్‌గా అవార్డు అందుకుంది. షాపింగ్‌ కిటుకులు, పాతాకొత్త కాలం ఫ్యాషన్లు, బాలీవుడ్‌ హిట్‌ స్టై్టల్స్‌ అన్నీ చెబుతుంది. హెయిర్‌స్టైల్‌లో ఆమె టచ్‌ చేయని అంశాలు లేవంటారు. పన్నెండులక్షల అరవైవేల మంది అభిమానులు నిఖిత బ్లాగ్‌ ఎంత హిట్టో చెబుతారు.

www.theshopaholic-diaries.com

ఫిట్‌నెస్‌ కలగలిపి

ఫ్యాషన్‌ అంటే ఇష్టం ఉన్న ఔత్సాహికులను ఫ్యాషన్‌ఐకాన్లుగా మార్చడమే నా బ్లాగు ఉద్దేశం అంటోంది తన్వీ రస్తోగి. స్టైల్‌తో పాటు ఫిట్‌నెస్‌ కిటుకులు చెప్పడం ఈ అమ్మాయి ప్రత్యేకత. అందులో ఏ కొత్త ట్రెండ్‌ వచ్చినా వివరాలు, విశ్లేషణలు ఉంటాయి. వీటిపై ఏ సందేహం ఉన్నా పాఠకులతో నిరభ్యంతరంగా పంచుకుంటుంది. ఫేస్‌బుక్‌ పేజీని ఏడువేలమంది లైక్‌ చేస్తే, నాలుగువేలమంది ట్విట్టర్‌లో అనుసరిస్తున్నారు.

http://www.tanvii.com

ప్రముఖ సంస్థల మెప్పు

నాలుగేళ్ల కిందటే మొదలెట్టి టాప్‌ బ్లాగర్‌గా ఎదిగింది దిల్లీ అమ్మాయి దేవీనా మల్హోత్రా. ఫుడ్‌, వెడ్డింగ్‌, బ్యూటీ, బాలీవుడ్‌ తారల జీవనశైలి, కొత్త ట్రెండ్స్‌.. అన్నింటిపై అలవోకగా రాసేస్తుంది. టాప్‌షాప్‌, షాపర్స్‌స్టాప్‌, బిబా, ఆసుస్‌, హిందుస్థాన్‌టైమ్స్‌లాంటి ప్రముఖ సంస్థలు ఈమె బ్లాగ్‌కి భాగస్వాములు. ఈ ఏడాదే కాస్మోపాలిటన్‌ పత్రిక నుంచి బెస్ట్‌ లైఫ్‌స్టైల్‌ బ్లాగర్‌గా అవార్డు అందుకుంది.

www.guiltybytes.com

వ్యాపారం నుంచి

  భిలాష పుణె అమ్మాయి. ఫిట్‌నెస్‌ జంకీ. ఎంబీఏ పూర్తవగానే భర్తతో కలిసి నూట్రీషన్‌ సప్లిమెంట్స్‌ కంపెనీ ప్రారంభించింది. దాంట్లో భాగంగా కొన్ని ఫ్యాషన్‌ బ్రాండ్లతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. స్వతహాగా ఫొటోగ్రఫీ మీద కూడా ఇష్టం ఉండటంతో బ్యూటీ, మేకప్‌ సలహాలిస్తూ బ్లాగు రాయడం ప్రారంభించింది. ఆమె ఫేస్‌బుక్‌ పేజీని మూడువేల నాలుగువందల మంది లైక్‌ చేశారు. స్టైల్‌ తేలిగ్గా అర్థం కావడానికి ఫొటోలు, వీడియోలు జత చేస్తోంది.

http://www.lookinggood feelingfab.com

సినిమాలు వదిలి

  బ్రాండ్ల జోలికి వెళ్లకుండా, భారీగా ఖర్చు పెట్టకుండా కుర్రకారును ఫ్యాషన్‌ ఐకాన్లుగా మార్చేస్తానంటోంది రొక్సానా డిసౌజా. నాలుగేళ్ల కిందట ప్రారంభించిన ఆమె బ్లాగ్‌ ఫాలోయర్ల సంఖ్య లక్ష దాటేసింది. కొత్త ఫ్యాషన్లు, వాటిలో హిట్‌ కొట్టినవీ, ఫట్‌ అయినవీ చెబుతుంది. దేశాలు చుట్టేయడం ఇష్టపడే రొక్సానా అక్కడి ఫ్యాషన్లనీ పరిచయం చేస్తోంది. ఫ్యాషన్‌ అండ్‌ డిజైనింగ్‌ కోర్సు చదివిన తర్వాత రెండు బాలీవుడ్‌ సినిమాలకు కాస్టూమ్‌ డిజైనర్‌గా కూడా పనిచేసింది. తర్వాత కొన్నాళ్లు ఓ ఫ్యాషన్‌ మేగజైన్‌ నడిపి ప్రస్తుతం సొంతంగా ఈ బ్లాగు రాస్తోంది.

http://www.head2heels.co

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు