మెలితిరిగిన కనుబొమలు.. మేలిమి వన్నెలు!

దేహం ఓ ప్రయోగశాల! దాంతో ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చు. కావాలంటే స్టైల్‌, ఫ్యాషన్‌పై మోజు చూపించే కుర్రకారును అడిగి చూడండి. కాలి గోరు నుంచి తల వెంట్రుకలదాకా కాదేదీ ఫ్యాషన్‌కి అనర్హం..

Published : 09 Sep 2017 01:42 IST

స్టైలే వేరు!
మెలితిరిగిన కనుబొమలు.. మేలిమి వన్నెలు!

దేహం ఓ ప్రయోగశాల! దాంతో ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చు. కావాలంటే స్టైల్‌, ఫ్యాషన్‌పై మోజు చూపించే కుర్రకారును అడిగి చూడండి. కాలి గోరు నుంచి తల వెంట్రుకలదాకా కాదేదీ ఫ్యాషన్‌కి అనర్హం అన్నట్టు కొత్త కొత్త ట్రెండ్స్‌ సృష్టిస్తూనే ఉంటారు. ఆ వూపులో వచ్చిందే కనుబొమల్ని అలంకరించే ఫ్యాషన్‌. దీన్నే ‘స్విగిల్‌ ఐబ్రోస్‌’ అంటున్నారిపుడు. కనుబొమ్మల్ని అష్టవంకర్లూ తిప్పేసి.. వాటికి రకరకాల రంగులద్దేసి.. ఫొటోలు క్లిక్‌మనిపించి ఆన్‌లైన్‌లో పెట్టేసే ఈ నయా ధోరణి యమా జోరు మీదుంది. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌ ఎక్కడ చూసినా ఇదే సందడి. చక్కని చుక్కలతోపాటూ సక్కనయ్యలూ ఈ ఫ్యాషన్‌ గోదాలో దిగేసి తమ కనుబొమ్మలకు మెరుగులద్దేసి కళాతృష్ణ చాటుకుంటున్నారు. స్విగిల్‌ ఐబ్రోస్‌లో డ్రాగన్‌ బ్రోస్‌, ఫెదర్‌ బ్రోస్‌, బార్బ్‌డ్‌ వైర్‌ బ్రోస్‌, బ్లీచ్డ్‌ బ్రోస్‌.. బాగా పాపులర్‌. ఈ స్టైల్‌తో చెలరేగిపోయాక వాటిని ఫొటోలు తీసి ‘మెలితిరిగిన నా కనుబొమ్మలు చూడు.. మెచ్చేలా ట్వీటూ’ సామాజిక మాధ్యమాల్లో సొగసైన వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు యూత్‌. బ్యూటీ బ్లాగర్‌ ప్రామిస్‌ తమంగ్‌ ఈ ట్రెండ్‌కి ఆద్యురాలు. ఓసారి ఫొటోషాప్‌లో తన ఫొటోకి మెరుగులు దిద్దుతూ అనుకోకుండా కనుబొమ్మలతో ప్రయోగాలు చేసేసింది. అప్పుడు మెరిసిన ఫ్లాష్‌లాంటి ఆలోచనతో ఈ ట్రెండ్‌కి తెర తీసింది. అమెరికాలో మొదలైన ట్రెండ్‌ అప్పుడే యంగిస్థాన్‌నీ చుట్టేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని