నగధీరుల నయా స్టైల్‌

కళ్లకి కాటుక.. అధరాలకు లిప్‌స్టిక్‌.. ఒంటిపై నగలు.. చేతిలో పర్స్‌.. కాళ్లకు జిగేల్‌మనే పాదరక్షలు.. ఇవన్నీ ధరిస్తే కచ్చితంగా మోడ్రన్‌ అమ్మాయే. మరి మగాళ్లూ వీటిపై మోజు పడితే? నయా ట్రెండ్‌ అనాలేమో!

Published : 28 Jan 2017 01:15 IST

నగధీరుల
నయా స్టైల్‌

కళ్లకి కాటుక.. అధరాలకు లిప్‌స్టిక్‌.. ఒంటిపై నగలు.. చేతిలో పర్స్‌.. కాళ్లకు జిగేల్‌మనే పాదరక్షలు.. ఇవన్నీ ధరిస్తే కచ్చితంగా మోడ్రన్‌ అమ్మాయే. మరి మగాళ్లూ వీటిపై మోజు పడితే? నయా ట్రెండ్‌ అనాలేమో! ఈతరం కుర్రాళ్లు కొందరు జుత్తు నుంచి పాదాలదాకా సొగసుకత్తెల ఫ్యాషన్‌ని మక్కిమక్కీగా దించేస్తున్నారు. అమ్మాయిల సౌందర్యోపకరణాలనే కాస్త అటుఇటుగా మార్చేసి వాడుతున్నారు. మగధీరుల అందాల్ని రెట్టింపు చేస్తున్న ఉపకరణాలివి.

మెక్లెస్‌: ఆభరణాలపై మోజు పడేది అమ్మాయిలే అనే అభిప్రాయం ఉంటే వెంటనే మార్చేసుకోండి. కొందరు మగధీరులకూ నగలంటే తగని మమకారం. బాలీవుడ్‌లో బప్పీలహరి.. హాలీవుడ్‌లో జానీడెప్‌, విల్‌స్మిత్‌, బ్రాడ్‌పిట్‌ వీళ్లంతా ఆభరణప్రియులే. వీళ్లు మెడలో వేసుకొనే హారాన్నే మెక్లెస్‌ అంటున్నారు.

మాండల్స్‌: ఔను.. అమ్మాయి వేస్తే శాండిల్స్‌.. అబ్బాయి తొడిగితే మాండల్స్‌. ఈ రెంటికీ పెద్దగా తేడాలుండవు. పాదం నుంచి కాలి పిక్కల దాకా చుట్టేసే లాంగ్‌ మాండల్స్‌ ఇప్పుడు బాగా పాపులర్‌.

మన్‌స్కారా, గైలైనర్‌: కళ్లకు అదనపు సొగసులు అద్దడానికి అమ్మాయిలు కాటుక, ఐలైనర్‌ వాడటం తెలిసిందే. ఈ స్టైల్‌ని ఆచరించడంలో ఆధునిక అబ్బాయిలూ తీసిపోవడం లేదు. పాటగాడు ఆడమ్‌ లాంబార్ట్‌ ఈ ఫ్యాషన్‌కి ఆద్యుడు. తను కళ్లకు కాటుక లేకుండా స్టేజీ ఎక్కిన దాఖలాల్లేవు.

మర్స్‌: బ్యాగ్‌కి, బ్యాక్‌ప్యాక్‌కి తక్కువ. ఫ్యాషన్‌కి ఎక్కువ. అమ్మాయిల పర్స్‌లాగే దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ మర్స్‌తో తరచుగా కనిపించే మొనగాడు ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో.

మగాళ్ల లిప్‌స్టిక్‌: అమ్మాయిలు లిప్‌స్టిక్‌ వేసుకుంటే మొహంలో వచ్చే కళే వేరు. అమ్మాయిలకు పోటీగా పాప్‌స్టార్‌ బోయ్‌ జార్జ్‌, మార్లిన్‌ మాన్సన్‌లు ఈ సొగసుకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారు.

ఫ్యాషన్‌ వీక్‌లు, స్టేజీషోలు, ఆఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌.. తారలు ఈ నయా ధోరణి అనుసరిస్తుంటే.. వారిని అనుకరించే, అభిమానించే కుర్ర అభిమానులు ఈ ట్రెండ్‌ని వీధుల్లోకి చేర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని